ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 04:02:26

ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి

ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి

  • మూడేండ్లపాటు పదవిలోకొనసాగనున్న విశ్రాంత ఐఏఎస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా విశ్రాంత ఐఏఎస్‌ సీ పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదలచేశారు. ఆయన మూడేండ్లపాటు ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారు. పదవీవిరమణ పొందేవరకు నిబద్ధత గల అధికారిగా వివిధ హోదా ల్లో పార్థసారథి సేవలందించారు. 1985లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన పార్థసారథి డెహ్రడూ న్‌, ముస్సోరిలో రెండేండ్లపాటు శిక్షణ పొం దారు. 1987లో స్వరాష్ట్రంలో పనిచేయాలనే కాంక్షతో ఐఎఫ్‌ఎస్‌కు రాజీనామాచేశారు. 1987లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్‌-1 సాధించి ఆర్డీవో పోస్టుకు ఎంపికయ్యారు. విజయనగరం జిల్లాలో శిక్షణ పూర్తిచేసుకున్న ఆయన అక్కడే 1988 నుంచి 1993 ఆర్డీవోగా, ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, నిజామాబాద్‌ ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా, ఆదిలాబాద్‌ డీఆర్వోగా అనంతపురం, వరంగల్‌  జేసీగా,  కరీంనగర్‌ కలెక్టర్‌గా పనిచేశారు. 2006 నుంచి 2011 జూన్‌వరకు మార్క్‌ఫెడ్‌, ఐఅండ్‌పీఆర్‌ ఎండీగా ఉన్నారు. తర్వాత ఏపీ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌, ఎక్స్‌ అఫీషియో సెక్రటరీగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పౌరసరఫరాలశాఖ కమిషనర్‌, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు. తెలంగాణ వర్సిటీ, కొండాలక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్‌ వర్సిటీ, బీర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీల వీసీగానూ కొనసాగారు. మూడేండ్లు ముంబైలో బోర్డ్‌ ఆఫ్‌ నాబార్డ్‌ డైరెక్టర్‌గా, ఓఈసీడీ సీడ్‌ స్కీం జాతీయ టాస్క్‌ఫోర్స్‌ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 

ఎన్నో అవార్డులు..

వృత్తి జీవితంలో పార్థసారథి ఎన్నో అవార్డులను సొంతంచేసుకున్నారు. రైతుబంధు, రైతుబీమాను విజయవంతంచేసి సీఎం కేసీఆర్‌, కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు పొందారు. 2019 లో ‘బెస్ట్‌ బివోల్‌ టైన్‌ స్కిల్‌ ప్రొడ్యూసింగ్‌ స్టేట్‌ అవార్డు’ను స్వీకరించారు.  ఎస్‌ఈసీగా నియమితులవడంతో సీఎం కేసీఆర్‌ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


logo