ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 12:00:29

అన్నింటికీ ఇల్లే పదిలం.. కరోనాను జయిద్దాం!

అన్నింటికీ ఇల్లే పదిలం.. కరోనాను జయిద్దాం!

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. కొంతమందిలో కరోనా లక్షణాలు బయటికి కన్పిస్తుండటంతో, వారిని గుర్తించి దవాఖానలకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే చాలా మందిలో ఈ లక్షణాలు ఏవీ కన్పించడం లేదు. వైరస్‌ అనేక విధాలుగా రూపాంతరం చెందుతున్నది. దీంతో కరోనా పాజిటివ్‌ వచ్చినా, ఆ లక్షణాలు లేనివారికి ప్రత్యేకంగా చికిత్స అవసరం లేదని నిపుణులు అంటున్నారు. అలాంటివారు హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని, ప్రత్యేక ఆహారం తీసుకోవడం, కొన్ని నియమాలు పాటిస్తే కరోనా నుంచి కోలుకోవచ్చని పేర్కొంటున్నారు. గుండె సంబంధిత, డయాలసిస్‌, టీబీ, హెచ్‌ఐవీ, బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి మాత్రమే దవాఖానల్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు లేనివారికి వారి ఇంటివద్దే చికిత్స అందిస్తున్నారు.

ఇవి తీసుకోండి..

హోం ఐసొలేషన్‌లో ఉన్న రోగులకు డాక్టర్లు ఇచ్చే మందులతో పాటు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా సిట్రిక్‌ పదార్థాలు అంటే సీ-విటమిన్‌ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బత్తాయి, నారింజ, జామ, తదితర తాజా పండ్లతో పాటు తాజా కూరగాయలను తీసుకోవాలని, ప్రతిరోజూ కోడిగుడ్డు, పాలు, వీలైతే బాగా కడిగిన మాంసాహారం కూడా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. బాదాం, పిస్తా, కాజూ, కిస్‌మిస్‌ తదితర డ్రై ఫ్రూట్స్‌ తీసుకుంటే ఇంకా మంచిదంటున్నారు. అన్నం, రొట్టె వంటివి వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలని, జంక్‌ ఫుడ్‌కు పూర్తి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.


పాటించాల్సిన నియమాలు

హోం ఐసొలేషన్‌లో ఉండేవారు పూర్తి పరిశుభ్రమైన ప్రత్యేక గదిలో ఉండాలి. ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి క్రిమి సంహారక రసాయనాలతో ఇంటిని శుభ్రపరచాలి. కుటుంబ సభ్యులతో భౌతిక దూరం పాటించాలి. ముఖానికి మాస్కు ధరించడం మరిచిపోవద్దు. ఏదైనా వస్తువును తాకే ముందు, తాకిన తరువాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి లేదా శానిటైజ్‌ చేసుకోవాలి.


logo