శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 02:04:03

త్వరలో 20 వేల పోలీసుల భర్తీ

త్వరలో 20 వేల పోలీసుల భర్తీ

  • ఎస్సైల పాసింగ్‌ఔట్‌ పరేడ్‌లో హోంమంత్రి మహమూద్‌అలీ 
  • విధుల్లోకి 1,162 మంది ఎస్సైలు
  • భారీ వర్షాల్లోనూ పోలీసుల సేవలు అమోఘమని మంత్రి అభినందనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పెద్దఎత్తున పోలీసు ఉద్యోగాలు భర్తీకానున్నాయి. త్వరలోనే పోలీస్‌శాఖలో వివిధ ర్యాంకుల్లో కలిపి 20 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని హోంమంత్రి మహమూద్‌అలీ వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా 18,428 మంది ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్‌ అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో 12వ బ్యాచ్‌ ఎస్సైల పాసింగ్‌ఔట్‌ పరేడ్‌ నిర్వహించారు. మొత్తం 1,162 మంది ఎస్సైలు శిక్షణ పూర్తిచేసుకోగా, అందులో 256 మంది మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహమూద్‌అలీ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్నదని, దాన్ని మరింత పెంచేలా యువ పోలీస్‌ అధికారులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కరోనా విజృంభిస్తున్న వేళ, భారీ వర్షాల్లోనూ పోలీసులు అందించిన సేవలు అమోఘమని ప్రశంసించారు. కల్తీ విత్తన ముఠాలపై పీడీయాక్టులు నమోదుచేస్తూ రైతులకు పోలీసులు అండగా ఉండటంపై సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో త్వరలో అందుబాటులోకి రానున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో నేరాలను మరింత బాగా నియంత్రిస్తామని భరోసా వ్యక్తంచేశారు. దేశంలోని మొత్తం సీసీటీవీ కెమెరాల్లో మన రాష్ట్రంలోనే 64 శాతం వరకు ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా వేళ తగిన జాగ్రత్తలతో సకాలంలో శిక్షణ పూర్తికి చర్యలు చేపట్టిన అకాడమీ డైరెక్టర్‌ వీవీ శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించారు.

స్మార్ట్‌ పోలీసింగ్‌పై దృష్టి: డీజీపీ 

యువ ఎస్సైలంతా సర్వీస్‌లో నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి పోలీస్‌శాఖకు, ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని డీజీపీ  మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. నేరరహిత సమాజ స్థాపన కోసం చిత్తశుద్ధితో కృషిచేయాలని కోరారు. విధి నిర్వహణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించడం ద్వారా స్మార్ట్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. శిక్షణలోభాగంగా ఇండోర్‌, అవుట్‌డోర్‌ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభచాటిన ఎస్సైలకు మంత్రి మహమూద్‌అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి ట్రోఫీలను బహూకరించారు. కార్యక్రమంలో అకాడమీ ఇంచార్జి డైరెక్టర్‌ కే శ్రీనివాస్‌రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ కే రమేశ్‌నాయుడు, డిప్యూటీ డైరెక్టర్‌ (అడ్మిన్‌) నవీన్‌కుమార్‌, ఎస్పీ జానకకీశర్మిల తదితరులు పాల్గొన్నారు.