గురువారం 28 మే 2020
Telangana - May 15, 2020 , 02:52:29

24 గంటల్లో తల్లిచెంతకు చిన్నారి

24 గంటల్లో తల్లిచెంతకు చిన్నారి

  • వారసుడికోసం బాలుడి కిడ్నాప్‌
  • 80 సీసీ కెమెరాలసాయంతో కేసు ఛేదన

చార్మినార్‌: తొలి కాన్పులోనే కూతురు పుట్టింది. అతడు వారసుడి కోసం పిచ్చిగా తపించాడు. తర్వాత నాలుగు సంతానాలు నిలువలేదు. ఇక మగబిడ్డ పుట్టడని భావించి తన వారసుడి కోసం మరోఇంటి వారసుడిని ఎత్తుకొచ్చేశాడు. 80 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు 24 గంటల్లోనే కేసు ఛేదించారు. చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు. నిందితుడిని కటకటాల వెనక్కి పంపారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని చార్మినార్‌ తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన ఇబ్రహీం(38) పెయింటర్‌. అతడికి ఒక కుమార్తె. ఆ తర్వాత నలుగురు సంతానం కలిగినా కొద్దిరోజులకే కన్నుమూశారు. వారసుడి కోసం తీవ్రంగా తపించే అతడు.. ఎక్కడి నుంచైనా మగబిడ్డను తెచ్చుకొని పెంచుకోవాలనుకున్నాడు. భర్త చనిపోవటంతో చాదర్‌ఘాట్‌ నయాగరా హోటల్‌ సమీపంలో కుమారుడితో ఫుట్‌పాత్‌పై ఒంటరిగా జీవిస్తున్న రోహిణి అనే మహిళను గుర్తించాడు. కొద్దిరోజులు ఆమె కదలికలను రాత్రి సమయంలో గమనించాడు. మంగళవారం రాత్రి రోహిణి పక్కనే ఉన్న బాబును అపహరించాడు. కొద్దిసేపటి తర్వాత కొడుకు లేడని గుర్తించిన రోహిణి పోలీసులకు ఫిర్యాదుచేసింది.  నిందితుడికోసం వేట ప్రారంభించిన తూర్పుజోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్సై గోవింద్‌స్వామి బృందం చాదర్‌ఘాట్‌లో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించించింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించారు. చాదర్‌ఘాట్‌ నుంచి దారుల్‌షిఫా, మీర్‌ఆలంమండి, కోట్ల అలిజా, తలాబ్‌కట్ట తదితర ప్రాంతాల్లో నిందితుడు బైక్‌పై ప్రయాణించినమార్గంలో 80 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. బుధవారం వాహనం యజమాని ఇంటికి చేరుకున్నారు. తాను ఇబ్రహీం అనే వ్యక్తికి వాహనాన్ని విక్రయించానని చెప్పటంతో తలాబ్‌కట్టలోని ఇబ్రహీంను అరెస్టుచేశారు. అప్పటికే అపహరించిన చిన్నారికి అదిల్‌ అని పేరుమార్చి నామకరణోత్సవానికి కూడా ఇబ్రహీం ఏర్పాట్లుచేశాడు. అతడి నుంచి బాబును స్వాధీనం చేసుకొని కన్నతల్లి రోహిణికి అప్పగించినట్టు దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చక్రవర్తి తెలిపారు.


logo