శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 07:06:21

క‌రోనా ఎఫెక్ట్... కాలేజీల్లో సెలవులకు కోత?

క‌రోనా ఎఫెక్ట్... కాలేజీల్లో సెలవులకు కోత?

హైదరాబాద్ : సెలవులకు కోత పెట్టే దిశగా ఇంటర్‌ బోర్డు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరం కరోనా వల్ల ఆగిపోవటంతో సెలవులను తగ్గించాలని చూస్తున్నట్టు తెలిసింది. దసరా, క్రిస్మస్‌, సంక్రాంతి సెలవులు తగ్గించడంతో పాటు రెండో శనివారానికి సంబంధించిన సెలువులనూ తగ్గించాలని చూస్తున్నది. దీనికి సంబంధించి త్వరలోనే విద్యాక్యాలెండర్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. కాగా, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. టెన్త్‌ రెగ్యులర్‌ విద్యార్థులే కాకుండా, గతంలో ఫెయిలైన విద్యార్థులు కూడా ఈసారి ఉత్తీర్ణులయ్యారు. దీంతో వాళ్లంతా ఇంటర్‌లో చేరే అవకాశం ఉన్నది. 

మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తీసుకువస్తుండటంతో నిరుపేద విద్యార్థులు కాలేజీ బాట పడతారని అంచనా వేస్తున్నారు. నాలుగేండ్ల క్రితం ప్రవేశాల సంఖ్య 1.50 లక్షలు ఉండగా, గత ఏడాది నాటికి 2 లక్షలకు చేరుకున్నాయి. తాజా నిర్ణయాలతో కొత్తగా మరో లక్ష అడ్మిషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు.. విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన వాటికి మరమ్మతులు చేపట్టారు.


logo