గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 03:06:34

ఉచిత ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలా?

ఉచిత ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలా?

  • హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ సహకారంతో వందమందికి ప్రాణవాయువు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌19 రోగులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య శ్వాస ఆడకపోవడం. సరిపడా ఆక్సిజన్‌ అందని సందర్భాల్లో చాలామందికి వైరస్‌ ప్రాణాంతకంగా మారుతున్నది. ఇలాంటి సమయంలో తామున్నామంటూ హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ (హెచ్‌హెచ్‌ఎఫ్‌) కొవిడ్‌ రోగుల పాలిట ప్రాణవాయు దాతగా నిలుస్తున్నది. ఈ సంస్థ అందిస్తున్న ఉచిత ఆక్సిజన్‌ సిలిండర్లతో 15 రోజుల్లో హైదరాబాద్‌కు చెందిన 100 మంది కొవిడ్‌-19 రోగులు కోలుకున్నారు. ఈ సంస్థ నిర్వాహకులు హోం క్వారంటైన్‌లో ఉంటున్న పాతబస్తీకి చెందిన 100 మంది కొవిడ్‌ రోగులకు ప్రాణవాయువును అందించారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తి మెడికేషన్‌తో కూడిన ఆక్సిజన్‌ థెరఫీని ఇంటివద్దే అందిస్తున్నారు. హెచ్‌హెచ్‌ఎఫ్‌ వలంటీర్ల సేవలతో గడిచిన పది రోజుల్లో 85 శాతం మంది రోగులు కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. మరో ఎనిమిది శాతం మంది స్వల్పంగా కోలుకున్నారు. గత 15 రోజుల్లో 94 శాతం రికవరీ రిజిస్టర్‌ రేటుతో కరోనా రోగులు 100 వందమంది వ్యాధి నుంచి కోలుకున్నారు. పరిస్థితి బాగోలేని ఏడుశాతం మంది రోగులను మాత్రమే దవాఖానకు తరలించారు. వీరిలో ఆరుగురు చనిపోయారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు సహకరించని కారణంగా దవాఖానకు తరలించడంలో జాప్యం వల్లే వీరు మరణించినట్ట సంస్థ వెల్లడించింది. 90 శాతం కంటే ఆక్సిజన్‌ తక్కువగా ఉన్న రోగుల వద్ద నుంచే ప్రాథమికంగా ఫిర్యాదులు అందుతున్నాయని, రుచి తెలియకపోవడం, వాసన కోల్పోవడం, జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు హోం కేర్‌ ట్రీట్‌మెంట్‌ ప్రారంభంలో గుర్తిస్తామని హెచ్‌హెచ్‌ఎఫ్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ముజ్తబా హసన్‌ అక్సరీ తెలిపారు. కరోనా నిర్ధారణ అయి హోంక్వారంటైన్‌లో ఉన్న రోగులు తమకు ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమని భావించినా, వారికి వైద్యం అందిచే డాక్టర్ల సూచన మేరకు కూడా ఉచితంగా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ పరిధిలోని రోగులకు మాత్రమే ఈ సదుపాయం అందిస్తున్నామని తెలిపారు. ఉచిత ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమైన వారు 8897867726/8977898706 నేరుగా ఫోన్‌ ద్వారా కానీ, వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా కానీ సంప్రదించవచ్చన్నారు. కరోనా రోగి వైద్యపరీక్షల నివేదికలు, వారికి వైద్యం అందిస్తున్న డాక్టర్‌ నుంచి హెచ్‌హెచ్‌ఎఫ్‌ సంస్థ ప్యానెల్‌ డాక్టర్లు సంప్రదించిన తర్వాత అవసరం మేరకు ఈ ఆక్సిజన్‌ సిలిండర్లు పూర్తి ఉచితంగా ఉందిస్తామని, వారు కోలుకునే వారకు ఈ ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు.logo