సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 01:38:34

అత్యంత సేఫ్‌ జోన్‌లో తెలంగాణ

అత్యంత సేఫ్‌ జోన్‌లో తెలంగాణ
  • హోంమంత్రి మహమూద్‌ అలీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా పటిష్ఠమైన పోలీసు వ్యవస్థ, నేరాల నియంత్రణ, మహిళలకు భద్రత ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చిందని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యంత సేఫ్‌ రాష్ర్టాల్లో మనం ముందున్నామన్నారు. షీటీమ్స్‌ ఏర్పాటు ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.


రైతన్నకు భరోసా

  • మంత్రి నిరంజన్‌రెడ్డి


రైతు సంక్షేమానికి అధిక ప్రాధా న్యం ఇస్తున్నామని, జాతీయ సగటును మించి తెలంగాణలో నిధులు కేటాయిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. వ్యవసాయంలో దేశంలోని ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడేస్థితిలో లేదని చెప్పారు.  పండిన పంటలను రైతుకు మద్దతు ధర అందించి కొనుగోలు చేస్తున్నామని, అన్నదాతకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. 


భూరికార్డుల ఆన్‌లైన్‌

  • మంత్రి వేముల 


రాష్ట్రంలో 4.91 లక్షల ఎకరాల విస్తీర్ణం గల సాదాబైనామాల లావాదేవీలను క్రమబద్ధీకరించామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. భూమి రికార్డులను ఆన్‌లైన్‌లో పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల భూముల రికార్డుల ప్రక్షాళన జరిగిందన్నారు. 33 జిల్లాల్లో కలెక్టర్లు, ఆర్డీవోలు, తాసిల్దార్లు తదితరులు మొత్తం 35 వేలమంది పనిచేస్తున్నారని వివరించారు. 


రవాణా ఆదాయం 3,320 కోట్లు 

  • మంత్రి పువ్వాడ 


2019-20 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరినాటికి రవాణాశాఖకు రూ.3,320 కోట్ల ఆదాయం లభించిందని ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. తొలుత ఏటా పన్నెండు శాతం వృద్ధి చెందిన ఈ శాఖ ఆధునిక సంస్కరణల కారణంగా తాజాగా 18 శాతం మేర ఆదాయాన్ని ఆర్జించిందని పేర్కొన్నారు. 


 దేశ వాటర్‌ బ్యాంక్‌గా తెలంగాణ

  • విప్‌ బాల్క సుమన్‌


‘వాటర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని స్వయంగా వాటర్‌మాన్‌ ఆఫ్‌ ఇండియా అభివర్ణించారని ప్రభు త్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. తెలంగాణ రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. సన్న, చిన్నకారు రైతులకు సముచిత రీతిలో ప్రోత్సహించాలని కోరారు. రెండు లక్షల మంది రైతులు డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేశారు.


logo