గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 02:14:00

కట్టుకున్న భార్యే కడతేర్చింది..

కట్టుకున్న భార్యే  కడతేర్చింది..

  • వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..ప్రియుడితో కలిసి భర్త హతం

వికారాబాద్‌/రూరల్‌: కడదాక తోడుంటానని బాస చేసిన భార్యే వివాహేతర బంధం కోసం భర్తను కడతేర్చింది. తాగుడుకు బానిసైన భర్తను చెట్లమందు పేరుతో వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి అడవుల్లోకి తీసుకెళ్లి లోయలోకి నెట్టేసి.. బండరాయితో మోది హతమార్చింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం వెలుగుచూసిం ది. పోలీసుల కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరుకు చెందిన బైండ్ల చెన్నయ్య(38) శశికళ భార్యాభర్తలు.  కొడుకు ప్రవీణ్‌(9), కూతురు పావని(5) ఉన్నారు. దంపతులు కూలీ పనిచేసుకుంటూ జీవించేవారు. చెన్నయ్య తాగుడుకు బానిస కావడంతో శశికళ ఆరేండ్లుగా అదే గ్రామానికి చెందిన (వరుసకు మరిది) రమేశ్‌తో వివాహేతరబంధం కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకొని ప్రియుడు రమేశ్‌తో జీవించాలని నిర్ణయించుకున్నది. నెల క్రితం ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఈ నెల 6న అనంతగిరిలో తాగుడు మానేందుకు చెట్ల మందు పోస్తున్నారని, వెళ్దామని భర్తను ఒప్పించింది. చెన్నయ్యతోపాటు ప్రియుడు రమేశ్‌ను కూడా వెంట తీసుకుని అనంతగిరికి బయలుదేరింది.మార్గమధ్యంలో కొత్తూరు, పరిగిలో మద్యం తాగి అనంతగిరికి బస్సులో చేరుకున్నారు. అనంతగిరి అడవిలో మరోసారి చెన్నయ్యకు మద్యం తాగించారు. అనంతరం లోయలోకి చెన్నయ్యను తోసేసి పెద్ద బండరాయితో మోది హత్యచేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక మృతదేహంపై చెట్ల పొదలు వేసి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. 

తల్లి చనిపోవడంతోనే బయటపడ్డ ఉదంతం

నాలుగు రోజుల క్రితం చెన్నయ్య తల్లి అనారోగ్యంతో మృతి చెందిం ది. సాయంత్రం దాకా చెన్నయ్య కోసం ఎదురు చూసి.. చివరకు గ్రామస్థులే అంత్యక్రియలు నిర్వహించారు. మూడు రోజులైనా చెన్నయ్య రాకపోవడంతో అనుమానించిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు శశికళను గట్టిగా నిలదీయడంతో విషయం బయటపడింది. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వికారాబాద్‌ సీఐ శ్రీనివాస్‌ అనంతగిరిలో చెన్నయ్య మృతదేహాన్ని గుర్తించి అక్కడే పంచనామా నిర్వహించారు.  నిందితురాలు శశికళ(మృతుడు చెన్నయ్య భార్య) కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిచుకొని ఆత్మహత్యకు యత్నించింది.  


logo