బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 14:06:43

ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్‌ కేంద్రం

ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్‌ కేంద్రం

హైదరాబాద్‌ : అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ దిగ్గజాల పెట్టుబడులకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఐటీ విధానంతో ఈ రంగంలో పెట్టుబడులు వెలువెత్తాయని మంత్రి తెలిపారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ-హబ్‌ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకంగా వీ-హబ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. 2013-14లో ఐటీ ఎగుమతుల విలువ రూ. 57 వేల కోట్లు ఉంటే, 2018-19 నాటికి రూ. లక్షా 9 వేల కోట్లకు పెరగడం.. ఐటీ రంగంలో మనం సాధించిన అభివృద్ధికి నిదర్శమని మంత్రి చెప్పారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఐబీఎం, ఒరాకిల్‌ వంటి బహుళజాతి కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ వంటి దేశీయ ఐటీ దిగ్గజాలు తమ వ్యాపారాలను తెలంగాణలో విస్తరించాయని మంత్రి తెలిపారు. ఐటీ పరిశ్రమను ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్‌, కరీంనగర్‌తో పాటు తదితర టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో విస్తరింపజేస్తున్నామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.


logo