మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 00:52:49

మహిళా సంఘాలకు మరుగుదొడ్ల నిర్వహణ

మహిళా సంఘాలకు మరుగుదొడ్ల నిర్వహణ

  • ఉత్తర్వులు జారీచేసిన పురపాలక శాఖ 
  • ఓడీఎఫ్‌ సాధన, మహిళా సాధికారతే లక్ష్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) పట్టణాలు, మహిళా సాధికారతను సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడగలదని భావిస్తున్నది. పట్టణాల్లోని స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్స్‌ (ఎస్‌ఎల్‌ఎఫ్‌), పట్టణ వికలాంగుల సమితి (టీవీఎస్‌), ఇతర మహిళా సంఘాలతో సంప్రదింపులు జరపాలని పురపాలక కమిషనర్లకు సూచించింది.

ఈ ప్రక్రియకు మెప్మా నేతృత్వం వహిస్తుండగా, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ) భాగస్వామిగా వ్యవహరించనున్నది. ఎంపికైనవారికి ఏఎస్‌సీఐ శిక్షణ ఇస్తుంది. పారిశుద్ధ్య వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ, పారిశుద్ధ్య ఉత్పత్తుల తయారీలో మహిళలు భాగస్వాములు కానున్నారు. మరోవైపు పట్టణ అవసరాలకు అనుగుణంగా పబ్లిక్‌ టాయిలెట్లు, కమ్యూనిటీ టాయిలెట్లు, షీ టాయిలెట్లు నిర్మించాలని పట్టణ స్థానిక సంస్థలను ఆదేశించింది. 

మహిళలకే ఎందుకంటే.. 

తమిళనాడు, ఒడిశా, బీహార్‌ తదితర రాష్ర్టాల్లో ఇప్పటికే పురపాలక సంఘాల్లో టాయిలెట్లు, పారిశుద్ధ్య నిర్వహణను మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు అప్పగించారు. వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ మెరుగైన ఫలితాలను రాబట్టారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సైతం టాయిలెట్లను పురుషుల కన్నా మహిళలే సమర్థంగా నిర్వహిస్తున్నారని చెప్తున్నాయి. ఎస్‌ఎల్‌ఎఫ్‌, ఇతర మహిళా సంఘాల సభ్యులు ఇప్పటికే ఓడీఎఫ్‌ సాధనలో కీలకపాత్ర పోషిస్తూ ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. 


logo