బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 21:45:11

హైదరాబాద్‌లో రైస్‌ ఏటీఎం : 12 వేల మందికి అన్నదాత

హైదరాబాద్‌లో రైస్‌ ఏటీఎం : 12 వేల మందికి అన్నదాత

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి మద్దతుగా వియత్నాం వ్యాపారవేత్త హోవాంగ్ తువాన్ అన్హ్ ‘బియ్యం పంపిణీ’ యంత్రాన్ని అభివృద్ధి చేసి ఎందరినో ఆదుకున్నాడు. ఈయనను ఆదర్శంగా చేసుకుని హైదరాబాద్‌కు చెందిన ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్‌.. తాను కూడా పేదలకు ఎంతో కొంత సాయపడాలని తలంచి బియ్యం ఏటీఎంను తెరిచి ఎందరో పేదలకు అన్నదాతగా మారాడు.

హైదరాబాద్‌కు చెందిన రాము దోసపాటి ఎంబీఏ పూర్తిచేసి చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు. తాను ఉంటున్న ప్రాంతంలోని వాచ్‌వుమెన్‌ లక్ష్మమ్మ పడుతున్న బాధను చూసి చలించిపోయాడు. తాను సంపాదించే జీతం డబ్బులను బియ్యం కొనుగోలుకు వెచ్చించి పేదల ఆకలితీర్చేలా ఎల్బీనగర్‌ ప్రాంతంలో రైస్‌ ఏటీఎం ను ఏర్పాటుచేశాడు. దినసరి కూలీలు, వలస కార్మికులకు 150 రోజుల పాటు ఒక్కో కుటుంబానికి ఐదు రోజులకు సరిపడా బియ్యం అందించి వారి పాలిట అన్నదాతగా నిలిచాడు. ఏప్రిల్‌ నెలాఖరు నుంచి ఇప్పటివరకు 12 వేల మందికి పైగా బియ్యం అందించారు. "ఎవరూ ఆకలితో నిద్రపోకూడదని నేను నమ్ముతాను. ఎవరైనా వచ్చి బియ్యం తీసుకోవచ్చు. పేదలు ఆకలితో పడుకోకూడదనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటుచేశాను" అని చెప్పారు రాము దోసపాటి. 2006 లో రాము దోసపతి పెద్ద ప్రమాదానికి గురై కోలుకున్నాడు. దవాఖానలో ఉన్న సమయంలో "నాకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తే ప్రజలకు సేవ చేస్తానని దేవుడిని నిత్యం మొక్కుకునే వాడిని. దేవుడికి చేసిన వాగ్దానాన్ని పూర్తిచేస్తున్నాను" అని తెలిపారు. బియ్యం పంపిణీకి తన జీతం సరిపోకపోవడంతో తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి రూ.3 లక్షలను కూడా వెచ్చించారు. పేదల కోసం రాము చేస్తున్న ఉదాత్త పనులను చూసిన మరికొందరు కూడా ఆయనకు మద్దతుగా నలిచారు. ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఒకరు కూడా ఈ ఏటీఎం నుంచి బియ్యం తీసుకున్నాడు. గత ఆరు నెలలుగా తనకు జీతం అందకపోవడంతో తప్పని పరిస్థితుల్లో రైస్‌ ఏటీఎంను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. రాము దోసపాటి చేస్తున్న సేవలను స్థానికులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.


logo