శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:24

సాగర్‌ దిశగా కృష్ణమ్మ పరుగు

సాగర్‌ దిశగా కృష్ణమ్మ పరుగు

  • శ్రీశైలంలో 844 అడుగులకు నీటిమట్టం
  • కరెంట్‌ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటివిడుదల
  • పోతిరెడ్డిపాడుకు నీటిని వదిలిన ఏపీ 
  • కృష్ణా, గోదావరి బేసిన్లలో స్థిరంగా వరద

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. తుంగభద్రలో కొద్దిగా పెరిగింది. శ్రీశైలం జలాశయానికి సోమవారం సాయంత్రానికి 46 వేల క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలో 67.27 టీఎంసీల నీటినిల్వతో 844.40 అడుగుల నీటిమట్టం ఉన్నది. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో కరెంట్‌ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ నాగార్జునసాగర్‌ దిశగా పరుగులు పెడుతున్నది. సాగర్‌కు సోమవారం సాయంత్రం ఎనిమిదిన్నర వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. అర్ధరాత్రికి మరింత పెరుగనున్నది. ఎగువన ఆల్మట్టి, నారాయణపుర, జూరాలకు ఇన్‌ఫ్లోలు స్థిరంగా వస్తున్నాయి. శ్రీశైలం నుంచి కృష్ణాబోర్డు అనుమతి లేకుండానే ఏపీ పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేసినట్టు తెలిసింది. హంద్రీనీవా ద్వారా కూడా మంగళవారం నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నట్టు తెలిసింది. 

ఎస్సారెస్పీకి 16,395 క్యూసెక్కుల వరద 

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 16,395 క్యూసెక్కుల వరద వస్తుండగా, 6,242 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం నిండుకుండను తలపిస్తున్నది. గోదావరి నది పుష్కరఘాట్‌ను ఆనుకుని 7.2 మీటర్ల ఎత్తులో పారుతున్నది. లక్ష్మీబరాజ్‌కు 43,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా 18 గేట్లు ఎత్తివేయడంతో 32,700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన పార్వతీ పంప్‌హౌజ్‌ నుంచి ఒక మోటర్‌ ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి 2,610 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎగువన వాగులు, వంకల ద్వారా ఎల్లంపల్లిలోకి మరో 1,130 క్యూసెక్కులనీరు వచ్చి చేరుతున్నది. ఎస్సారార్‌ నుంచి సోమవారం ఎల్‌ఎండీకి 7,325 క్యూసెక్కుల నీటిని వదిలారు.logo