శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 10, 2020 , 01:52:39

లాల్‌దర్వాజ ఆలయానికి నిధులు

లాల్‌దర్వాజ ఆలయానికి నిధులు
  • అక్బరుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ
  • అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎస్‌కు ఆదేశాలు
  • మహంకాళి ఆలయ విస్తరణకు రూ.10కోట్లు..
  • అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతుకు రూ. 3కోట్లు ఇవ్వాలని కోరిన ఒవైసీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీఇచ్చారు. ఆలయ విస్తరణ, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయంతోపాటు, అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞాపనపత్రం అందజేశారు. 


‘లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయానికి వందేండ్లకు పైగా చరిత్ర ఉన్నది. బోనాల సందర్భంగా లక్షల మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేస్తారు. కానీ, ఆలయప్రాంగణం వంద గజాలు మాత్రమే ఉండటంతో బోనాలు సమర్పించే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూ.10 కోట్లతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయండి. విస్తరణ వల్ల దీనికి అనుకుని ఉన్నఆస్తులు కోల్పోయేవారికి జీహెచ్‌ఎంసీ ఆధీనంలోని ఫరీద్‌ మార్కెట్‌ ఆవరణలో 800 గజాల స్థలం కేటాయించండి. దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయడాన్ని అత్యంత ముఖ్యమైన పనిగా భావించండి. 


ఇది భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది’ అని అక్బరుద్దీన్‌ కోరారు. తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని దీవించాలని కోరుతూ ఈ దేవాలయంలో సీఎం కేసీఆర్‌ బంగారు బోనం సమర్పించిన విషయాన్ని ఈ సందర్బంగా అక్బరుద్దీన్‌ గుర్తుచేశారు. అలాగే పాతబస్తీలోని అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతుల కోసం రూ. మూడుకోట్లు మంజూరుచేయాలని కోరారు. మసీదు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల ముస్లింల ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతున్నదని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. అక్బరుద్దీన్‌ విజ్ఞప్తికి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదలచేయనున్నట్టు హామీఇచ్చారు.


logo