గురువారం 28 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 01:49:34

అవసరమైన పోస్టులు 5,181

అవసరమైన పోస్టులు 5,181

  • శాశ్వత పోస్టులు 945
  • ఇతర ఉద్యోగాలు 4,236
  • జల వనరుల శాఖలో భారీ ఖాళీలు
  • దశలవారీగా పోస్టులు భర్తీ చేసే అవకాశం
  • ఈఎన్సీ జనరల్‌ వ్యయ పరిమితి 25 కోట్లు
  • కరీంనగర్‌, రామగుండం, హైదరాబాద్‌ సీఈలకు ఈఎన్సీ క్యాడర్‌
  • శాఖ పునర్వ్యవస్థీకరణపై ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర జలవనరులశాఖ పునర్వ్యస్థీకరణ ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు సోమవారం రాత్రి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. వివిధ స్థాయిల్లో అధికారులకు నిధుల వ్యయ పరిమితి అధికారాలు.. 19 ప్రాదేశిక ప్రాంతాల వివరాలు, అదనంగా అవసరమైన పోస్టుల భర్తీ వివరాలను ఉత్తర్వుల్లో వివరించారు. ప్రస్తుత పునర్వ్యవస్థీకరణ వల్ల మంజూరైన శాశ్వత పోస్టులు 945గా పేర్కొన్నారు. వీటిని త్వరలోనే భర్తీచేస్తారు. వీటితోపాటు 4,236 పోస్టులు అవసరమని తెలిపారు.  శాశ్వత పోస్టులను వెంటనే భర్తీచేసుకోవడానికి అనుమతులు మంజూరుచేశారు. మిగతా 4.236 పోస్టులను కాల్వలు, క్యాంపుల వద్ద జల నియంత్రణ పనులు, ప్రాజెక్టు గెస్టుహౌజ్‌లు.. ఇతర ప్రాంతాల్లో అవసరాలమేరకు అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  ప్రస్తుతం ఉన్న మూడు ఈఎన్సీ పోస్టులకు అదనంగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను మంజూరుచేశారు. దీంతోపాటు మొత్తం 19 ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి ఒక్కో ప్రాంతానికి ఒక్కో సీఈ ఉంటారని పేర్కొన్నారు. దీంతో సీఈల సంఖ్య ప్రస్తుతం ఉన్నవాటితో కలుపుకొని 28 కి చేరాయి. ఈఎన్సీ (జనరల్‌) పరిధిలో మొత్తం వ్యవస్థ పనిచేస్తుంది. ఈఎన్సీ (అడ్మిన్‌), ఈఎన్సీ (ఓఎం)లలో ఒకరు ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలు, మరొకరు ఆపరేషన్లు, నిర్వహణ పర్యవేక్షిస్తారు. ఇది కొత్తగా మంజూరైన పోస్టు. 19 ప్రాదేశిక ప్రాంతాల్లో కరీంనగర్‌, రామగుండం, హైదరాబాద్‌లో పనిచేసే సీఈలు ఈఎన్సీ హోదాలో పనిచేస్తారు. ఈఎన్సీ (జనరల్‌) కనీసం ఏడాదికి కోటి రూపాయల నుంచి 25 కోట్ల వరకు నిధులను కేటాయించే విచక్షణాధికారం ఉంటుంది. చీఫ్‌ ఇంజినీర్లు రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు కేటాయించవచ్చు. ఎస్‌ఈలు రూ.25 లక్షల నుంచి రూ.2 కోట్లు, ఈఈలు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలు, డీఈఈ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కేటాయించవచ్చు. ఇందుకోసం ఏడాదికి మొత్తం బడ్జెట్‌ రూ.280 కోట్లుగా నిర్ణయించారు. వివిధ ప్రాంతాల్లో శాశ్వత భవనాల నిర్మాణం, మంజూరుకోసం రూ.320 కోట్లను మంజూరుచేశారు. తాత్కాలిక భవనాల నిర్మాణం, నిర్వహణకోసం ఏడాదికి రూ. 2.2 కోట్లు కేటాయించారు. logo