గురువారం 09 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 02:24:19

పల్లె ప్రగతి పరుగు

పల్లె ప్రగతి పరుగు

  • ఆరేండ్లల్లో గ్రామాలకు రూ.లక్ష కోట్ల నిధులు
  • కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో మారిన ముఖచిత్రం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి రాష్ట్రంలో ఉసూరుమన్న తెలంగాణ పల్లెలు స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నాయి. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో పల్లె ముఖచిత్రం మరింత మారుతున్నది. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు ఇప్పటివరకు రూ.లక్ష కోట్లకుపైగా నిధులు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14లో 23 జిల్లాలకు రూ.13వేల కోట్లు ఇస్తే స్వరాష్ట్రంలో తొలి ఏడాదే 10 జిల్లాలకు రూ.13,877.07 కోట్లు ఇచ్చింది. ఇలా గడిచిన ఆరేండ్లల్లో రూ. లక్ష కోట్లు కేటాయించింది. 2015లో గ్రామజ్యోతి కింద రూ.25వేల కోట్లు అదనంగా ఇచ్చింది. గ్రామాల పారిశుద్ధ్యానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్ర మం అద్భుత ఫలితాలు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 12,455 గ్రామాల్లో డంపింగ్‌ యార్డులకు స్థలాలు గుర్తించి, 11,657 చోట్ల పను లు ప్రారంభించింది. 11,366 గ్రామాల్లో శ్మశానవాటికలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికే 9,017 చోట్ల పనులు మొదలుపెట్టింది. 30వేలకుపైగా పాడుబడిన బావులను పూడ్చివేసింది. 9,331 గ్రామాలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు సమకూరాయి. సెప్టెంబర్‌ నుంచి ప్రతి నెల పంచాయతీలకు రూ.399 కోట్లు కేటాయిస్తున్నది.

ఆరేండ్లలో కొన్ని మైలు రాళ్లు

2018లో అమలులోకి వచ్చిన పంచాయతీ రాజ్‌ కొత్త చట్టం గ్రామాలకు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది.

8,695 ఉన్న గ్రామపంచాయతీలు 12,751కి పెరిగాయి.

గతేడాది 9,355 పంచాయతీ కార్యదర్శులను నియమించారు. 1,700 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు.

ఉపాధి హామీ పనుల్లో రికార్డుస్థాయిలో ఈ ఏడాది రోజుకు 25 లక్షల మందికి ఉపాధి కల్పించారు. 

రాష్ట్రంలో 38,58,615 మందికి ఆసరా పింఛన్లు. పింఛన్‌ వయసు 65 ఏండ్లనుంచి 57 ఏండ్లకు తగ్గించారు.


logo