శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:38:44

బైడెన్‌ విక్టరీతో హెచ్‌1బీపై ఆశలు

బైడెన్‌ విక్టరీతో హెచ్‌1బీపై ఆశలు

  • వీసా సమస్యలు పరిష్కారం అవుతాయని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల ఆశాభావం
  • యూఎస్‌లో ఉద్యోగాలకు అవకాశాలు మెరుగు
  • పెరుగనున్న ఐటీ కంపెనీల కార్యకలాపాలు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ విజయం నగరవాసుల్లో కొత్త ఆశలు చిగురింపచేస్తున్నది. వీసాలు, వలసలపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ఆంక్షలు తొలగిపోతాయని, అమెరికాలో, చదువులకు, ఉద్యోగాలకు అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. హెచ్‌1బీ వీసాలు, అవి పొందినవారి జీవిత భాగస్వాములకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నారు. వీసా సమస్యలపై బైడెన్‌ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ హయాంలో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు కఠినతరం అయ్యాయి. 

అమెరికా వీసా సంపాదించడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా  హెచ్‌-1బీ వీసాలపై ఆంక్షలు విధించడం ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. హెచ్‌-1బీ పరిధిలోకి వచ్చే విదేశీ ఉద్యోగులకు తాత్కాలిక వీసాలు జారీ చేయడాన్ని అమెరికా నిలిపివేసి ఐటీ కంపెనీలకు షాకిచ్చింది. గ్రీన్‌కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో అమెరికాకు వెళ్లడంపై చాలామంది పునరాలోచనలో పడ్డారు. ఒక దేశానికి పరిమితిని మించి వీసాలు ఇవ్వకూడదనే ఆంక్షలు  (కంట్రీస్‌ స్పెసిఫిక్‌ వీసా కోటా) ఉండటం,  డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ ప్రోగ్రాం(డీసీసీఏ)ను ట్రంప్‌ సర్కార్‌ పట్టించుకోకపోవడంతో అమెరికా ప్రయాణాలు చాలా వరకు తగ్గాయి. ఇప్పుడు బైడెన్‌ ఎన్నికతో అమెరికా విమానం ఎక్కాలనుకునేవారి ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.

ఐటీ కంపెనీలకు అద్భుత అవకాశాలు

అమెరికాలో బైడెన్‌ గెలవడం వల్ల భారతీయులకు చాలా అవకాశాలు వస్తాయి. ఐటీ కంపెనీలకు బిజినెస్‌ పెరుగుతుంది. నేచురలైజేషన్‌ ప్రక్రియ ద్వారా గ్రీన్‌కార్డు హోల్డర్లకు ఇచ్చే పౌరసత్వం వీలైనంత ఎక్కువమందికి ఇస్తామని బైడెన్‌ ప్రకటించడం మంచి విషయం. అలాగే నిపుణులైన ఉద్యోగులకు ఇచ్చే హెచ్‌-1 బీ వీసాదారుల భాగస్వాముల సమస్యలు పరిష్కారం కానున్నాయి. 

-  సత్యనారాయణ ఎం, ప్రెసిడెంట్‌, తెలంగాణ ఫెసిలైట్స్‌ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌.

బైడెన్‌ విక్టరీ ఇండియాకు శుభసూచకమే

అమెరికాలో సుమారు 40 లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. ట్రంప్‌ వీసాలు ఆపడం వల్ల కంపెనీల ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి. ప్రస్తుతం 8 లక్షల గ్రీన్‌కార్డులు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. అందులో అత్యధికం భారతీయులవే ఉంటాయి.  బైడెన్‌, హారిస్‌ గెలుపు వల్ల ఇమ్మిగ్రేషన్‌ కష్టాలు చాలావరకు పరిష్కారమవుతాయనే నమ్మకం ఉంది.

- డాక్టర్‌ విజయ కేసరీ, కాలిఫోర్నియా, యూఎస్‌ఏ

తాత్కాలిక వీసాలను సంస్కరిస్తారని నమ్ముతున్నాం

టెక్నాలజీ కంపెనీలు హెచ్‌-1 బీ వీసాలపై అధికంగా ఆధారపడుతాయి. ప్రతి ఏడాది పది వేలకు పైగా ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికా కంపెనీలు వీలు కల్పించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమెరికాలో  నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. అయితే స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) కోర్సుల్లో డాక్టరేట్‌ చేసిన వారికి సులభంగా గ్రీన్‌కార్డు ఇస్తామనడం భారతీయ విద్యార్థులకు మంచి అవకాశం. చిన్నతనంలో తల్లిదండ్రులతో వెళ్లి.. అమెరికాలో ఉంటున్న వారికి ప్రభుత్వపరమైన రక్షణ కల్పించే ప్రక్రియను బైడెన్‌ సర్కార్‌ చేపడుతారని నమ్ముతున్నాం. బైడెన్‌ ఉదారంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. 

- విజయ్‌, ఉద్యోగి.

వీసాల ఆంక్షలు ఎత్తేస్తారనే నమ్మకం ఉంది

 హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తదిరత నగరాల్లో.. ఇన్ఫోసిస్‌, గూగుల్‌, టెక్‌ తదితర కంపెనీల్లో పనిచేసిన వాళ్లు.. హెచ్‌ 1-బీ వీసాపై అమెరికా వెళుతుంటారు. కానీ ట్రంప్‌ నిర్ణయం వల్ల వారి అవకాశాలపై పిడుగుపడింది.  హయ్యర్‌ టెక్నికల్‌ స్కిల్స్‌ ఉన్నవారికి అన్యాయం జరిగింది. తక్కువ జీతానికి ఉద్యోగాల్లో చేరే నిబంధనలు ఉన్న వీసాలతోనే అనుమతిస్తున్నారు. అది సరైనది కాదు. నూతన అధ్యక్షుడు ఏం చేస్తాడనేది వేచి చూడాలి. 

- దీప్తి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌