శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 02:35:01

నిర్లక్ష్యమే వైరస్‌!

నిర్లక్ష్యమే వైరస్‌!

  • జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని చూపని జనం
  • లాక్‌డౌన్‌లోనూ రోడ్డెక్కిన వందలవాహనాలు
  • రాజధాని రోడ్లలో బైక్‌లపై యువత చక్కర్లు
  • బంద్‌ అని తెలిసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పడిగాపులు

అంతఃపురంలో వేడుకల కోసం రాజ్యంలోని ప్రజలందరూ బిందెడు పాలు తీసుకొచ్చి గోళాల్లో పోయాలని చాటింపు వేశారట.. తమ ప్రజలే కదా అందరూ తెచ్చిన పాల నురగలతో కడవలన్నీ పొంగిపొర్లుతాయని భావించారట రాజుగారు.. తీరా చూస్తే కడవ లన్నీ నీళ్లతో నిండినయి కానీ పాలు మాత్రం కన్పించలేదట.. అందరూ పాలు పోస్తారు.. నేనొక్కడిని నీళ్లు పోస్తే ఏమవుతుందిలే అని ఒక్కొక్క రు తమకుతామే అనుకోవడంతో కడవలన్నీ నీళ్లతో నిండాయనేది ఆ కథ సారాంశం. ప్రస్తుతం కరోనా వైరస్‌వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను కొందరు ఇదేతీరులో భగ్నం చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై జనం యథేచ్ఛగా తిరిగారు. నేనొక్కడినే బయటకొస్తే ఏమవుతుందని అనుకోవడంతో రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అంతఃపురంలో వేడుకల కోసం రాజ్యంలోని ప్రజలందరూ బిందెడు పాలు తీసుకొచ్చి కడవల్లో పోయాలని చాటింపు వేశారట.. తమ ప్రజలే కదా అందరూ తెచ్చిన పాల నురగలతో కడవలన్నీ పొంగిపొర్లుతాయని భావించారట రాజుగారు.. తీరా చూస్తే కడవలన్నీ నీళ్లతో నిండినయి కానీ పాలు మాత్రం కన్పించలేదట.. అందరూ పాలు పోస్తారు.. నేనొక్కడిని నీళ్లు పోస్తే ఏమవుతుందిలే అని ఒక్కొక్కరు తమకుతామే అనుకోవడంతో కడవలన్నీ నీళ్లతో నిండాయని ఓ కథనం.. ప్రస్తుతం కరోనా వైరస్‌వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ విషయంలోనూ సరిగ్గా ఇదే జరుగుతున్నది. నేనొక్కడినే బయటకొస్తే ఏమవుతుంది? అనుకోవడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను కనీవినీ ఎరుగనిరీతిలో విజయవంతం చేసిన ప్రజలు లాక్‌డౌన్‌ విషయంలో ఆ స్ఫూర్తిని చూపడంలేదు. మరో వారంపాటు ఇంటికే పరిమితమైతే మహమ్మారిని తరిమికొట్టొచ్చని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తిచేసినా పట్టించుకోనట్టు కన్పిస్తున్నది. సోమవారం హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో పరిస్థితి ఇందుకు అద్దంపడుతున్నది. కొందరి నిర్లక్ష్యం వైరస్‌వ్యాప్తిని నిరోధించడం అటుంచి.. ఇంకా విజృంభించడానికి కారణమవుతున్నది. ‘నాకేమైతుందిలే’ అనే ధోరణి కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరంగా తయారయిందని పలువురు పేర్కొంటున్నారు. జనతాకర్ఫ్యూ సమయంలో 24 గంటలపాటు ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ఇంటికే పరిమితం కావడంతో శాస్త్రీయంగా కరోనా వైరస్‌ను విచ్ఛిన్నం చేశామనే చైతన్యం కనిపించింది. లాక్‌డౌన్‌ సమయంలో కొందరి నిర్లక్ష్యంతో  కరోనా అంతకంతకూ రెట్టింపు అయ్యే ప్రమాదమున్నది. 


మాస్క్‌లతో యువత చక్కర్లు

రోడ్లపైకి వచ్చినవారిలో  యువతే ఎక్కువ గా ఉన్నారు. వీళ్లంతా మాస్క్‌లు వేసుకొని బైక్‌లపై చక్కర్లు కొట్టడం కన్పించింది. వైద్యనిపుణులు, మేధావుల మథనం తర్వాతే ప్రభుత్వం  లాక్‌డౌన్‌ ప్రకటించింది. తద్వారానే కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చనే శాస్త్రీయ నిర్ణయానికొచ్చింది. మాస్క్‌లతోనే వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలిగితే ప్రభుత్వాలే ఆ వెసులుబాటు కల్పించేవి. ఈమాత్రం అవగాహన లేకుండా కొందరు మాస్క్‌లు వేసుకొని తాము సురక్షితంగా ఉన్నాంకదా అనే భావనతో రోడ్లపైకి వచ్చి తిరిగి సమూహంగా ఏర్పాటవుతున్నారు. తద్వారా నిజంగా అత్యవసర పనులపై వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతున్నది.

నిర్బంధం అవసరమా?

హైదరాబాద్‌లో సోమవారం ఒక్కొక్కరుగా రోడ్లమీదకు వచ్చారు. నిత్యం కిక్కిరిసిన వాహనాలతో ఉండే రోడ్లపై వీరి ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ, కూడళ్ల దగ్గరికొచ్చేసరికి వాహనాలన్నీ ఒకేచోట కలిసి తిరిగి సాధారణ జనజీవనాన్ని తలపించింది. ఇంటినుంచి బయటికొచ్చే వారంతా కూడళ్ల వద్ద కలవడంతో అదేపెద్ద వైరస్‌లా మారింది. దీంతో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు అధికారులందరూ రోడ్ల మీదకొచ్చి పదేపదే లాక్‌డౌన్‌ను గుర్తుచేయాల్సి వచ్చింది. బేగంపేట, ఆబిడ్స్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో కూడళ్ల వద్ద భారీఎత్తున వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలు కనిపించడంతో కొన్నిచోట్ల పోలీసులు కొద్దిగా కఠినంగా వ్యవహరించక తప్పలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్బంధంగా వ్యవహరిస్తే తప్ప ఎవరికివారు తమ బాధ్యతలను నిర్వర్తించలేరా? అనే నిర్లిప్తత వ్యక్తమవుతున్నది.logo