సోమవారం 13 జూలై 2020
Telangana - Mar 30, 2020 , 18:37:20

సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ మొత్తంలో విరాళాలు

సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ మొత్తంలో విరాళాలు

హైదరాబాద్ : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవాళ ఒక్క రోజే రూ.13 కోట్ల విరాళాలు వచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించేందుకుగాను పలు సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. దీనికి సంబంధించిన చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు.

హెటిరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం అందించారు. దీంతో పాటు రూ. 5 కోట్ల విలువైన మందులను (హైడ్రాక్సి క్లోనోక్విన్, రిటోనవిర్, లోపినవిర్, ఒసెల్టమివిర్) కూడా ప్రభుత్వానికి అందించారు. హెటిరో చైర్మన్ పార్థసారధి రెడ్డి, డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి ముఖ్యమంత్రికి చెక్కును అందించారు. మందులను వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజందర్ కు అందజేశారు. వాల్యూ ల్యాబ్స్ సీఎం సహాయ నిధికి రూ.5.25 కోట్ల విరాళం అందించాయి.   సువెన్ ఫార్మా కోటి రూపాయల విరాళం సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సువెన్ ఫార్మా చైర్మన్ వెంకట్ జాస్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. అదేవిధంగా ఎన్.సి.సి. లిమిటెడ్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండి ఎ. రంగరాజు సీఎం కేసీఆర్ అందించారు. మరో వైపు శ్రీచైతన్య విద్యాసంస్థలు కోటి రూపాయల విరాళం అందించగా...దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ డైరెక్టర్ వై.శ్రీధర్ సీఎం కేసీఆర్ కు అందించారు.

వీరితోపాటు తెలంగాణ మోటార్ వెహికిల్స్ ఇన్స్ పెక్టర్ అసోసియేషన్ తరపున రూ.1.5 కోట్ల విరాళం చెక్కును అసోసియేషన్ అధ్యక్షుడు కె.పాపారావు తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చేందుకు ముందుకువస్తోన్న ప్రతీఒక్కరికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. 
logo