సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 02:21:18

వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌

వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌
  • డిజిటల్‌ డ్రగ్‌ డిస్కవరీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు
  • ‘సనోఫి’ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అద్భుతమైన మానవ వనరులు, అధునాతన సాంకేతికతలు అందుబాటులో ఉన్న తెలంగాణలో డిజిటల్‌ డ్రగ్‌ డిస్కవరీ లాంటి వినూత్న రంగాల్లో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీ ‘సనోఫి’ అంతర్జాతీయ భాగస్వామ్యాల అధిపతి ఫ్యాబ్‌రైస్‌ జీయోఫ్‌ఫ్రే గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తెలంగాణలో తమ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలు, భవిష్యత్‌ ప్రణాళికల గురించి వివరించారు. 


పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న విధానాలపై ‘సనోఫి’ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. అంతర్జాతీయ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ రూపాంతరం చెందిందని, ఇక్క డ వ్యాక్సిన్ల తయారీతోపాటు సంబంధిత రం గంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో ఫార్మారంగాన్ని, లైఫ్‌సైన్సెస్‌ ఎకోసిస్టంను మ రింత బలపరిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. 2020 ఏడాది ని తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. 


ఇప్పటికే పలు దిగ్గజ ఫార్మా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో భాగస్వాములయ్యేందుకు సుముఖత వ్యక్తంచేశాయని తెలిపారు. సనోఫి సంస్థ కూడా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రావాలని విజ్ఞప్తిచేశారు. అన్నివిధాలా సహకరిస్తామని కేటీఆర్‌ తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, సనోఫి కంపెనీ దక్షిణాసియా జనరల్‌ మేనేజర్‌ అన్నపూర్ణదాస్‌, శాంతా బయోటెక్‌ చైర్మన్‌ కేఐ వరప్రసాద్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.


logo