గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 02:30:00

కరోనా బాధితులకు వేడి భోజనం

కరోనా బాధితులకు వేడి భోజనం

  • దవాఖానల్లో అత్యాధునిక యంత్రాలతో శుభ్రత
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనాతో చికిత్స పొందుతున్న రోగులకు భోజనం చేరేవరకు వేడిగా ఉండేలా విమానాల్లో మాదిరి హాట్‌ప్యాక్‌ క్యారియర్‌ను వినియోగించేందుకు ఏర్పాట్లుచేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. కొవిడ్‌-19 దవాఖానల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు అత్యాధునిక యంత్ర పరికరాలను పెద్దఎత్తుగా వినియోగించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించినట్టు శనివారం వెల్లడించారు. అతి త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఫ్లోర్‌ క్లీనింగ్‌, వాల్‌ క్లీనింగ్‌, బాత్రూం క్లీనింగ్‌ కోసం పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని కొనుగోలు చేసి అన్ని కొవిడ్‌ దవాఖానలకు అందజేస్తామని చెప్పారు. 

ఐసీయూలో కూడా వీటినే వినియోగిస్తామని తెలిపారు. వేగంగా, ఎక్కువ నాణ్యతతో పని చేయగల సామర్థ్యం ఉన్న యంత్రాలను తీసుకురావాలని అధికారులను ఈటల ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల వ్యర్థాలను తరలించడం కోసం ప్రత్యేక యంత్రాలను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. కరోనా వారియర్స్‌గా వైద్యారోగ్యశాఖలో ఉన్న ప్రతి ఉద్యోగి నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. వీరిలో చాలా మందికి వైరస్‌ సోకి క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయని, శానిటైజేషన్‌ సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉన్నదని చెప్పారు. వైరస్‌వ్యాప్తి పెరిగి దవాఖానల్లో శుభ్రం చేయడానికి ముందుకురావటం, ఈ నేపథ్యంలో పరికరాల కొనుగోలుకు నిర్ణయించామని తెలిపారు.

కరోనాపై పోరులో మేముసైతం

కరోనా వ్యాపిస్తున్న వేళ ప్రజలకు సేవచేసేందుకు తాము సిద్ధంగాఉన్నామని ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ప్రతినిధులు తెలిపారు. గతంలో న్యుమోనియా, లెప్రసీ, కుటుంబనియంత్రణ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యామని, ఇప్పుడు కూడా అవకాశం కల్పించాలని శనివారం హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు.    


logo