మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 03:02:57

హిందీ ప్రాంతీయ కార్యాలయం రేపు ప్రారంభం

హిందీ ప్రాంతీయ కార్యాలయం రేపు ప్రారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వ చొరవతో దశాబ్దాలనాటి కల నెరవేరింది. సెంట్రల్‌ హిందీ ఇన్‌స్టిట్యూట్‌ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయానికి సొంతభవనం అందుబాటులోకి వచ్చింది. దక్షిణ భారత రాష్ర్టాల్లో హిందీని ప్రోత్సహించేందుకు, వ్యాప్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1960లో సెంట్రల్‌ హిందీ ఇన్‌స్టిట్యూట్‌ను స్వయం ప్రతిపత్తిగల సంస్థగా అగ్రాలో ఏర్పాటుచేసింది. ఆ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో 1976లో ఏర్పాటుచేశారు. అయితే ఈ కార్యాలయం ఇంతవరకు అద్దెభవనంలోనే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని సెంట్రల్‌ హిందీ ఇన్‌స్టిట్యూట్‌కు సొంత భవనాన్ని ఏర్పాటుచేసేందుకు వెయ్యిగజాల స్థలాన్ని కేటాయించింది. రూ.6.55కోట్లతో నాలుగంతస్తుల్లో కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం పనులన్నీ పూర్తికావడంతో భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ముస్తాబు చేశారు.  

రేపు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి..

సెంట్రల్‌ హిందీ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాంతీయ కార్యాలయ భవనాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌పొఖ్రియల్‌, హిందీ టీచింగ్‌ బోర్డు చైర్మన్‌ నిశాంక్‌ సోమవారం ప్రారంభించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. 


logo