ఖరారుచేసిన తెలంగాణ విద్వత్సభ
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రాబోయే శుభకృత్ నామ సంవత్సరంలో పండుగల తేదీలను తెలంగాణ విద్వత్సభ ఖరారు చేసింది. ఈ జాబితాను సోమవారం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణాచారితోపాటు దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌కు సమర్పించింది. నివేదికలో ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు వచ్చే పండుగల వివరాలను పేర్కొన్నారు. విద్వత్సభ ఉపాధ్యక్షుడు సంపత్‌కుమార్ కృష్ణమాచార్య, ప్రధాన కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, కోశాధికారి మరుమాముల వెంకటరమణశర్మ, ప్రతినిధులు కమలాకరశర్మ, విరాట్ స్వరూప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే 2022 ఏప్రిల్ రెండున ఉగాది, మే మూడున పరశురామ జయంతి, అక్షయ తృతీయ, ఐదు న రామానుజాచార్య జయంతి, ఆరున శ్రీ ఆదిశంకరాచార్య జయంతి, 16న అన్నమాచార్య జయంతి, 25న హనుమజ్జయంతి, జూన్ 8న మృగశిర కార్తె, జూలై ఒకటిన పూరీ జగన్నాథస్వామి రథయాత్ర, ఆగస్టు ఒకటిన నాగులచవితి, ఐదున వరలక్ష్మీవ్రతం, 19న శ్రీకృష్ణాష్టమి, 31న వినాయక చతుర్థి, సెప్టెంబర్ 26న శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవారంభం, అక్టోబర్ మూడున దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ, ఐదున విజయదశమి, తొమ్మిదిన వాల్మీకి జయంతి, 23న ధనత్రయోదశి, 24న దీపావళి, 29న నాగులచవితి, నవంబర్ ఆరున వైకుంఠ చతుర్దశి, ఎనిమిదిన కార్తీకపూర్ణిమ, గురునానక్ జయంతి, డిసెంబర్ ఏడున దత్తాత్రేయస్వామి జయంతి, 2023 జనవరి రెండున ముక్కోటి ఏకాదశి, 14న భోగిపండుగ, 15న సంక్రాంతి, 16న కనుమ, 28న రథసప్తమి, ఫిబ్రవరి 18న మహాశివరాత్రి, మార్చి 6న కామదహనం, ఏడున హోళీ పండుగ ఉంటాయని వివరించారు.