బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 19:58:29

క‌రోనా వైర‌స్ రెండోసారి వేధిస్తుందా..?

క‌రోనా వైర‌స్ రెండోసారి వేధిస్తుందా..?

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ ఒక వ్య‌క్తికి ఒక‌సారే సోకుతుందా? ‌ఒక‌సారి వైర‌స్ సోకి త‌గ్గిందంటే మ‌ళ్లీ ఆ వైర‌స్ ప్ర‌భావం మ‌న‌పై ఉండ‌దా..? ఒక‌సారి వైర‌స్ బారిన‌ప‌డి కోలుకున్నవాళ్లు ఇక క‌రోనాతో త‌మ‌కు ఎలాంటి స‌మ‌స్య ఉండ‌బోద‌ని నిశ్చింతగా ఉండొచ్చా..? అంటే అస్స‌లు కుద‌ర‌ద‌ని తేలింది. ఒక‌సారి క‌రోనా వ‌చ్చి త‌గ్గిపోయిన వ్య‌క్తికి రెండోసారి క‌రోనా రాద‌నుకోవ‌డం ఒట్టి అపోహ మాత్ర‌మేన‌ని స్ప‌ష్ట‌మైంది. స‌న‌త్‌న‌గ‌ర్ ఈఎస్ఐ ఆస్ప‌త్రికి చెందిన ఒక మేల్ న‌ర్సుకు ఒక‌సారి క‌రోనా సోకి త‌గ్గిపోయినా.. ఇప్పుడు మ‌రోసారి పాజిటివ్ వ‌చ్చింది. 

స‌న‌త్‌న‌గ‌ర్ ఈఎస్ఐ ఆస్ప‌త్రిలో ప‌నిచేసే సిబ్బందికి జూన్ 15 ర్యాండ‌మ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా 30 ఏండ్ల మేల్ న‌ర్సుకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అత‌డిని ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఐసోలేష‌న్‌లో ఉంచారు. 14 రోజుల క్వారెంటైన్ గ‌డువు ముగియ‌డంతో జూన్ 26న‌ మ‌రోసారి ప‌రీక్ష‌లు చేయ‌గా నెగెటివ్ రిపోర్టు వ‌చ్చింది. దీంతో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన అత‌నిలో ఇటీవ‌ల మ‌ళ్లీ ద‌గ్గు, జ్వ‌రం లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. 

దీంతో అనుమానం వ‌చ్చిన మేల్ న‌ర్సు మ‌రోసారి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు. ఈ ప‌రీక్ష‌ల్లో అత‌నికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. కాగా, మొద‌టిసారి వైర‌స్ సోకిన‌ప్ప‌టి కంటే రెండోసారి వైర‌స్ సోకిన‌ప్పుడే త‌న‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు తీవ్రంగా ఉన్నాయ‌ని మేల్ న‌ర్సు చెప్పాడు. కాగా, ఒకే వ్య‌క్తికి రెండోసారి క‌రోనా వైర‌స్ సోకే అవ‌కాశాలపై అశీశ్ చౌహాన్‌ను ప్ర‌శ్నించ‌గా.. మ‌నం ప్రస్తుతం క‌రోనా వైర‌స్ గురించి తెలుసుకునే ద‌శ‌లోనే ఉన్నామ‌ని, ఈ వైర‌స్ ఒక్కొక్క‌రిపై ఒక్కో విధంగా ప్ర‌భావం చూపుతున్న‌ద‌ని, అందువ‌ల్ల ఆ వైర‌స్ ఒకే పేషెంట్‌కు రెండోసారి సోకుతుందా లేదా అనే విష‌యాన్ని క‌చ్చితంగా చెప్ప‌లేమ‌ని తెలిపారు.          

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo