మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 02:15:19

రోడ్డు ట్యాక్స్‌ లేదు

రోడ్డు ట్యాక్స్‌ లేదు

 • తొలి రెండు లక్షల బైకులకు రిజిస్ట్రేషన్‌ ఉచితం
 • తెలంగాణ విద్యుత్‌ వాహన విధానం విడుదల
 • 178 ప్రాంతాల్లో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు
 • వాహనాల తయారీ, చార్జింగ్‌ స్టేషన్లకు రాయితీ
 • ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడి
 • తొలి రోజే రూ.3,200 కోట్ల పెట్టుబడులు

ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక రకాల రాయితీలు అందిస్తున్నది. వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి రాయితీలు ఇవ్వాలని నిర్ణయించి, రాష్ట్ర ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వల పాలసీని రూపొందించాం. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి తెలంగాణను గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. 

- ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్‌

ఈవీ పాలసీని స్వాగతిస్తున్నాం 

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీని స్వాగతిస్తున్నాం. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ఊతమిచ్చేలా ఈ పాలసీ ఉన్నది. వాహన వినియోగదారులకు నేరుగా రాయితీ ఇచ్చేలా ఉంటే ఇంకా ఎక్కువ వాహనాలను వినియోగిస్తారు.

- సోహిందర్‌ గిల్‌, డీజీ, 

ఎలక్ట్రిక్‌ వాహన పాలసీని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. దశాబ్దాలుగా విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ సమయంలో విద్యుత్‌ సమర్థత అనేది అటు వాతావరణ మార్పులను అరికట్టడంతోపాటు స్థిరమైన అభివృద్ధికి చాలా ముఖ్యం. ఈ నూతన పాలసీ పర్యావరణ పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తున్నది. ఈ పాలసీతో భవిష్యత్‌లో పెరుగనున్న పోటీకి తగ్గట్టుగా అటు బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రికల్‌ వాహనాల తయారీలో ఉపయోగించే భాగాలు, విద్యుత్‌ స్టోరేజీ పరికరాల తయారీలోనూ ఎంతో ఉపకరిస్తుంది. సీఐఐ ఇప్పటికే భారత పారిశ్రామిక రంగంలో పునరుద్పాదక విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నది. నూతన పాలసీ అమలులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి సీఐఐ సహకారం ఉంటుంది.

- కృష్ణ బోడనపు, సీఐఐ తెలంగాణ చైర్మన్‌, సైయంట్‌ లిమిటెడ్‌ ఎండీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. మీరు కొనుగోలు చేసే వాహనానికి రిజిస్ట్రేషన్‌ చార్జీలు, రోడ్డు పన్ను ఉండదు. రాష్ర్టాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలకు గమ్యస్థానంగా మార్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ 2020-30 పాలసీని విడుదల చేసింది. ఇందులో తొలి రెండు లక్షల ఎలక్ట్రిక్‌ బైకులు, ఇరవై వేల ఆటోలు, ఐదు వేల ప్యాసింజర్‌ వెహికిల్స్‌, ఐదు వేల కార్లు, ఐదు వందల బస్సులు, రవాణా చేసే పదివేల త్రీవీలర్స్‌, ట్రాక్టర్లకు (రవాణాశాఖ నిబంధనల ప్రకారం) రిజిస్ట్రేషన్‌ చార్జీలు, రోడ్డు పన్ను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన ‘ఎలక్ట్రిక్‌ వాహనాలు- ఇంధన నిల్వలు’ అనే అంశంపై జాతీయస్థాయి సదస్సులో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్‌ వాహన పాలసీ 2020- 30ని మంత్రులు విడుదలచేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, ఇంధన నిల్వల విషయంలో స్పష్టమైన విధానాన్ని కలిగి ఉన్నదని చెప్పారు.

ఈ విషయంలో 3 డీ (డీకార్బనైజేషన్‌, డిజిటైజేషన్‌, డీసెంట్రలైజేషన్‌) మంత్ర విధానంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. కాలుష్య కోరల్లో నుంచి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని చెప్పారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి, సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు తయారుచేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వల పాలసీని రూపొందించామని వివరించారు. ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించేలా పాలసీని రూపొందించామని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి తెలంగాణను గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టంచేశారు.

ఇందుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పించి ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం సమగ్ర పాలసీని తీసుకొచ్చిందని, చార్జింగ్‌ స్టేషన్‌, బ్యాటరీ సంస్థలకు రాయితీలు అందిస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రిక్‌, ఆటోమొబైల్‌ పార్క్‌, మొబిలిటీ పార్క్‌ను ఏర్పాటుచేస్తామని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 44 శాతం వరకు పట్టణంలోనే ఉన్నదని, రాబోయే 5- 7 ఏండ్లల్లో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లోనే ఎక్కువగా ఉంటుందన్నారు. పట్టణాల నుంచి వచ్చే ఆదాయం ద్వారానే భారత దేశం నడుస్తున్నదని, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ నగరం నుంచే జీఎస్‌డీపీకి 50 శాతం ఆదాయం వస్తున్నదని వివరించారు. ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీని విజయవంతంగా అమలు చేయాలంటే ఐటీ, మున్సిపల్‌, రవాణా, పర్యావరణశాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని సూచించారు.


4,100 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌

తెలంగాణ ఏర్పడిన కొత్తలో 45 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉండేదని, ప్రస్తుతం 4,100 మెగావాట్ల సామర్థ్యం సాధించి దేశంలోనే రెండోస్థానంలో నిలిచామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పర్యావరణహితమైన అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. వెయ్యి ఎకరాల్లో రావిర్యాల, మహేశ్వరంలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌లను ఏర్పాటు చేశామని అన్నారు. జహీరాబాద్‌లో మహీంద్ర అండ్‌ మహీంద్ర కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తున్నదని, జహీరాబాద్‌ నిమ్జ్‌లో వెయ్యి ఎకరాలను ఆటోమొబైల్‌ రంగానికి కేటాయిస్తామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి సీతారాంపురంలో ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ప్రత్యేకంగా పార్క్‌ను ఏర్పాటుచేశామని, ఇక్కడికి పలు కంపెనీలు వచ్చాయని వివరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో కొత్తగా న్యూ ఎనర్జీ కోసం పారిశ్రామిక పార్కును ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 178 ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు. గత ఆరేండ్లల్లో 28 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని స్పష్టంచేశారు. ఈవోడీబీలో ఇప్పటివరకు రాష్ట్రం దేశంలోనే టాప్‌- 3లో ఉన్నదని, ఈ ఏడాది ఇంకా మెరుగైన ర్యాంకు సాధించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలన్న మంత్రి కేటీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా తీసుకొచ్చిన పాలసీ అద్భుతంగా ఉన్నదని, పారిశ్రామికవేత్తలు, వాహనాదారుల నుంచి మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. ఆర్టీసీలో ఇప్పటికే 40 ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉన్నాయని, వాటి సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తొలి 2 లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలకు, 20 వేల ఆటోలకు, 5 వేల ఫోర్‌ వీలర్‌ వాహనాలకు, 10 వేల తేలికపాటి రవాణా వాహనాలకు, 5 వేల కార్లకు 100 శాతం రిజిస్ట్రేషన్‌, రోడ్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఇస్తామని ప్రకటించారు.తెలంగాణను ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) హబ్‌గా మారుస్తాం. సొసైటీ ఆఫ్‌ మ్యానుఫాక్చరర్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌

ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ తయారీ ఇక్కడే: మహీంద్రా అండ్‌ మహీంద్రా


తెలంగాణతో మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థకు ఎంతో అనుబంధం ఉన్నదని ఆ సంస్థ సీఈవో పవన్‌ గోయెంకా పేర్కొన్నారు. వర్చువల్‌ విధానంలో ఆయన మాట్లాడుతూ.. గత జూలైలో హైదరాబాద్‌ సమీపంలో మహీంద్రా వర్సిటీని 130 ఎకరాల్లో ఏర్పాటుచేశామని అన్నారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ కొత్త ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ను జపాన్‌లో డెవలప్‌ చేస్తున్నదని, దీని మాన్యుఫాక్చరింగ్‌ జహీరాబాద్‌లో చేస్తామని ప్రకటించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం మంచి రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించిందని కితాబిచ్చారు. తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రమని చెప్పారు. యెస్‌ బ్యాంకు చైర్మన్‌ సునీల్‌ మోహతా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉన్నదని అన్నారు. తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నదని, ఐటీ, ఫార్మా రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని అభినందించారు. ఈవోడీబీలో ముందున్నదని వెల్లడించారు. నీతి ఆయోగ్‌ సలహాదారు అన్నె రాయ్‌ మాట్లాడుతూ.. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల భాగస్వామ్యం ఉండాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనేక ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, రవాణశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఐటీశాఖ డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూడి, టీఎస్‌రెడ్‌కో వీసీఎండీ జానయ్య తదితరులు పాల్గొన్నారు.

మొదటి రోజే 3,200 కోట్ల పెట్టుబడులు

తెలంగాణ ఈవీ పాలసీ ప్రకటించిన మొదటి రోజే భారీఎత్తున పెట్టుబడులు వచ్చాయి. మూడు ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. మరో రెండు కంపెనీలు లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్లను అందించాయి. మైత్ర ఎనర్జీ సంస్థ రూ.2 వేల కోట్ల పెట్టుబడిని పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నది. ప్రముఖ ఎలక్ట్రిక్‌ బస్సుల సంస్థ ఒలెక్ట్రా రూ.300 కోట్లు, ఈటీవో మోటర్స్‌ రూ.150 కోట్లు, గాయం మోటర్స్‌ రూ.250 కోట్లు, ప్యూర్‌ ఎనర్జీ సంస్థ రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటి ద్వారా 14,750 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ఎంవోయూలను ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ సంతకంచేశారు.

ఎలక్ట్రిక్‌ వాహన పాలసీ ముఖ్యాంశాలు..

 • రూ.200 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ చేపట్టే పరిశ్రమలకు రూ.30 కోట్లకు తగ్గకుండా 20 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ.
 • రూ.25 కోట్లకు తగ్గకుండా 7 ఏండ్లపాటు జీఎస్టీ తిరిగి చెల్లింపు.
 • ఐదేండ్లపాటు రూ.5 కోట్ల పరిమితితో 25 శాతం విద్యుత్‌ సబ్సిడీ.
 • రూ.5 కోట్లకు తగ్గకుండా ఐదేండ్లపాటు 60 శాతం రవాణా రుసుము, రూ.5 కోట్లకు తగ్గకుండా 5.25 శాతం వడ్డీ రాయితీ.
 • పారిశ్రామిక ప్రాంతాల్లో వాహనాల తయారీ, ఇంధన నిల్వల కంపెనీలకు ప్రోత్సాహం.
 • స్టాంపు డ్యూటీ బదిలీ, రిజిస్ట్రేషన్‌ రుసుముల నుంచి మినహాయింపు.
 • కొత్త రకం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి పరిశోధన, అభివృద్ధి కేంద్రాల స్థాపన రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు. 

ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు

 • తొలి రెండు లక్షల ఎలక్ట్రిక్‌ బైకులకు, ఇరవై వేల ఆటోలకు, ఐదు వేల ప్యాసింజర్‌ వెహికిల్స్‌కు, ఐదు వేల కార్లకు, ఐదు వందల బస్సులకు, రవాణా చేసే పదివేల త్రీవీలర్స్‌కు, ట్రాక్టర్లకు(రవాణాశాఖ నిబంధనల ప్రకారం) రిజిస్ట్రేషన్‌ చార్జీలు, రోడ్డు పన్ను రద్దు.
 • పారిశ్రామిక లాజిస్టిక్స్‌, రవాణా కేంద్రాల పరిధిలో రాత్రిపూట పార్కింగ్‌, చార్జింగ్‌ సదుపాయాల కల్పన. 
 • ఆటోలకు అదనంగా ఫిట్మెంట్‌ రాయితీల కింద రూ.15 వేలకు మించకుండా 15 శాతం రాయితీ. 

చార్జింగ్‌ సౌకర్యాలు

 • హైదరాబాద్‌ సహా ఇతర పట్టణాల్లో వాహనాలకు ప్రత్యేక చార్జింగ్‌ కేంద్రాలు.
 • రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థ ద్వారా చార్జింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక ఫీజు వసూలు. 
 • టౌన్‌ షిప్‌లలో చార్జింగ్‌ కేంద్రాల స్థాపనకు వెసులుబాటు. 
 • మహానగరాలకు వెళ్లే జాతీయ రహదారుల పక్కన ప్రతి 50 కిలోమీటర్ల చొప్పున చార్జింగ్‌ కేంద్రాలు. 
 • ఆర్టీసీ, మెట్రో రైల్‌ సంస్థలు తమ డిపోల వద్ద ద్విచక్ర వాహనాలకు చార్జింగ్‌ కేంద్రాలు.
 • పర్యావరణ పరిరక్షణలో అంకితభావానికి నిదర్శనం