శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 07:19:54

తెలంగాణ జైళ్ల శాఖ మాస్కులు రెడీ

తెలంగాణ జైళ్ల శాఖ మాస్కులు రెడీ

సైదాబాద్‌/ మాదన్నపేట: కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ ప్రబలకుండా  ఉపయోగపడే మాస్కుల తయారీలో తెలంగాణ జైళ్లశాఖ అధికారులు నడుంబిగించారు. ప్రజలకు సరిపడా మాస్కులు లేకపోవడంతో కలుగుతున్న ఇబ్బందుల నేపథ్యంలో తెలంగాణ జైళ్ల శాఖ చంచల్‌గూడ జైలు అధికారులు తమ వంతు సహకారంగా మాస్కులు తయారు చేస్తున్నారు. ఖైదీల చేత మాస్కులను తయారీ చేయించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాణ్యతతో కూడిన మాస్కులను తయారు చేసి 20 రూపాయలకే విక్రయిస్తున్నారు.

మై నేషన్‌ స్టాళ్లలో మాస్క్‌ల విక్రయాలు

చంచల్‌గూడ జైల్‌ పెట్రోల్‌ పంపు వద్ద ఉన్న మై నేషన్‌ స్టాల్‌లో మాస్కులను విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 5వేలకు పైగా మాస్కులు తయారు చేసి, శిక్షణలో ఉన్న వార్డర్లకు, జైలు సిబ్బంది, సీకా కార్యాలయం, జువైనల్‌ హోం, విద్యుత్‌ శాఖ, పాఠశాలల విద్యార్థులకు అందజేశామని, ప్రభుత్వ కార్యాలయాలకు, జువైనల్‌ హోంలకు, ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారికి రాయితీ ఇచ్చి కేవలం 15 రూపాయలకే మాస్కులను విక్రయించామని జైళ్లశాఖ అధికారులు తెలిపారు. చంచల్‌గూడ జైలు పెట్రోల్‌ పంపు వద్ద ఒకేరోజు 15వందల మాస్కులు విక్రయించామని, ఖైదీలు తయారు చేసిన మాస్కులకు మంచి స్పందన లభిస్తున్నదని, జైళ్ల శాఖ పెట్రోల్‌ పంపులు, మై నేషన్‌ ఔట్‌ లేట్‌ కేంద్రాల్లో సోమవారం నుంచి మాస్కుల విక్రయాలను కొనసాగిస్తామని జైళ్లశాఖ అధికారులు పేర్కొన్నారు.


logo