శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 00:24:40

దుబ్బాకలో మహిళల భారీ రోడ్‌షో

దుబ్బాకలో మహిళల భారీ రోడ్‌షో

  • l టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతక్కకు జైకొట్టిన మహిళలు  సంఘీభావ బహిరంగ సభకు భారీగా జనం
  • l విపక్షాల డిపాజిట్లు గల్లంతే
  • l నా సవాల్‌కు బీజేపీ తోకముడిచింది
  • l బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు మద్దతుగా మహిళలు జరిపిన రోడ్‌షో దుమ్మురేపింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దుబ్బాక బస్‌డిపో నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ మీదుగా తెలంగాణతల్లి విగ్రహం వరకు జరిగిన ప్రదర్శనలో మహిళలు నినాదాలతో హోరెత్తించారు. మంగళహారతులు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో సాగిన ప్రదర్శన విజయోత్సవ ర్యాలీని తలపించింది. తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద జరిగిన బహిరంగ సభలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘దుబ్బాకలో మా అక్కాచెల్లెళ్ల దెబ్బకు దుమ్ములేచిపోయింది. మొన్నటి రోజున కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లు ఇక్కడనే మీటింగ్‌ పెట్టి కరీంనగర్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ నుంచి పరాయి నాయకులను, కార్యకర్తలను తీసుకొచ్చిన్రు. ఈ మీటింగ్‌కు ఒక్క దుబ్బాక మండలం నుంచి వచ్చిన మహిళలకే జాగ సరిపోతలేదు. దీంతో దుబ్బాకలో సోలిపేట సుజాతక్క విజయం ఖాయమైంది. టీఆర్‌ఎస్‌కు మహిళా లోకం, రైతులు, యువత, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల మద్దతు ఉంది. సుజాతక్క గెలుపు మన మహిళల గెలుపు, మన బీడీ కార్మికుల గెలుపు, బతుకమ్మ గెలుపు. గతంలో టీఆర్‌ఎస్‌కు వచ్చిన మెజార్టీ కన్నా అధిక మెజార్టీతో సుజాతను గెలిపించి మహిళా శక్తి ఎంటో చూపించాలి’ అని పేర్కొన్నారు. చింతమడకలో పుట్టి.. దుబ్బాకలో చదువుకున్న సీఎం కేసీఆర్‌కు దుబ్బాక పైన ప్రేమ ఉంటది కానీ.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ఉంటుందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కరెంట్‌ కష్టాలు, మంచి నీటి కష్టాలు వస్తాయని, బీజేపీకి ఓటు వేస్తే బాయిల కాడ ఉన్న బోర్లకు మీటర్లు పెడతారని చెప్పారు. బీడీ కార్మికులకు రూ.1,600 కేంద్రం ఇస్తున్నట్టు రుజువు చేస్తే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాజీనామా చేయాలని తాను విసిరిన సవాల్‌కు బీజేపీ నేతలు తోకముడిచారని వ్యాఖ్యానించారు. కేంద్రం పదహారు పైసలు కూడా ఇవ్వడం లేదన్నారు. మోదీ సొంత రాష్ట్రంలో రూ.500 పెన్షన్‌ ఇస్తే.. సీఎం కేసీఆర్‌ రూ.2,016 ఇస్తున్నారని గుర్తుచేశారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతులకు ఉచిత కరెంట్‌, బీడీ పెన్షన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలను అమలుచేస్తున్నారా? అని ప్రశ్నించారు. బతుకమ్మ పండుగ వస్తే కన్న కొడుకు మర్చిపోయినా.. కేసీఆర్‌ పెద్ద కొడుకు బతుకమ్మ చీర పంపించారన్నారు. దుబ్బాక అభివృద్ధి కొనసాగాలంటే సుజాతను గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. 3వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి మహిళా శక్తిని చూపించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌, బీజేపీలవి దొంగనాటకాలు: కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాకలో గత పదిహేను రోజుల నుంచి కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు దొంగనాటకాలు ఆడుతున్నారని మెదక్‌ ఎంపీ  కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లు ఓట్లప్పుడే కనపడతారని, ఓట్ల తెల్లారి కనిపించకుండా పోతారని ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆడబిడ్డ దుఃఖాన్ని కూడా హేళన చేసే కుసంస్కారం బీజేపీ అభ్యర్థి రఘురందన్‌రావుది అన్నారు. సీఎం కేసీఆర్‌ ఒక తండ్రిలాగా తనను ఆశీర్వదించి పంపారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత చెప్పారు. దుబ్బాక ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. 

   మా పెద్ద కొడుకు సీఎం కేసీఆర్‌..

సీఎం కేసీఆర్‌ పెద్ద కొడుకులా ఆదుకుంటున్నాడు. నాకు ప్రతినెలా రూ.2,016 పింఛన్‌ వస్తున్నది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే నాలాంటి వృద్ధులు మనో ధైర్యం తో బతుకుతున్నారు. ఈ ఎన్నిక ల్లో నియ్యత్‌గా ఓటు వేయాలె. సోలిపేట సుజాతకు అందరి కంటే ఎక్కువ ఓట్లు రావాలి.

- రుక్కుంబాయి, దుబ్బాక

       ‘కల్యాణలక్ష్మి’ని  అందుకున్నా..

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అందించే కల్యాణలక్ష్మి పథకాన్ని తీసుకున్నా. అదేవిధంగా మా బిడ్డకు జన్మనిచ్చినప్పుడు కేసీఆర్‌ కిట్‌ తీసుకున్నా. సీఎం కేసీఆర్‌ సార్‌ మంచి ఆలోచనలతో ఈ పనులు చేస్తున్నారు. మేమంతా టీఆర్‌ఎస్‌ అభిమానులమే. వచ్చే దుబ్బాక ఉప ఎన్నికలో సుజాతక్కను గెలిపించుకుంటాం. 

- శిల్ప, రామేశ్వరంపల్లి 

సుజాతక్కను గెలిపించుకుంటాం

  • l ముక్తకంఠంతో ప్రకటించిన మహిళలు
  • l సభ సక్సెస్‌తో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దుబ్బాక పట్టణంలో నిర్వహించిన మహిళల సభ విజయవంతమైంది. 10 వేల మందితో సభ నిర్వహించాలనుకున్నా టీఆర్‌ఎస్‌ నాయకులు అంతకు రెట్టింపు స్థాయిలో మహిళలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా తరలివచ్చారు. దుబ్బాక నలుదిక్కులా ఎటు చూసిన గులాబీ జెండాలు, మహిళల ర్యాలీ కనిపించింది. ప్రధాన రహదారులు గులాబీ తోటను తలపించింది. ర్యాలీ పొడవునా ప్రజలకు మంత్రి హరీశ్‌రావు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డిలు అభివాదం చేశారు. రోడ్‌షోకు మహిళలు.. బతుకమ్మలు, మంగళహారతులు, అసైదు లా ఆటలు, లంబాడీల నృత్యాలు, కోలాటాలతో ఘన స్వాగ తం పలికారు. రోడ్‌షో సందర్భంగా భవనాలపైనుంచి టీఆర్‌ఎస్‌ అభిమానులు, మహిళలు పూలు చల్లుతూ.. మేము అం డగా ఉంటామంటూ చేతులు ఊపుతూ జై తెలంగాణ నినాదాలతో మద్దతు తెలిపారు. సభ సక్సెస్‌ కావడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భారీ విజయానికి సంకేతంగా దుబ్బాక మహిళ సభ నిలువనున్నది.