శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:39:44

హైదరాబాద్‌ లా జవాబ్‌!

హైదరాబాద్‌ లా జవాబ్‌!

  • ఒకేరోజు నగరంలో మూడు కంపెనీలు రాయదుర్గంలో నైట్‌ఫ్రాంక్‌ ఆఫీసు
  • ప్రారంభించిన మంత్రి కే తారకరామారావు హిమాయత్‌నగర్‌లో వన్‌ప్లస్‌ స్టోర్‌
  • ప్రపంచంలోనే సంస్థకు ఇది భారీ సెంటర్‌ వంద కోట్లతో లైఫ్‌స్పాన్‌ ప్లాంట్‌!
  • కార్పొరేట్‌ ఆఫీస్‌ను ప్రారంభించిన సంస్థ

వర్షాలు వచ్చినా.. వరదలు పోటెత్తినా హైదరాబాద్‌కు పెట్టుబడులు, నగరంలో ప్రఖ్యాత సంస్థలు ప్రారంభించే కార్యాలయాలు ఆగటం లేదు. అభివృద్ధి విషయంలో రాజకీయ చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం.. అనుకూలమైన భౌగోళిక వాతావరణం.. ప్రభుత్వ ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ విధానాలతో హైదరాబాద్‌ లా జవాబ్‌గా నిలుస్తూ.. నానాటికీ గణనీయ వృద్ధిని సాధిస్తున్నది

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒకేరోజు మూడు ప్రఖ్యాత సంస్థలు తమ పెట్టుబడులు, కార్యాలయాలకు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. రియల్‌ఎస్టేట్‌ రంగంలో ప్రఖ్యాతిగాంచిన నైట్‌ఫ్రాంక్‌ ఇండియా.. హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని డల్లాస్‌ సెంటర్‌లో నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నూతన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించారు. లండన్‌ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్‌. దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగం ముఖ చిత్రానికి సంబంధించిన నివేదికను రూపొందించి విడుదల చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. మౌలిక సదుపాయాల రంగంపైనా నివేదికను రూపొందిస్తున్న ది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ 500 కార్యాలయాలను నిర్వహిస్తున్నది.

ప్రపంచంలోనే అతిపెద్ద వన్‌ప్లస్‌ స్టోర్‌

చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల తయారీదారు వన్‌ప్లస్‌.. బుధవారం హైదరాబాద్‌లో తన అతిపెద్ద ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను ఆవిష్కరించింది. హిమాయత్‌నగర్‌లో బుధవారం ప్రారంభించిన ఈ స్టోర్‌.. అంతర్జాతీయంగా సంస్థకు భారీది కావడం విశేషం. ‘వన్‌ప్లస్‌ నిజాం ప్యాలెస్‌' పేరుతో 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో ఓ అతిపెద్ద కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌ కూడా ఉన్నది. దేశవ్యాప్తంగా సంస్థకు 5వేలకుపైగా ఆఫ్‌లైన్‌ స్టోర్లున్నాయి. 

రూ.100 కోట్లతో లైఫ్‌స్పాన్‌ ప్లాంట్‌

దేశంలోనే అతిపెద్ద హెర్బల్‌, ఆయుర్వేదిక్‌, వ్యక్తిగత సంరక్షణ, పోషక పదార్థాల ఉత్పత్తి సంస్థ లైఫ్‌స్పాన్‌.. హైదరాబాద్‌లో దాదాపు రూ.100 కోట్లతో ఓ ఆహార, శీతల పానీయాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నది. జీనో మ్‌ వ్యాలీ, దాని పరిసరాల్లో భూమి కోసం అన్వేషణ కూడా మొదలైంది. బుధవారం మాదాపూర్‌లో లైఫ్‌స్పాన్‌ కార్పొరేట్‌ కార్యాలయాన్ని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటుచేసే ప్లాంట్‌లో 2023 ఆరంభంనాటికి కార్యకలాపాలను ప్రారంభించాలని సంస్థ భావిస్తున్నది.