శనివారం 06 జూన్ 2020
Telangana - May 07, 2020 , 02:20:02

మద్యం అమ్మకాలు షురూ

మద్యం అమ్మకాలు షురూ

  • భౌతికదూరం పాటించి కొనుగోళ్లు
  • రాష్ట్రంలో వైన్స్‌ల వద్ద భౌతికదూరంతో మద్యం ప్రియుల క్యూ
  • బుధవారం రూ.45 కోట్ల విలువైన మద్యం విక్రయాలు
  • నిబంధనలు పాటించని 28 వైన్స్‌ల లైసెన్స్‌లు రద్దు చేశాం
  • కల్తీమద్యం, గుడుంబా తయారు చేస్తే పీడీయాక్ట్‌ కింద కేసులు
  • మీడియా సమావేశంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

ఉదయం ఆరు గంటల నుంచే క్యూలైన్లు.. ఎక్కడ చూసినా బారులు తీరిన జనం.. లాక్‌డౌన్‌తో దాదాపు 42 రోజుల అనంతరం రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్న నేపథ్యంలో కనిపించిన దృశ్యమిది. పలుచోట్ల మంగళతోరణాలు.. ధూపదీప నైవేద్యాలు.. కర్పూరహారతులు.. ప్రత్యేక పూజలతో బుధవారం ఉదయాన్నే రాష్ట్రమంతటా మందు సందడి మొదలైంది. మద్యం ప్రియులు స్వీయ క్రమశిక్షణతో స్వచ్ఛందంగా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి.. కొనుగోళ్లుచేశారు. తొలిరోజు రూ.45 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలిసింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా 42 రోజులుగా మూతపడ్డ మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం తెరుచుకున్నాయి. మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. కేంద్ర మార్గదర్శకాలను, రాష్ట్రంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మద్యం దుకాణాలు తెరుస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని నిబంధనలు పాటించేలా ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని సూచించారు. సుదీర్ఘ విరామం తర్వాత మద్యం అమ్మకాలు ప్రారంభం కావడంతో మద్యం ప్రియులు దుకాణాల వద్ద కిక్కిరిశారు. కొన్ని షాపుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. రాష్ట్రంలోని మొత్తం 2,211 దుకాణాలకుగాను.. కంటైన్మెంట్‌ జోన్ల లో ఉన్న ఆరు దుకాణాలు, ఇతర కారణాల వల్ల మూతపడ్డ షాపులు కలిపి 35 మినహా మిగతా అన్ని షాపులు తెరుచుకొన్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగిన అమ్మకాల్లో రూ.45 కోట్ల వ్యాపారం జరిగినట్టు సమాచారం. 


సాధారణ రోజుల్లో రాష్ట్రంలో నిత్యం రూ.55 కోట్ల వరకు మద్యం విక్రయా లు జరుగుతుంటాయి. బార్లు, రెస్టారెంట్లు మూసి ఉం డటం, సాయంత్రం 6 గంటలకే షాపులు మూసివేయా ల్సి రావటంవల్ల విక్రయాలు కొంత తగ్గినట్టు దుకాణదారులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలోని 19 డిపోల నుంచి రూ.53 కోట్ల మద్యాన్ని దుకాణదారులు దిగుమతిచేసుకొన్నట్టు తెలిసింది. ప్రతి దుకాణం వద్ద మద్యం ప్రియులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ.. స్వీయ నియంత్రణతో కొనుగోళ్లు జరిపారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో, డిపోల్లో సరిపడా నిల్వలు ఉన్నందున ఎలాంటి గందరగోళం లేకుండా మద్యం కొనుక్కోవచ్చని అధికారులు సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు మహబూబాబాద్‌ జిల్లాలో పలుచోట్ల మద్యం దుఖానాల వద్ద మహిళల సందడి కనిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో మహిళలు మద్యం కొన్నారు.

తప్పని పరిస్థితుల్లోనే తెరిచాం

  • ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌


మార్కెట్లోకి పెద్ద మొత్తంలో వస్తున్న కల్తీ మద్యం, గుడుంబాను అరికట్టడానికే రాష్ట్రంలో మద్యంషాపులు తెరిచినట్లు ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. బుధవారం నాంపల్లి ఆబ్కారీ భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై మద్యంషాపుల ప్రారంభంపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే మద్యం అమ్మకాలు జరుగాలని.. లేకపోతే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ప్రతి దుకాణం దగ్గర ధరల జాబితా, శానిటైజర్లు ఉంచాలన్నారు. ఇప్పటికే 28 వైన్స్‌ల లసెన్సులు రద్దుచేసినట్లు వెల్లడించారు. గుడుంబా తరలిస్తున్న వారిపై 2,409 కేసులు నమోదు చేసి, 2,089 మందిని అరెస్టు చేసినట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మొత్తం 11,130 లీటర్ల గుడుంబా సీజ్‌చేసినట్టు తెలిపారు. 1,25,621 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకొన్నామన్నారు. బెల్లం అక్రమ రవాణాదారులను అడ్డుకునే క్రమంలో ఎక్సైజ్‌ అధికారులు గాయాలపాలయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యం కొరత లేదని, కాబట్టి మద్యం ప్రియులు ఎలాంటి హడావుడి లేకుండా నిబంధనల ప్రకారం మద్యం కొనుక్కోవాలన్నారు. ఆబ్కారీశాఖ తరఫున లక్ష 75 వేల లీటర్ల శానిటైజర్‌ను ప్రభుత్వ కార్యాలయాలకు అందజేసినట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. 

స్వల్పంగా పెరిగిన మద్యం ధరలు

రాష్ట్రంలో మద్యం ధరలను ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. చీప్‌ లిక్కర్‌పై 11%, మిగిలిన బ్రాండ్లపై 16% ధరలు పెంచుతూ ఆబ్కారీశాఖ ఆదేశాలు జారీచేసింది. అన్ని రకాల, అన్ని సైజుల బీర్లపై రూ.30 పెంచారు. బుధవారం నుంచే కొత్త మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి. 

బ్రాండ్లవారీగా మద్యం ధర పెంపు విలువ (రూ.ల్లో) 

క్యాటగిరీ
90ఎంఎల్‌-180 ఎంఎల్
375 ఎంఎల్‌
750 ఎంఎల్‌
ఆర్డినరీ
102040
మీడియం
204080
ప్రీమియం
3060120
స్కాచ్‌
4080160


logo