శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 01:16:35

హమ్మయ్య.. వానలు పోతున్నై!

 హమ్మయ్య.. వానలు పోతున్నై!

  • రాత్రిళ్లు చలిగాలులు పెరిగే అవకాశం
  • నాలుగురోజుల్లో ‘నైరుతి’ నిష్క్రమణ ప్రారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హమ్మయ్యా.. వానలు వెళ్లిపోతున్నా యి. వానకాలం ముగిసినా వరదలతో ముంచిన వర్షాలు ఇక లేకపోవచ్చు. రాష్ట్రంలో శని, ఆదివారాలు పొడి వాతావరణమే ఉంటుందని, వర్ష సూచనలు లేవని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ నాలుగు రోజుల్లో మొదలయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. ఒడిశా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి రెండ్రోజుల్లో రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కావొచ్చని పేర్కొన్నది. జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ర్టాల్లో నైరుతి నైరుతి నిష్క్రమణ కొనసాగుతున్నదని తెలిపింది. వాస్తవానికి అక్టోబర్‌ మొదటి వారంనుంచే నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కొనసాగాలి. కానీ, బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, ఉపరితల ద్రోణులు, షీర్‌జోన్ల కారణంగా గత 15 రోజులు రుతుపవనాలు చురుకుగానే ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడంతో ప్రస్తుతం రుతుపవనాల నిష్క్రమణకు అనుకూలత ఏర్పడిందని చెప్పారు. కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో క్రమంగా తగ్గుదల నమోదయ్యే అవకాశాలున్నాయని, రాత్రి వేళల్లో చలిగాలులు పెరుగొచ్చని పేర్కొన్నారు.