బుధవారం 03 జూన్ 2020
Telangana - May 05, 2020 , 01:42:41

గాలివాన బీభత్సం

గాలివాన బీభత్సం

  • వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో భారీగా పంట నష్టం
  • నాగర్‌కర్నూల్‌లో దెబ్బతిన్న బొప్పాయి, మామిడి తోటలు
  • మరో రెండురోజులు పలు ప్రాంతాల్లో వర్షసూచన

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ఈదురుగాలుల వాన బీభత్సం సృష్టించింది. దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో అనుకోని వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. చాలా చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మరో 48 గంటల వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అకాల వర్షం ఆపార నష్టాన్ని మిగిల్చింది. పలు ప్రాంతాల్లో కురిసిన గాలివానతో వరి పంట దెబ్బతినగా, కల్లాల్లో ధాన్యం తడిసిముద్దయ్యింది. జనగామ జిల్లాలోని పలు మండలాల్లో అకాల వర్షం రైతులను మరోసారి అతలాకుతలం చేసింది.  మామిడి నేలరాలగా.. కూరగాయలు, పూల తోటలకు నష్టం వాటిల్లింది. ఆజాంజాహి మిల్లు వద్ద తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ షెడ్లు కూలిపోయాయి.

దెబ్బతిన్న ఇండ్లు-తడిసిన ధాన్యం

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇండ్లు దెబ్బతిన్నాయి. అక్కడక్కడా ధాన్యం కుప్పులు తడిసిపోయాయి. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలో కూడా అకాల వర్షానికి ధాన్యం రాశులు తడిసిపోయాయి. ఊహించని విధంగా వర్షం బీభత్సం సృష్టించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలో కురిసిన అకాల వర్షానికి తోటలు దెబ్బతినగా, విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. బొప్పాయి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో మామిడి కాయలు నేలరాలాయి. ఇక, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాల్లో కూడాభారీ వర్షం కురిసింది. ఇప్పటికే నాలుగు దఫాలుగా కురిసిన వర్షానికి 25,670 ఎకరాల వరిపైరు దెబ్బతిన్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యానికి భారీ నష్టం చేకూరింది. పలు గ్రామాల్లో రేకుల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయి చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పంటచేను నేలకొరిగింది. 

45 డిగ్రీలు దాటిన ఎండలు

సోమవారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో అత్యధికంగా 56 మి.మీ, కేశంపేటలో 26 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ వెల్లడించింది. మరో 48 గంటలపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా పెరిగింది. నిర్మల్‌ జిల్లా కడ్డం పెద్దూర్‌లో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

కుప్పుకూలిన కోహెడ పండ్ల మార్కెట్‌

భారీగా వీచిన ఈదురుగాలుకు రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్‌ నేలమట్టమైంది. ఒక్కసారిగా వచ్చిన గాలివాన రేకుల షెడ్లను నామరూపాలు లేకుండా చేసింది. షెడ్డు పూర్తిగా కిందపడటంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే నిలిపివుంచిన లారీ బోల్తా పడింది. 108 వైద్యసిబ్బంది గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స అందించారు.  తిరుపతమ్మ, బంటి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కరోనా నేపథ్యంలో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా కోహెడకు తరలించిన సంగతి తెలిసిందే. విషయం తెలుకొన్న మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రైతులకు, పండ్ల వ్యాపారులకు నష్టం జరుగకుండా చూస్తామని మంత్రి సబిత హామీఇచ్చారు. అకాల వర్షం, ఈదురుగాలులతో కోహెడ్‌ పండ్ల మార్కెట్‌ షెడ్‌ కుప్పకూలిన ఘటనలో గాయపడినవారిని అన్నివిధాలా ఆదుకుంటామని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. సంఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గాయపడిన వారి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.  


logo