శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:38:12

‘వంద’ వదలాల్సిందే

‘వంద’ వదలాల్సిందే

  • 100 అడుగుల అప్రోచ్‌రోడ్డు తప్పనిసరి
  • లేదంటే అదనపు రుసుము చెల్లించాలి
  • ప్రణాళికాబద్ధ అభివృద్ధివైపు హెచ్‌ఎండీఏ 
  • జీవో 106 విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హెచ్‌ఎండీఏ పరిధిలో లే-అవుట్లు ఆమోదం పొందాలంటే ఇక నుంచి వంద ఫీట్ల అప్రోచ్‌ రోడ్డు వదలాల్సిందే. లేదంటే వాటికి అనుమతులు దక్కవు. ఇప్పటికే లే-అవుట్‌ అయి ఉండి వంద ఫీట్లకు తక్కువ రోడ్డు వదిలి ఉంటే.. ఆ మేరకు అదనపు చార్జీలు చెల్లించాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జీవో 106ను విడుదల చేసింది. నగరం విస్తరిస్తుండటం, ట్రాఫిక్‌ పెరుగుతుండటంతో అప్రోచ్‌రోడ్డు కనీసం వంద అడుగులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇబ్బడి ముబ్బడి లే-అవుట్లకు స్వస్తిపలుకుతున్నది. హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రస్తుతం ఓపెన్‌ ప్లాట్ల లే-అవుట్లకు 30 అడుగుల వరకు, గేటెడ్‌ కమ్యూనిటీ లే-అవుట్‌కు 40 అడుగుల వరకు అప్రోచ్‌రోడ్డు ఉండాలనే నిబంధన ఉండేది. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో వాటిని సవరించింది. దరఖాస్తు చేసుకొని అనుమతుల కోసం వేచిచూస్తున్న లే-అవుట్లన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. రోడ్డు.. వంద అడుగులకు తగ్గినప్పుడు.. అందుకు సరిపడా స్థలాన్ని చూపించాల్సి ఉంటుంది. అప్పుడే లే అవుట్‌కు అనుమతి ఇస్తారు. రోడ్డు అభివృద్ధి కోసం అదనపు చార్జీని కూడా వారే చెల్లించాలి. అయితే గతంలో డ్రాఫ్ట్‌ లే-అవుట్‌ తీసుకొని తుది ఆమోదం కోసం ఎదురుచూస్తున్న రియల్టర్లకు ఈ జీవో నుంచి ఉపశమనం లభించనుంది. 

మరిన్ని షరతులు 

వంద కన్నా ఎక్కువ ఫ్లాట్లతో 18 మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఉండే అపార్టుమెంట్లు మాత్రం 50 శాతం ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ చార్జీలు చెల్లించాలి. ఇప్పటికే డ్రాఫ్ట్‌ లే అవుట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వాటికి, కొత్త దరఖాస్తులకు, లే అవుట్‌ విత్‌ హౌజింగ్‌ (ఓపెన్‌, గేటెడ్‌)కు ఈ నిబంధన వర్తించనుంది. ఈ రోడ్డు ఇంపాక్ట్‌ ఫీజులను స్పెషల్‌ ఎస్క్రో అకౌంట్‌ కింద ఉంచి సంబంధిత లే-అవుట్ల రోడ్ల అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ ఉపయోగించనుంది.

అదనపు చార్జీలు ఇలా..      


ప్రస్తుత రోడ్డు వెడల్పు (అడుగుల్లో) 

అదనంగా చెల్లించాల్సిన నగదు


80 -100 లోపు
50% డెవలప్‌మెంట్‌  ఛార్జీ
60 -80 లోపు
66% డెవలప్‌మెంట్‌ ఛార్జీ
30 -60లోపు
100% డెవలప్‌మెంట్‌ ఛార్జీ

logo