ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 02:50:02

స్లమ్‌ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌

స్లమ్‌ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌

  • మహా నగరంలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లు
  • ఇండ్లు కట్టించి.. పెండ్లి చేస్తున్న సర్కార్‌ మాదే
  • డబుల్‌ ఇండ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కే తారకరామారావు
  • మూడు చోట్ల 1,152 ఇండ్లకు ప్రారంభోత్సవం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పేద, మధ్య తరగతి ప్రజల జీవితకాలపు కలను సాకారం చేయడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. పేదలకు ఇండ్లు కట్టి పెండ్లి చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశానికే తలమానికంగా నిలిచాయన్నారు. రాజధాని హైదరాబాద్‌ను స్లమ్‌ ఫ్రీ సిటీ (మురికివాడలు లేని నగరం)గా మార్చాలన్నది సీఎం సంకల్పమని, ఆ దిశలో వేగంగా ముం దుకు సాగుతున్నామని తెలిపారు. 

పేదలకు లక్ష ఇండ్లను అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని, దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడు చేయని పనిని మన సీఎం కేసీఆర్‌ చేసి చూపించారని పేర్కొన్నారు. నగరంలోని జియాగూడ, ఘోడే కీ ఖబర్‌, కట్టెల మండిలో రూ.95.58 కోట్ల వ్యయంతో నిర్మించిన 1152 డబుల్‌ బెడ్రూం పేదల ఆత్మగౌరవ ఇండ్లను కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. జియాగూడలో 840, ఘోడే కి ఖబర్‌లో 192, కట్టెల మండిలో 120 ఇండ్లు నిర్మించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు’ అని మన పెద్దలు చెప్తారు. 

అంటే ఈ రెండు పనులు ఎంతో కష్టంతో కూడుకున్నవని అర్థం. మన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేనివిధంగా మధ్యతరగతి ప్రజల కలల్ని సాకారం చేస్తున్నరు. పేదలు గౌరవంగా నివసించేలా.. చుట్టపోడు వచ్చినా ఇబ్బందిలేకుండా రెండు పడక గదులు, ఒక కిచెన్‌, ఒక హాలుతో కూడిన ఇండ్లను నిర్మించి, ఉచితంగా ఇస్తున్నరు. పేదింటి పెద్ద పెడుకుగా ఒక డబుల్‌ బెడ్రూం ఇల్లు, మేనమామగా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్ష 16 వేలు ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్‌దే’ అని చెప్పారు. రాష్ట్రంలో పేదల ఆత్మగౌరవానికి రూ.18 వేల కోట్ల తో 2.5 లక్షల డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. వీటి మార్కెట్‌ విలువ రూ.70 వేల కోట్లు ఉంటుందని చెప్పారు. దసరా పండుగ సందర్భంగా ఈ ఇండ్లను లబ్ధిదారులకు ఇస్తున్నామన్నా రు. సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా పేద కుటుంబాలు సౌకర్యంగా జీవించేందుకు అవసరమైన తాగునీరు, విద్యుత్‌, రోడ్లు, ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. 

ఇండ్లు అమ్ముకుంటే కేసులు 

అధికారుల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇండ్లు ఇప్పిస్తామనే దళారులను నమ్మొద్దని హెచ్చరించారు. పేదలకు కేటాయించిన ఇండ్లను అమ్ముకోవద్దని హితవు పలికారు. అట్లా ఎవరైనా చేసినట్టు తమ దృష్టికి వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ముందుగా హామీ ఇచ్చిన ఇండ్ల లో ఇప్పటికే 50 శాతం ఇండ్లను పూర్తి చేశామని, అన్ని ఇండ్లను పూర్తిచేసి లబ్దిదారులకు కేటాయిస్తామని కేటీఆర్‌ చెప్పారు. ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఒక వేడుకలా జరిగాయి. మంత్రులకు జియాగూడ, ఘోడే కీ ఖబర్‌, కట్టెల మండిలో స్థానికులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు.

అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ, పార్కింగ్‌, నిత్యావసరములను విక్రయించే షాపులతో పాటు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను కూడా మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబాఫసియుద్దీన్‌, ఎమ్మెల్యేలు కౌసర్‌ మొహియుద్దీన్‌, టీ రాజాసింగ్‌, కార్పొరేటర్లు ఏ కృష్ణ (మిత్ర), ముఖేశ్‌సింగ్‌, డీ మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి, హౌసింగ్‌ సీఈ సురేశ్‌కుమార్‌, జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య పాల్గొన్నారు. 


పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

నగరంలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నామని, వాటిని దశలవారీగా లబ్ధిదారులకు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 1985లో ప్రారంభించిన బలహీనవర్గాల గృహనిర్మాణ పథకం కింద గత 35 ఏండ్లలో రాష్ట్రంలో 40 లక్షల ఇండ్లు నిర్మించినట్టు గత ప్రభుత్వాలు కాకిలెక్కలు చూపాయని విమర్శించారు. అన్ని ఇండ్లు వాస్తవంగా నిర్మిస్తే ఇండ్లులేని పేద కుటుంబాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ ఇండ్లను పరిశీలించుకోవచ్చని సవాల్‌చేశారు. జియాగూడ లబ్ధిదారులు సొసైటీగా ఏర్పడి, ప్రజల సౌకర్యార్థం నిర్మించిన 56 షాపుల కాంప్లెక్స్‌లకు వచ్చే అద్దెతో లిఫ్టులు, పారిశుద్ధ్య  నిర్వహణ చేసుకొని, అందమైన కాలనీగా ఉంచుకో వాలని సూచించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ.9 లక్షలు ఖర్చు చేసిందని, మార్కెట్‌ విలువ రూ.40 లక్షలు ఉంటుందన్నారు. బస్తీ దవాఖాన, అంగన్‌వాడీ కేంద్రం, లైబ్రరీ ఏర్పాటుచేశామని, గేటెడ్‌ కమ్యూనిటీలకు దీటుగా పేదల డిగ్నిటీ కాలనీలలో వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. 

‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు’ అని మన పెద్దలు చెప్తారు. అంటే ఈ రెండు పనులు ఎంతో కష్టంతో కూడుకున్నవని అర్థం. మన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేనివిధంగా మధ్యతరగతి ప్రజల కలల్ని సాకారం చేస్తున్నరు. పేదలు గౌరవంగా నివసించేలా.. చుట్టపోడు వచ్చినా ఇబ్బందిలేకుండా రెండు పడక గదులు, ఒక కిచెన్‌, ఒక హాలుతో కూడిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించి, ఉచితంగా ఇస్తున్నరు. పేదింటి పెద్ద పెడుకుగా ఒక డబుల్‌ బెడ్రూం ఇల్లు, మేనమామగా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్ష 16 వేలు ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్‌దే’

- కేటీఆర్‌