శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:20:22

పల్లెలే పట్టుగొమ్మలు

పల్లెలే పట్టుగొమ్మలు

  • ఆర్థిక పునరుజ్జీవానికి ఆశాకిరణాలు
  • ఉత్తేజాన్నిస్తున్న రుతుపవన అంచనాలు
  • బడా కంపెనీల చూపులన్నీ  గ్రామ సీమల వైపే
  • రేసులో ముందున్న ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలు

గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఏ దేశానికైనా పల్లెలే పట్టుగొమ్మలన్న నానుడిలోని పరమార్థం బడా కార్పొరేట్‌ కంపెనీలకు ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది. దీంతో ఎన్నో పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ప్రస్తుతం గ్రామసీమలపై దృష్టిసారిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఎదురైన నష్టాలను గ్రామీణ మార్కెట్ల ద్వారా భర్తీ చేసుకోవాలని ఆశిస్తున్నాయి. దేశంలో వ్యవసాయరంగం కరోనా మహమ్మారిని తృణీకరించి ప్రగతి పథంలో పరుగులు తీస్తుండటం, గ్రామీణ మార్కెట్ల నుంచి అధిక రాబడులు వస్తుండటం ఇందుకు ప్రధాన కారణం.


కరోనా సంక్షోభం దేశంలో ఎన్నో రంగాలను కుంగదీసింది. ఈ మహమ్మారి కాటుతో తీవ్రంగా నష్టపోయిన పారిశ్రామిక, వ్యాపారవేత్తల్లో ఇప్పుడు గ్రామసీమలు సరికొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. దీంతో ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తులతో పల్లెలకు పరుగు తీస్తున్నాయి. ఈ రేసులో వాహన, ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) రంగాల కంపెనీలు ముందున్నాయి. ప్రగతి పథంలో పరుగులు తీస్తున్న వ్యవసాయ రంగానికి ఈసారి రుతుపవనాలు మరింత అనుకూలిస్తాయన్న అంచనాలు ఇందుకు ప్రధాన కారణం. లాక్‌డౌన్‌ వల్ల ఏప్రిల్‌, మే నెలల్లో కార్లు, ద్విచక్ర వాహన అమ్మకాలు పూర్తిస్థాయిలో స్తంభించినప్పటికీ ట్రాక్టర్ల అమ్మకాలు పెరుగడం ఈ కంపెనీలకు ఉత్సాహాన్నిస్తున్నది. దీంతో గ్రామాలు, చిన్న పట్టణాలపై పలు కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. ‘అన్నదాతలకు నిజమైన ధనం వారి పాడిపంటలే. రైతుల జీవనంలో, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో ట్రాక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి’ అని సోనాలికా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రామన్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి, వ్యవసాయరంగానికి ప్రభుత్వ తోడ్పాటు పెరుగుతుండటంతో గ్రామీణ మార్కెట్లలో ట్రాక్టర్లకు గిరాకీ మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ తర్వాత కార్లు, ద్విచక్ర వాహన అమ్మకాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ), టీవీఎస్‌ మోటర్‌ కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతం నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు, చిన్నచిన్న పట్టణాల్లోనే తమకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నది కాదనలేని వాస్తవమని వారు స్పష్టం చేశారు. 

ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకూ డిమాండ్‌

మరోవైపు ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తిదారులు కూడా గ్రామీణ ప్రాంతాలపై భారీగా ఆశలు పెట్టుకొన్నారు. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పెరుగుతుండటం సంతోషదాయకమని గోద్రెజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ సీఈవో (ఇండియా, సార్క్‌) సునీల్‌ కటారియా తెలిపారు. వ్యవసాయరంగంపై కరోనా సంక్షోభ ప్రభావం పెద్దగా లేకపోవడం ఇందుకు కారణమన్నారు. పట్టణాల నుంచి భారీ సంఖ్యలో వలస కూలీలు తిరిగి తమ స్వస్థలాలకు చేరడంతో మున్ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు గిరాకీ మరింత పెరిగే అవకాశమున్నదని కటారియా చెప్పారు. మారికో సంస్థ ఎండీ, సీఈవో సౌగత గుప్తా, జ్యోతి ల్యాబ్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉల్లాస్‌ కామత్‌ కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌కు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పెరుగుతుందని ఆశిస్తున్నట్టు పార్లే ప్రొడక్ట్స్‌ బిస్కెట్ల విభాగ అధిపతి మయాంక్‌ షా తెలిపారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల కంటే పల్లెల్లోనే తమ అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.

పుంజుకొంటున్న ద్విచక్ర వాహన అమ్మకాలు


మరోవైపు గ్రామీణ, సెమీ అర్బన్‌ మార్కెట్లలో ద్విచక్ర వాహన అమ్మకాలు జోరందుకొంటున్నాయి. ఆయా మార్కెట్ల నుంచి డిమాండ్‌ పెరుగడంతో జూన్‌లో 4.50 లక్షలకుపైగా వాహనాలను డెలివరీ చేసినట్టు ప్రపంచ దిగ్గజ కంపెనీ హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. మే నెలలో 1,12,682 బైక్‌లు, స్కూటర్లను డెలివరీ చేశామని జూన్‌లో ఇవి దాదాపు నాలుగు రెట్లు వృద్ధిచెంది 4,50,744 యూనిట్లకు పెరిగాయని వెల్లడించింది. కొవిడ్‌-19కు ముందు జరిపిన అమ్మకాలతో పోలిస్తే జూన్‌లో 90 శాతం అమ్మకాలు జరిపినట్టు తెలిపింది. గతేడాది జూన్‌లో హీరో మోటోకార్ప్‌ 6.16 లక్షల వాహనాలను అమ్మింది. 

జీడీపీలో 2 శాతం పెరుగనున్నవ్యవసాయ వాటా


దేశ సంపద లో వ్యవసాయరంగం వాటా ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో దా దాపు 2 పర్సెంటేజీ పాయింట్లు పెరిగే అవకాశమున్నదని ఈవై ఇండియా చీఫ్‌ పాలసీ అడ్వైజర్‌ డీకే శ్రీవాస్తవ తెలిపారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయరంగం వాటా దాదాపు 15 శాతంగా ఉన్నది. ‘మునుపటి కంటే ఈసారి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. కనుక కొన్ని బహుళజాతి సంస్థలు వేస్తున్న ప్రతికూల అంచనాలను చూసి మనం భయపడాల్సిన అవసరంలేదు’ అని ఆయన స్పష్టం చేశారు.


logo