మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:52:04

రైతుకు రక్షణగా ఎఫ్‌పీసీలు

రైతుకు రక్షణగా ఎఫ్‌పీసీలు

  • రాష్ట్రంలో అన్నదాత ఆదాయం పెంచిన 15 కంపెనీలు
  • రాష్ట్రంలో ఎఫ్‌పీసీల ఆవశ్యకతపై సెస్‌ సర్వే సూచనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పంటల సాగులో, మార్కెటింగ్‌లో ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీస్‌ (ఎఫ్‌పీసీ) రైతులకు శ్రీరామరక్ష అని, వీటి ద్వారా రైతు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రభుత్వం వీలైనంత ఎక్కువగా ఎఫ్‌పీసీలను ప్రోత్సహించాలని సూచించింది. రాష్ట్రంలో ఎఫ్‌పీసీల ఆవశ్యకత, రైతులకు కలిగే లాభాలపై సెస్‌ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో సుమారు 142 ఎఫ్‌సీలు ఉండగా వీటి కార్యకలాపాలను పరిశీలించింది. రైతులందరికీ ఎఫ్‌పీసీలపై అవగాహన కల్పించడంతోపాటు సభ్యులుగా చేరేలా ప్రోత్సహించాలని సూచించింది. దీంతో రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశం ఉన్నదని తెలిపింది. సభ్యులైన రైతులకు పెట్టుబడి తగ్గడంతోపాటు ఆదాయం ఎక్కువగా ఉన్నది. ఈ కంపెనీలు రైతులతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మెరుగైన ధర ఇచ్చి పంటలను కొనుగోలుచేస్తాయి. పంటలకు నష్టం వచ్చినా కంపెనీలే భరిస్తాయి. సభ్యులకు విత్తనాలు, ఎరువులు అందించడంతోపాటు సాగులోనూ మెళకువలు నేర్పిస్తాయి. రాష్ట్రంలో 15 ఎఫ్‌పీసీల ద్వారా రైతులు లాభాలు గడించినట్టు సర్వేలో తేలింది. తెలంగాణలో కరీంనగర్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌, చేతన ఆర్గానిక్‌ ఆగ్రికల్చర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ విజయవంతమైన ఎఫ్‌పీసీలుగా సర్వేలో గుర్తించారు. ఆ తర్వాత కొడంగల్‌ ఎఫ్‌పీసీఎల్‌, ఆంగడిరాయ్‌చూర్‌ ఎఫ్‌పీసీఎల్‌, హస్నాబాద్‌ ఎఫ్‌పీసీఎల్‌లో రైతుల ఆదాయం మెరుగ్గా ఉన్నదని సెస్‌ పేర్కొన్నది.

ఎఫ్‌పీసీలతో లాభాలు

రైతుల పెట్టుబడి వ్యయం తగ్గడంతోపాటు ఆదాయం పెరుగుతుంది. అవసరమైన విత్తనాలు, ఎరువులను సదరు కంపెనీనే సరఫరా చేస్తుంది. ఎఫ్‌పీసీల్లో సభ్యులైతే ఉమ్మడిగా ఒక యూనిట్‌గా రుణాలు పొందవచ్చు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఎఫ్‌పీసీల విధానం విజయవంతంగా కొనసాగుతున్నది. తెలంగాణ కూడా ఎఫ్‌పీసీలను ప్రొత్సహించాల్సి ఉన్నది.

సర్వేలోని మరిన్ని విషయాలు

  • రైతుల్లో అవగాహన లేకపోవడం, ఇతర కారణాల వల్ల రాష్ట్రంలో ఎఫ్‌పీసీల కార్యకలాపాలు చాలా తక్కువస్థాయిలో కొనసాగుతున్నాయి. రైతులకు అవగాహన కల్పించడంతోపాటు ఎఫ్‌పీసీల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేయాలి.
  • ఎఫ్‌పీసీలు బ్యాంకులు, వివిధ ఆర్థికసంస్థల నుంచి 12-16 శాతం అధిక వడ్డీతో రుణాలు పొందుతున్నాయి. స్వయంసహాయక సంఘాలకు 3 శాతం వడ్డీతో ఇచ్చే పథకాలను ఎఫ్‌పీసీలకు కూడా విస్తరించాలి.
  • చాలా ఎఫ్‌పీసీలు ఆర్థిక రిటర్నులను దాఖలుచేయడంలేదు. వీటిపై చర్యలు తీసుకోవాలి.
  • కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల తరహాలో తెలంగాణ కూడా ఎఫ్‌పీసీల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు వంటి అంశాల్లో సహకరించాలి.
  • రాష్ట్రంలోని అన్ని ఎఫ్‌పీసీలను ఈ-నామ్‌(ఎలక్ట్రానిక్‌ మార్కెటింగ్‌)తో అనుసంధానం చేయాలి. ప్రస్తుతం కేవలం 13 ఎఫ్‌పీసీలే ఈ- నామ్‌తో అనుసంధానమైన ఉన్నాయి. వీటి కార్యకలాపాలు కూడా ఇంకా ప్రారంభంకాలేదు.


logo