బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 03:33:37

20 గంటల్లో తల్లిఒడికి బాలిక

20 గంటల్లో తల్లిఒడికి బాలిక

కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కిడ్నాప్‌కు గురైన మూడేండ్ల చిన్నారిని హైదరాబాద్‌ పోలీసులు 20 గంటల్లో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌జిల్లా వీపనగండ్ల మండలం సింగినాయ్‌పల్లెకు చెందిన సంగమోని శివుడు, పర్వతమ్మకు ఆరేండ్ల కిందట వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. జగిత్యాల జిల్లాలో కూలిపని చేస్తున్న వీరు ఈ నెల 14న స్వస్థలానికి వెళ్లేందుకు రాత్రి 8.30 గంటలకు ఎంజీబీఎస్‌ చేరుకున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురానికి చెందిన సంగటి రామాంజనేయులు, జయలక్ష్మి దంపతులు కొండాపూర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వీరు మూడేండ్ల కూతురు అవంతిక(3) బంధువులతో కలిసి కర్ణాటకలోని బళ్లారికి వెళ్లేందుకు బస్సు ఎక్కారు. 9.30 గంటల సమయంలో రామాంజనేయులు సోదరుడు బళ్లారికి రానని దిగడంతో, పెద్దవాళ్లంతా బస్సు దిగి చర్చిస్తుండగా..అవంతిక కూడా బస్సు దిగి ఓ పక్కకు వెళ్లిపోయింది. ఒంటరిగా ఉన్న చిన్నారిని చూసి న శివుడు, పర్వతమ్మ బాలికను తీసుకొని పరారయ్యారు. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న అఫ్జల్‌గంజ్‌ పోలీసులు ఏడు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు.15న మహబూబ్‌నగర్‌కు బాలికతో శివుడు, పర్వతమ్మ వెళ్లినట్టు ఆర్టీసీ అధికారుల సాయంతో గుర్తించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సాయంత్రం 6 గంటలకు రైల్వేస్టేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. 20 గంటల్లోనే కేసును ఛేదించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.