ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 02:29:21

వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో హైదరా‘బాద్‌షా’

వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో హైదరా‘బాద్‌షా’

  • అగ్గువకు తయారీ అంటే భాగ్యనగరమే
  • ఉత్పత్తిలో అగ్రగామి.. నాలుగు సంస్థలది కీలక పాత్ర
  • ఏటా 200 కోట్ల డోస్‌ల తయారీ సామర్థ్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యాక్సిన్‌.. వ్యాక్సిన్‌.. వ్యాక్సిన్‌.. కరోనా కర్కశత్వాన్ని భరించలేక ప్రపంచం చేస్తున్న జపం ఇది. వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ వజ్రాయుధం ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా వేగంగా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నారు. ఒక దేశం కనుగొన్న వ్యాక్సిన్‌ను సహాజంగానే అన్ని దేశాలకు సరఫరా చేసే అవకాశాలుంటాయి. మరి.. వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యం ఎక్కడుంది? తక్కువ ధరకే ఎక్కడ తయారు చేస్తారు? తదితర అంశాలపై చర్చ నడుస్తున్నది. 

ఈ నేపథ్యంలో ప్రపంచంలో వ్యాక్సిన్‌ నిపుణులు హైదరాబాద్‌పై దృష్టి కేంద్రీకరించారు. ప్రపంచానికి అవసరమయ్యే వ్యాక్సిన్‌లలో మూడో వంతు హైదరాబాద్‌ నుంచే సరఫరా అవుతున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్‌ తయారీ కూడా ఇక్కడే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సంవత్సరానికి 200 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు తయారు చేసే సామర్థ్యం తెలంగాణకు ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ తయారీ యూనిట్లు ఉన్నా, అతి తక్కువ ధరకు వ్యాక్సిన్‌ తయారయ్యేది భారత్‌లోనే. ఇక్కడ తయారీ యూనిట్లు భారీగా ఉండటమే ప్రధాన కారణం. ఏ వ్యాక్సిన్‌ అయినా, ఏ దేశం కనుగొన్నా దాదాపు ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. 


అమెరికా, యూరప్‌ సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే వ్యాక్సిన్‌ ఉత్పత్తి భారీ వ్యయంతో కూడుకున్నపని. అందుకే ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ వైపు చూస్తాయి. డబ్ల్ల్యూహెచ్‌వో సహా అనేక సంస్థలు పేద దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తాయి. తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి నాణ్యతతో తయారయ్యే ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. వ్యాక్సిన్ల తయారీలో భారత్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ ఇమ్యూనలాజికల్స్‌, శాంతా బయోటెక్నిక్స్‌, బయోలాజికల్‌ ఈ సంస్థల పాత్ర పెద్దదే. ఈ నాలుగు సంస్థల్లో తయారు చేసిన వ్యాక్సిన్‌లు ప్రపంచంలోని 100కుపైగా దేశాలకు సరఫరా అవుతాయి. ప్రపంచ దేశాల ఇమ్యూనైజేషన్‌లో భాగంగా యూనిసెఫ్‌, డబ్ల్ల్యూహెచ్‌వోలు భారీ ఎత్తున ఆర్డర్‌లు ఇచ్చి వ్యాక్సిన్‌లను తయారు చేయిస్తుంటాయి. దీంతో ఈ నాలుగు సంస్థలు వ్యాక్సిన్‌ తయారీలో నిత్యం బిజీగా ఉంటాయి. 

వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు 70 శాతం సామర్థ్యాన్ని వాళ్లు కనుగొన్న వ్యాక్సిన్లను తయారు చేయడానికే వినియోగిస్తారు. 20-30శాతం వరకు సామర్థ్యాన్ని ఖాళీగా వదులుతుంటారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం ఇతర వ్యాక్సిన్ల ఉత్పత్తులను ఆపలేవు. ప్రపంచ దేశాల నుంచి ఇప్పటికే తీసుకున్న ఆర్డర్‌లను సరఫరా చేయాల్సి ఉంటుంది. దీంతో కరోనా వ్యాక్సిన్‌ కనుగొన్నా, ఖాళీగా ఉన్న సామర్థ్యంలోనే ఉత్పత్తి చేయాలి. ఆ లెక్కన ఏటా 60 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోస్‌లను ఈ సంస్థలు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్‌ బయోటెక్‌

ఈ సంస్థను 1996లో డాక్టర్‌ కృష్ణ ఎమ్‌ ఎల్లా, సుచిత్ర ఎల్లా స్థాపించారు. ప్రస్తుతం దీనికి 160 పేటెంట్లు ఉన్నాయి. కొత్త వ్యాక్సిన్ల తయారీలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ కంపెనీ మొత్తం 14 రకాల వ్యాక్సిన్లను తయారు చేసింది. కొవాగ్జిన్‌ పేరుతో కరోనా వ్యాక్సిన్‌ కోసం బిజీగా పని చేస్తున్నది. బయోహిబ్‌, బయోపోలియో, రొటావాక్‌, టైప్‌బార్‌ వంటి వ్యాక్సిన్లను తయారు చేసిందీ సంస్థ.

ఇండియన్‌ ఇమ్యూనలాజికల్స్‌ లిమిటెడ్‌

వెటర్నరీ, మానవ సంబంధ వ్యాక్సిన్ల తయారీలో ఈ సంస్థది అందె వేసిన చెయ్యి. 150కి పైగా ఉత్పత్తులను తయారుచేస్తున్నది. దీన్ని 1982లో నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ప్రారంభించింది. 1999లో కార్పొరేట్‌ చేతుల్లోకి వెళ్లింది. పీడియాట్రిక్‌, రాబిస్‌ వ్యాధులకు వ్యాక్సిన్‌ తయారు చేసిన ఘనత ఈ సంస్థది. 2003లో హైదరాబాద్‌లో ప్లాంట్‌ను ప్రారంభించింది. ఇక్కడ డీపీటీ, డీటీ, టీటీ, హెపటైటిస్‌-బీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

శాంతా బయోటెక్నిక్స్‌

దీన్ని 1993లో కోడూరు ఈశ్వర వరప్రసాద్‌రెడ్డి స్థాపించారు. మేడ్చల్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. శాన్‌వాక్‌-బీ, శాన్‌ఫెరాన్‌, శాంకినేస్‌ తదితర వ్యాక్సిన్లను తయారుచేస్తున్నది. ఆసియా-పసిఫిక్‌, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలకు, యూనిసెఫ్‌ వంటి సంస్థలకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నది.

బయోలాజికల్‌ ఈ

స్వదేశీ ఉద్యమంలో భాగంగా 1953లో ఈ సంస్థను డాక్టర్‌ డీవీకే రాజు స్థాపించారు. రసాయన ఫార్ములాల రూపకల్పనలో, జెనెరిక్‌ ఇంజెక్షన్ల తయారీలో, వ్యాక్సిన్ల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నది. వ్యాక్సిన్‌ వ్యాపారంలోకి అడుగు పెట్టిన భారత తొలి ప్రైవేటు సంస్థ. పలు కీలక వ్యాక్సిన్లను తయారు చేయడమే కాకుండా, ఉత్పత్తిలోనూ దూసుకుపోతున్నది. గత దశాబ్ద కాలంలో ఈ ఒక్క కంపెనీయే  దాదాపు 100 దేశాలకు 200 కోట్ల వ్యాక్సిన్లను సరఫరా చేసింది.


logo