మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 01:52:21

ఫార్మా బ్రాండ్‌ హైదరాబాద్‌

ఫార్మా బ్రాండ్‌ హైదరాబాద్‌

  • ఫార్మాలో రాష్ర్టానికి మరో రెండు భారీ పెట్టుబడులు
  • రూ.400 కోట్లతో గ్రాన్యూల్స్‌ ఇండియా
  • రూ.300 కోట్లతో లారస్‌ల్యాబ్స్‌ పెట్టుబడి 
  • మంత్రి కే తారకరామారావుతోరెండు సంస్థల ప్రతినిధుల భేటీ 
  • ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని మంత్రి కేటీఆర్‌ హామీ 

రాష్ర్టానికి పలు రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అద్భుతమైన పారిశ్రామిక పాలసీ టీఎస్‌ఐపాస్‌ అమలులో ఉండటమే. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనం మంగళవారం మరో రెండు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం.

-  మంత్రి కే తారకరామారావు

వందేండ్లలో కనీవినీ ఎరుగని రీతిలో పడిన వానలకు హైదరాబాద్‌ అతలాకుతలమైపోయింది. అంతే.. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ వరదల్లో దెబ్బతిన్నదంటూ గోబెల్స్‌ ప్రచారం మొదలైంది. పరిశ్రమలు రావని.. ఉన్న ఆఫీసులు పోతాయని.. అభివృద్ధి ఇక్కడితో ఆగిపోతుందని ఏవేవో మాటలు, రాతలు పుట్టుకొచ్చాయి.  కానీ.. హైదరాబాద్‌ పురోగమనాన్ని ఏ శక్తీ       ఆపజాలదని మరోసారి స్పష్టమైంది. ఆర్థికమాంద్యం ఏమీ చేయలేకపోయింది. కాటేసిన కరోనా అడ్డంకి కాలేకపోయింది. హైదరాబాద్‌కు పెట్టు బడుల వరద వెల్లువెత్తుతూనే ఉన్నది. గత కొన్నేండ్లుగా ఇక్కడే ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు.. ఇప్పుడు మరింతగా తమ ఉత్పాదక సామర్థ్యాన్ని విస్తరించాలని నిర్ణయించడంతో వదంతులన్నీ తేలిపోయాయి. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఫార్మారంగంలో తెలంగాణ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని చేరుకొనే దిశగా ముందుకు వెళ్తున్నది. తాజాగా రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తరించడానికి ముందుకొచ్చాయి. మంగళవారం ప్రగతిభవన్‌లో గ్రాన్యూల్స్‌ ఇండి యా, లారస్‌ ల్యాబ్స్‌ ప్రతినిధులు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. అనంతరం తాము హైదరాబాద్‌లో రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్న ట్టు వెల్లడించారు. ఈ రెండు కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన గ్రాన్యూల్స్‌ ఇండియా  మంగళవారం రూ.400 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది. దాదాపు  10 బిలియన్‌ ఫినిష్డ్‌ డోసులను తయారుచేసే సామర్థ్యం ఈ ఫార్మా కంపెనీకి ఉన్న ది. దీని ద్వారా 1600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని గ్రాన్యూల్స్‌ ఇండియా సీఎండీ కృష్ణప్రసాద్‌ చిగురుపాటి మంత్రి కేటీఆర్‌కు వివరించారు.  ప్రపంచవ్యాప్తంగా 75 దేశా ల్లో  గ్రాన్యూల్స్‌ ఇండియా విస్తరించి ఉన్నది. కాగా, 8 ప్రాం తాల్లో తయారీ యూనిట్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నా రు. ఇప్పటికే ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్‌ ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్‌ ఇంటర్మీడియట్‌ యూనిట్‌ను హైదరాబాద్‌ దగ్గరలోని గాగిల్లాపూర్‌లో ఏర్పాటుచేసింది. 


300 కోట్లతో లారస్‌ ల్యాబ్స్‌

లారస్‌ ఫార్మాస్యూటికల్‌ తయారీ కంపెనీ హైదరాబాద్‌లో రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్‌తో భేటీ అనంతరం లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో సత్యనారాయణ చావ ఈ విషయాన్ని ప్రకటించారు. రూ.150 కోట్ల చొప్పున రెండు దఫాలుగా పెట్టుబడులు పెడతామని మంత్రి కేటీఆర్‌కు తెలియజేశారు. ఐదు బిలియన్‌ డోసుల సామర్థ్యం గల ఫార్ములేషన్‌ ఫెసిలిటీ యూనిట్‌ కోసం ఈ పెట్టుబడిని వినియోగిస్తామన్నారు. జీనోమ్‌ వ్యాలీలోని ఐకేపీ నాలెడ్జి పార్కులో ఇప్పటికే లారస్‌ ల్యాబ్స్‌కు చెందిన రిసెర్చ్‌ అండ్‌  డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కొనసాగుతున్నది. వివిధ దేశాల్లో ఆరు మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీస్‌కు అనుమతులున్నాయి. లారస్‌ యాంటీ రిట్రోవైరల్‌, ఆంకాలజీ, కార్డి యో వాస్క్యులర్‌, యాంటీ డయాబెటిక్స్‌, యాంటీ అస్తమా, గ్యాస్ట్రో ఎంట్రాలజీకీ సంబంధించిన ఏపీఐలను తయారుచేస్తుంది.

అన్ని రకాలుగా సహకారం అందిస్తాం

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా కంపెనీలకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తాం. రాష్ర్టానికి అనేక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అద్భుతమైన పారిశ్రామిక పాలసీ ఉండటమే. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ వంటి రంగాల్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయి. అందుకు మంగళవారం రాష్ర్టానికి వచ్చిన రెండు కంపెనీలే నిదర్శనం. ఈ రెండు ప్రతిష్ఠాత్మక కంపెనీల ద్వారా తయారీ రంగంలో పెద్ద ఎత్తున స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నాను.