గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Feb 23, 2020 , 02:34:11

అబద్ధాల ఈనాడు

అబద్ధాల ఈనాడు
  • ఆధారాలుంటే చూపండి.. లేదంటే రూ.వెయ్యికోట్లకు పరువునష్టం దావావేస్తాం
  • దేశంలోనే తెలంగాణ పోలీస్‌ నంబర్‌వన్‌.. ప్రతిష్ఠ దిగజార్చేందుకే కుట్రపూరిత కథనం
  • ఈనాడు ‘దొంగలతో దోస్తీ’ కథనంపై హోంమంత్రి మహమూద్‌అలీ సీరియస్‌
  • న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలి: ఈనాడుకు డీజీపీ హెచ్చరిక
  • కథనంపై పోలీసు అధికారుల సీరియస్‌
  • తీవ్రంగా ఖండించిన కమిషనర్లు, పోలీసు అధికారుల సంఘం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా అభివృద్ధిలో అన్ని రాష్ర్టాలకంటే అగ్రపథంలో దూసుకుపోతున్న తెలంగాణను బద్నాం చేయడానికి ఈనాడు దినపత్రిక కుట్రచేసిందని, నిరాధారంగా.. నిస్సిగ్గుగా అబద్ధపు వార్తలను ప్రధానంగా వండివారుస్తూ.. రాష్ట్ర పోలీసుశాఖ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసే దుస్సాహసానికి దిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏదో ఒక అలజడి తేవాలని.. ప్రజల్లో అభద్రతాభావాన్ని సృష్టించాలన్న దుర్బుద్ధితో కట్టుకథలను అల్లిందని పలువురు పోలీసు అధికారులు మండిపడ్డారు. 


‘దొంగలతో దోస్తీ’ అంటూ శనివారం తప్పుడు వార్తరాసి జాతీయస్థాయిలో ఎంతో కీర్తి గడించిన తెలంగాణ పోలీసుల ప్రతిష్ఠను మసకబార్చే యత్నంచేసిందని ఆగ్రహించారు. గత ఆరేండ్లలో మన రాష్ట్ర పోలీస్‌శాఖ పనితీరు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో శాంతిభద్రతల పరిరక్షణకు చేస్తున్న కృషి, మహిళల భద్రతకోసం తీసుకొంటున్న చర్యలను చూసి ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, అధికారులు, కేంద్రమంత్రులు వేనోళ్ల కొనియాడుతుంటే.. మన పోలీసుల స్థాయిని తగ్గించడానికి కుయుక్తి పన్ని రాసిన సదరు వార్తపై హోంమంత్రి మహమూద్‌ అలీ తీవ్రంగా మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు రాసిన ఈనాడు.. క్షమాపణలు చెప్పకుంటే వెయ్యికోట్ల రూపాయలకు పరువునష్టం దావావేస్తామని హోంమంత్రి హెచ్చరించారు. 


రాష్ట్రంలో పోలీసుల బదిలీలు, పోస్టింగుల్లో రాజకీయ జోక్యం ఉండదని తెలిపారు. దొంగలతో పోలీసులు కలిసిపోయారంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన ‘దొంగలతో దోస్తీ’ కథనం పూర్తిగా అవాస్తవమని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసుల ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఈనాడు కుట్రపూరితంగా కథనం రాసిందని ఆగ్రహించారు. శనివారం ఆయన లక్డీకాపూల్‌లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ జోక్యంతో పోస్టింగులు ఇస్తున్నారంటూ ఆధారాలు లేకుండా ఎలా రాస్తారని మండిపడ్డారు. ‘ఎవరు డబ్బు లు వసూలు చేస్తున్నారు.. ఎట్లా చేస్తున్నారు? అన్న దేనికీ ఆధారాలు లేవు. నేను ఈనాడు ఎడిటర్‌, చీఫ్‌ ఎడిటర్‌కు ఒక్కటే డిమాండ్‌చేస్తున్నా.. 


ఈ ఆరోపణలను మీరు నిరూపించండి. లేదంటే క్షమాపణ చెప్పండి’ అని డిమాండ్‌చేశారు. లేకుంటే రూ.వెయ్యి కోట్లకు పరువునష్టం దావావేస్తామని హెచ్చరించారు. పోలీస్‌శాఖ ఎంతో బాధ్యతాయుతమైనదని, ప్రజల్లో ఎంతో భరోసా ఉన్న పోలీసుశాఖపై నిరాధార కథనాలు రాయడం సరికాదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా కర్ఫ్యూ విధించలేదని పేర్కొన్నారు. చరిత్రలో ఏనాడూ లేనంత ప్రశాంతంగా తెలంగాణ ఉందన్నారు. పోలీస్‌శాఖకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్నారు. పోలీసు విధుల్లో ఎక్కడా రాజకీయ జోక్యం లేదని స్పష్టంచేశారు. వాస్త వం ఇలా ఉంటే ప్రభుత్వాన్ని, పోలీస్‌శాఖను అప్రతిష్ఠపాలు చేయడానికి ఈనాడు చేస్తున్న కుట్రలో భాగమే ఈ వార్తాకథనమని పేర్కొన్నారు. మీడియాలో వచ్చే కథనాలకు సామాన్యుల్లో విశ్వసనీయత ఉంటుందని, ఇలాంటి కథనాలను ఆధారాలులేకుండా రాయడం సరికాదన్నారు. రాష్ట్రంలో పోలీస్‌శాఖ అత్యుత్తమంగా పనిచేస్తున్నదని, 24 గంటలపాటు గస్తీ ముమ్మరం చేశామని చెప్పారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయంటే తెలంగాణ పోలీసులు ఎంత సమర్థంగా పనిచేస్తున్నారో అర్థమవుతుందని మహమూద్‌ అలీ అన్నారు.


ప్రతి బదిలీలో ఎంతో కసరత్తు.. 

ఒక ఎస్సైని బదిలీ చేయాలంటే డీఐజీతోపాటు ఆ జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ కలిసి నిర్ణయం తీసుకొంటారని.. సీఐని బదిలీ చేయాలంటే సంబంధిత జోన్‌ ఐజీ, ఆ రేంజ్‌కు చెందిన డీఐజీ, సంబంధిత జిల్లా ఎస్పీ, ఇంటెలిజెన్స్‌ ఎస్పీ కలిసి చర్చించి.. పనితీరు ఆధారంగా చేస్తారని హోంమంత్రి మహమూద్‌ అలీ వివరించారు. డీఎస్పీని బదిలీచేయాలంటే స్వయంగా డీజీపీతోపాటు శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ, అడిషనల్‌ డీజీ సీఐడీ, ఇంటెలిజెన్స్‌ ఐజీ సమిష్టిగా నిర్ణయం తీసుకొంటారని చెప్పారు. పూర్తిస్థాయి అధికారి పనితీరు, సమర్థత, గతంలో రికార్డు.. అన్నీ పరిగణనలోకి తీసుకొన్నాకే పోస్టింగ్‌ ఇస్తారని తెలిపారు. ఇంత కసరత్తు జరుగుతుంది కాబట్టే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. సివిల్‌ తగాదాల్లో ఎక్కడా పోలీసులు జోక్యం చేసుకోవడంలేదని, ఎక్కడైనా దాడులు జరిగి గాయాలైన ఘటనలు ఉంటే కేసులు నమోదుచేస్తున్నారని వివరించారు.


సత్యదూరం: పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి

ఈనాడు పత్రికలో వచ్చిన ‘దొంగలతో దోస్తీ’ కథనం పూర్తిగా సత్యదూరమని, ఈ కథనాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అధికారుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆ సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి అన్నారు. పోలీస్‌ అధికారుల సంఘం సైబరాబాద్‌ అధ్యక్షుడు భద్రారెడ్డి, వెల్ఫేర్‌ లైజన్‌ ఆఫీసర్‌ కే శ్రీనివాస్‌రెడ్డితో కలిసి లక్డీకాపూల్‌లోని రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీస్‌ అధికారుల నియామకాలను పూర్తిగా నిబంధనలు, పనితీరు, ఇతర ఇండికేటర్ల ఆధారంగానే చేపడుతారన్నారు. 


ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు: హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌

ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నాణ్యమైన సేవలందించడంపై దృష్టిసారించి ప్రజల భద్రతకోసం రేయింబవళ్లు పనిచేస్తున్నామని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అన్నారు.


తీవ్రంగా ఖండిస్తున్నాం: రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌

ఈనాడులో వచ్చిన కథనంలో ఏమాత్రం వాస్తవం లేదని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ చెప్పారు. తాము ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటున్నామని, వారికి పూర్తి భద్రతాపరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.


పోలీసులపై బురద జల్లితే ప్రజలకు నష్టం: సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ 

రాష్ట్రంలో ఎలాంటి సంచాలనాత్మకమైన కేసునైనా 24 నుంచి 48 గంటల్లో ఛేదిస్తున్నామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. పోలీసులపై బురద జల్లి ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే అది రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. షీ టీమ్స్‌తో మహిళలకు భద్రత పెరిగిందని వివరించారు. నగరంలో నెలకొన్న భద్రతతోనే దేశవిదేశాల నుంచి వందల కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు.


నిరూపించకపోతే చర్యలు 

  • ఈనాడు కథనాన్ని ఖండించిన డీజీపీ మహేందర్‌రెడ్డి


పోలీస్‌శాఖ ప్రతిష్ఠను తగ్గించేలా ఈనాడులో ప్రచురితమైన కథనం పూర్తిగా అసత్యమని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కథనంలోని అరోపణలు నిరూపించకుంటే క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. డీజీపీ శనివారం ఓ ప్రకటన విడుదలచేశారు. ఈనాడులో వచ్చిన కథనం తెలంగాణ పోలీస్‌శాఖ సిబ్బందితోపాటు వారి కుటుంబసభ్యులను, బంధువులను, సన్నిహితులను ఎంతో బాధించిందని తెలిపారు. శాంతిభద్రతల రక్షణకోసం రోజుకు 16 గంటలపాటు పనిచేస్తూ, పండుగలు, సెలవులు అన్నీ వదులుకొని వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతూ, కుటుంబాన్ని, పిల్లలను పట్టించుకోకుండా పోలీస్‌ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. 


పదోన్నతులు, పోస్టింగ్‌ల విషయంలోనూ పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. విధినిర్వహణలో తప్పుచేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటున్నామని, ఒకరిద్దరు అధికారులు తప్పుచేస్తే.. మొత్తం పోలీస్‌శాఖకు దాన్ని ఆపాదించడం సరికాదని హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్‌శాఖలో మరింత పారదర్శకత పెంచేలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు 24 గంటలపాటు విధి నిర్వహణలో ఉంటున్న పోలీస్‌శాఖకు ఈనాడులో వచ్చిన కథనం మచ్చగా మారిందని ఆవేదన చెందారు.


ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయొద్దు


దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ పోలీసుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ జితేందర్‌ హెచ్చరించారు. ఈనాడు దినపత్రికలో ‘దొంగలతో దోస్తీ’ పేరిట పోలీస్‌శాఖ ప్రతిష్ఠను తగ్గించేలా ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఈ వార్తతో పోలీస్‌శాఖలోని దాదాపు లక్ష మంది అధికారులు, సిబ్బంది ఆత్మైస్థెర్యం దెబ్బతినడంతోపాటు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించేలా ఉన్నదన్నారు. నిరాధారంగా పోలీస్‌శాఖలోని అధికారులు, సిబ్బందిని కించపర్చేలా ‘ఈనాడు’ ప్రచురించిన కథనంపై చట్టపరంగా చర్యలు తీసుకొంటామని చెప్పారు. 


శనివారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐజీ ప్రమోద్‌కుమార్‌, డీఐజీ శివశంకర్‌రెడ్డితో కలిసి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఏ చిన్న ఘటనకు తావులేకుండా 24 గంటలపాటు శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీస్‌శాఖ పనిచేస్తున్నదని తెలిపారు. వరుస ఎన్నికల బందోబస్తులు, ప్రపంచస్థాయి ఈవెంట్ల సమయంలో కూడా సమర్థంగా వ్యవహరించామని చెప్పారు. టెక్నాలజీ వినియోగంతో.. కేసుల ఛేదనలోనూ తెలంగాణ పోలీసులు బెస్ట్‌ అని నిరూపించుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణకు వచ్చే కేంద్ర, ఇతర రాష్ర్టాల మంత్రులు, నాయకులు సైతం మన పోలీసింగ్‌ను ప్రశంసించారన్నారు. 


రాష్ట్ర పోలీస్‌శాఖ అత్యంత పారదర్శకంగా పనిచేస్తున్నదని, పోలీస్‌ అధికారుల నియామకాలను పూర్తిగా నిబంధనలను అనుసరించి, పనితీరు, ఇతర ఇండికేటర్ల ఆధారంగానే చేపడుతున్నట్టు స్పష్టంచేశారు. విధి నిర్వహణలో విఫలమైన పోలీసులపై ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నామని వివరించారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పోలీసింగ్‌లో ఎన్నో విప్లవాత్మక, వినూత్న, పారదర్శక కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజలకు మరింత చేరువైన ఘనత తెలంగాణ పోలీసులదేనని అన్నారు. ఈ తప్పుడు వార్త మొత్తం పోలీస్‌ వ్యవస్థకే మచ్చతెచ్చేలా ఉన్నదన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందన్నారు. ఆయా జిల్లాల్లో పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు ‘ఈనాడు’ కథనాన్ని ఖండించారు.


logo
>>>>>>