ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Apr 29, 2020 , 00:59:30

కట్టుకున్నోడితోనే కడతేర్చింది

కట్టుకున్నోడితోనే కడతేర్చింది

  • కొడుకుతో కలిసి కోడలి హత్య
  • పెట్రోల్‌ పోసి సజీవదహనం 

నిజామాబాద్‌సిటీ: ఇష్టంలేకుండా తన కొడుకును పెండ్లి చేసుకున్నదనే కోపంతో ఓతల్లి.. అతనితోనే కలిసి కోడలిని కడ తేర్చింది. ఒంటిపై కిరోసిన్‌ పోసి సజీవ దహనం చేయించింది. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం శివతండాలో మంగళవారం వెలుగుచూసిన ఈ అమానవీయ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిజామాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శివతండాకు చెందిన రాంసింగ్‌ సికింద్రాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్నా డు. అదే మాల్‌లో పనిచేస్తున్న ప్రకాశం జిల్లా అర్ధవీడు గ్రామానికి చెందిన యెండల రాధను ప్రేమించాడు. ప్రేమ విషయం రాంసింగ్‌ తన తల్లి పద్మకు చెప్పగా.. ఆమె ఒప్పుకోలేదు. దీంతో రాధ 2020 జనవరి 18న పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కాగా, జనవరి 30న నవీపేట్‌లోని వేంకటేశ్వరాలయంలో రాంసింగ్‌, రాధ వివాహం చేసుకొని హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో కాపురం పెట్టారు. లాక్‌డౌన్‌ నేపథ్యం లో మార్చి 28న రాధను తీసుకొని రాంసింగ్‌ శివతండాకు వచ్చాడు. ఈ క్రమంలో ‘తన కొడుకుని కట్నంలేకుండా పెండ్లి చేసుకున్నావంటూ’ రాధను అత్త పద్మ వేధించడం మొదలుపెట్టింది. భార్యను వదిలేస్తే మరో పెండ్లి చేస్తానని తల్లి చెప్పడంతో.. ఇద్దరూ కలిసి రాధ హత్యకు పథకం వేశారు. ఈనెల 24న పత్తితండాలోని బంధువుల ఇంటికి వెళ్దామని రాధను పద్మ నమ్మించింది. అదేరోజు సాయంత్రం బైక్‌పై ముగ్గురు కలిసి బయల్దేరారు. మాక్లూర్‌ మండలం రాంచంద్రాపల్లి అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి వెంట తీసుకొచ్చిన పెట్రోల్‌ను రాధపై పోసి నిప్పంటించారు. మంటలు అంటుకోవడంతో పరుగు తీస్తున్న రాధను బండరాయితో తలపై బాది హత్యచేశారు. అనంతరం అక్కడే ఉన్న కట్టెలు తెచ్చి పూర్తిగా దహనం చేశారు. మరుసటి రోజు ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్‌, ఎస్సై సాయినాథ్‌ పరిశీలించారు. అక్కడ రాధ పర్సు, లోదుస్తులు లభించడంతో విచారణ చేసి ఆమె భర్త రాంసింగ్‌, అత్త పద్మను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హత్య చేసింది తామేనని ఒప్పుకోవడంతో ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు.  

VIDEOS

logo