మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 02:57:58

మహానగర సమరం

మహానగర సమరం

  • ఒకటిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు
  • షెడ్యూల్‌ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌
  • నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ
  • 22న ఉపసంహరణ, అదేరోజు అభ్యర్థుల జాబితా
  • బ్యాలెట్‌ పద్ధతిలోనే ఓటింగ్‌ ప్రక్రియ
  • అమల్లోకి ఎన్నికల ప్రవర్తన నియమావళి
  • మహిళలకు 50% రిజర్వేషన్‌ మేయర్‌ పీఠం వారికే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ మహానగర పురపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు డిసెంబర్‌ ఒకటిన పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. 21న నామినేషన్లను పరిశీలిస్తామని, 22వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణకు గడువు విధించామని చెప్పారు. అదే రోజు సాయంత్రం.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. డిసెంబర్‌ ఒకటిన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుందని పేర్కొన్నారు. ఎక్కడైనా రీ పోలింగ్‌ అవసరమైతే 3వ తేదీన పూర్తిచేసి, 4వ తేదీన ఓట్లు లెక్కించి..  సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. ‘జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఆలోగా ఎన్నికలు నిర్వహించాలి. జీహెచ్‌ఎంసీ చట్టాన్ని అనుసరించి ఫిబ్రవరి 3వ తేదీలోపు ఎన్నికలు పూర్తిచేయాలి. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉండగా.. ఇప్పటికే మూడు దశలు (వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా ప్రకటన) పూర్తయ్యింది. ఈ నెల 13నే ఓటర్ల తుదిజాబితా వార్డుల వారీగా ప్రకటించాం. జవనరి 1, 2020 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితానే ఇది. జీహెచ్‌ఎంసీకి ప్రత్యేక ఓటర్ల జాబితా ఉండదు. టీ-పోల్‌ సాప్ట్‌వేర్‌పై అధికారులకు పూర్తి శిక్షణ ఇచ్చి వార్డుల వారీగా కంప్యూటర్‌ ద్వారా ఓటర్ల జాబితాను సిద్ధం చేశాం. ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులను నియమించి శిక్షణ కూడా పూర్తిచేశాం. ప్రతి సర్కిల్‌, డిప్యూటీ కమిషనర్‌ స్థాయిలో అధికారులను నియమించాం. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు డీజీపీ సహా హైదరాబాద్‌ పరిధిలోని ముగ్గురు పోలీస్‌ కమిషనర్ల నేతృత్వంలో బందోబస్తు ప్రణాళికను రూపొందించాం’ అని వివరించారు.

28,500 బ్యాలెట్‌ బాక్సులు

‘రాజకీయ పార్టీల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బ్యాలెట్‌ పత్రాల ద్వారా నిర్వహించాలని నిర్ణయించాం. ఈ మేరకు అవసరమైన 28,500 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశాం. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇచ్చిన తెలంగాణ బ్యాలెట్‌ బాక్సులను తిరిగి తీసుకొచ్చాం. మొత్తం 150 వార్డుల పరిధిలో 9,238 పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయి. అయితే ఈ  సంఖ్య ఈ నెల 21వ తేదీ తరువాత మారే అవకాశం ఉంది’ అని పార్థసారథి పేర్కొన్నారు.