సోమవారం 25 మే 2020
Telangana - Mar 30, 2020 , 02:12:11

హైదరాబాద్‌ వైద్యులు మంచోళ్లు

హైదరాబాద్‌ వైద్యులు మంచోళ్లు

-భయాన్ని పారదోలి చికిత్స చేశారు

-కోలుకొనేలా ధైర్యాన్ని నింపారు

-తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న రామ్‌ గంపతేజ వెల్లడి

-ప్రధాని ‘మన్‌కీబాత్‌'లో ప్రశంసలు

-శుభాకాంక్షలు తెలిపిన నరేంద్రమోదీ

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ వైద్యులు తనను కంటికిరెప్పలా కాపాడారని తెలంగాణలో కరోనా తొలి బాధితుడు, వ్యాధి నుంచి కోలుకున్న ఐటీ ఉద్యోగి రామ్‌ గంపతేజ ఆనందం వ్యక్తంచేశారు. భయంతో ఉన్న తనకు అనుక్షణం ధైర్యం నూరిపోశారని చెప్పారు. గాంధీ దవాఖానలో మెరుగైన చికిత్స అందజేసి ఆరోగ్యవంతుడిగా మార్చారని తెలిపారు. వైద్యులు, నర్సులు ఎంతో మంచివాళ్లని ప్రశంసించారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రధాని మన్‌కీబాత్‌ కార్యక్రమంలో నరేంద్రమోదీ.. తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న సికింద్రాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగి రామ్‌ గంపతేజతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని, లాక్‌డౌన్‌తో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నందుకు తనను క్షమిం చాలని విజ్ఞప్తిచేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎవ్వరూ లాక్‌డౌన్‌ ‘లక్ష్మణ రేఖ’దాటొద్దని ప్రధాని మోదీ కోరారు.

మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ, రామ్‌ గంపతేజ సంభాషణ

ప్రధాని: మీరు ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? మీ అనుభవాలను వినాలనుకుంటున్నాను.

రామ్‌: సర్‌. నేను ఐటీరంగంలో పనిచేసే ఉద్యోగిని. విధి నిర్వహణలో భాగంగా దుబాయ్‌కి వెళ్లాల్సి వచ్చింది. తిరిగి రాగానే జ్వరం మొదలైంది. ఆ తర్వాత ఆరురోజులకు కరోనా పరీక్షలు జరిపి పాజిటివ్‌గా నిర్ధారించారు. వెంటనే నన్ను హైదరాబాద్‌ గాంధీ దవాఖానలో చేర్చారు. 14 రోజులకు నాకు నయమవడంతో డిశ్చార్జి అయ్యాను. ఇప్పుడు హోం క్వారంటైన్‌లో ఉన్నాను. 

ప్రధాని: వైరస్‌ సోకిన విషయం తెలియగానే మీకు ఏమనిపించింది? 

రామ్‌: ఒక్కసారిగా భయమేసింది. ముందు నమ్మలేకపోయాను. అప్పటివరకు దేశంలో ఇద్దరు ముగ్గురికే వ్యాధి సోకింది. గాంధీ దవాఖానలో చేరాక రెండు, మూడ్రోజులు కష్టంగా గడిచాయి. అక్కడి డాక్టర్లు, నర్సులు చాలా మంచివాళ్లు. నాకేం కాదన్న నమ్మకాన్ని కలిగించారు. త్వరగా కోలుకుంటారని ధైర్యమిచ్చారు. మొదట్లో భయమేసినా క్రమంగా నాకు తప్పనిసరిగా నయమవుతుందన్న నమ్మకం పెరిగింది.

ప్రధాని: మీ కుటుంబసభ్యుల మానసిక స్థితి ఎలా ఉండేది? 

రామ్‌: దవాఖానలో చేరిన మొదట్లో ఎంతో ఆందోళనకు గురయ్యారు. మొదట్లో మీడియా కొంత సమస్యాత్మకంగా వ్యవహరించింది. మా కుటుంబసభ్యులందరికీ నెగెటివ్‌ వచ్చింది. ఇది ఎంతో ఊరటనిచ్చింది. 

ప్రధాని: మీరు స్వయంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు. మీ కుటుంబసభ్యులు ఏయే జాగ్రత్తలు తీసుకున్నారు? 

రామ్‌: క్వారంటైన్‌ తర్వాత పూర్తిగా కోలుకోవడానికి 14రోజులు పడుతుందని, ఇంటి దగ్గరే గదిలో ఉండాలని చెప్పారు. కుటుంబసభ్యులను కూడా ఇంట్లోనే సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలన్నారు. తినడానికి బయటికి వచ్చేముందు చేతులను శుభ్రంగా కడుక్కునేవాడ్ని.

ప్రధాని: రామ్‌ మీరు కోలుకున్నారు. మీకు మీ కుటుంబసభ్యులకు ఎన్నెన్నో శుభాకాంక్షలు. మీరు ఐటీ ప్రొఫెషనల్‌గా ఉన్నారు కదా.. మీ  అనుభవాన్ని ఆడియో తయారుచేసి ప్రజలతో పంచుకోండి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయండి. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉంటారు. ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది.

రామ్‌: అవును సార్‌. ప్రజలు క్వారంటైన్‌ అంటే జైలులా భావిస్తున్నారు. కానీ అదొక సురక్షిత ప్రదేశం. మన కోసమేనని అర్థం చేసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి. దేశ ప్రజలందరూ క్షేమంగా బయటపడుతారు.

ప్రధాని: ఇది ఎంతో భయానక పరిస్థితి. ఎప్పుడు ఏమవుతున్నదో తెలియని స్థితి. ఈ వైపరీత్యం నుంచి దేశం బయటపడాలి. 

రామ్‌: ఏమీకాదు సార్‌. అంతా మంచే జరుగుతుంది.


logo