మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 21:33:20

హుజూరాబాద్‌, జమ్మికుంటను మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దాలి : మంత్రి ఈటల

హుజూరాబాద్‌, జమ్మికుంటను మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దాలి : మంత్రి ఈటల

హైదరాబాద్‌ : హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీలను మోడల్‌ టౌన్‌లుగా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన కాంప్రేహెన్సివ్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మసబ్‌ ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో రెండు మున్సిపాలిటీల అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌, సీడీఎంఏ సత్యనారాయణతో మంత్రి ఈటల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఆరు నెలల్లో హుజూరాబాద్‌, జమ్మికుంట పట్టణాల రూపురేఖలు మారుస్తామన్నారు. పట్టణాల్లో రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, తాగునీటి సదుపాయం, పార్కులు, ఫుట్‌పాత్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్స్‌, కూరగాయల, మాంసం మార్కెట్లు, వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, చెరువుల సుందరీకరణ, ట్యాంక్‌ బండ్‌ల నిర్మాణం, రింగ్‌రోడ్డు నిర్మాణాలపై దృష్టి పెట్టాలని మంత్రి ఈటల సూచించారు. హుజురాబాద్, జమ్మికుంట రెండు పట్టణాలు రెండు కళ్లలాంటివన్నారు.

రెండు పట్టణాల్లో ఇప్పటికే రోడ్లను విస్తరించామని, 2014లో తాగునీటికి రూ.40కోట్లు మంజూరు చేశామని, ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో హుజూరాబాద్‌కు రూ.50కోట్లు, జమ్మికుంటకు రూ.40కోట్లు అదనంగా నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు పెట్టాలని, నిధులు కొరత లేదని, అధికారులంతా సమన్వయంతో పని చేయాలని, మార్పు కనిపించేలా అభివృద్ధి చేయాలని ఈటల సూచించారు. పట్టణాల్లో మురుగు నీరు నిల్వకుండా చూడాలని, నీళ్లు నిల్వడం అంటే అది క్యాన్సర్‌ పుండులాంటిదేనన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, టౌన్‌ ప్లానింగ్‌ రాబోయే వంద సంవత్సరాలకు అనుగుణంగా తయారు చేయాలే తప్ప.. తాత్కాలికంగా పనులు చేయొద్దని ఆదేశించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసి, వచ్చే వారంలో రెండు పట్టణాల్లో పర్యటించి, యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని అరవింద్‌కుమార్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ స్వప్న, కమిషనర్ రషీద్, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక, వైస్ చైర్మన్ నిర్మల, కమిషనర్ జోనా తదితరులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo