శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 01:49:31

హైదరాబాద్‌కు హైస్పీడ్‌ రైలు!

హైదరాబాద్‌కు హైస్పీడ్‌ రైలు!

  • సౌత్‌ఇండియాలో సెంటర్‌ పాయింట్‌గా భాగ్యనగరం
  • ఇక్కడినుంచే చెన్నె, బెంగళూరుకు అనుసంధానం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దక్షిణ భారతదేశంలో హైదరాబాద్‌ సెంటర్‌ పాయింట్‌గా హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌కు రూపకల్పన జరుగుతున్నది. ముంబై నుంచి హైదరాబాద్‌ మీదుగా ఈ హైస్పీడ్‌ కారిడార్‌ బెంగళూరు, చెన్నై నగరాలకు విస్తరించనున్నది. రైల్వేశాఖ భవిష్యత్‌లో చేపట్టబోయే హైస్పీడ్‌ రైల్వే ప్రాజెక్టులో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చేర్చి డీపీఆర్లు సైతం రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దేశంలో ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్టు రైల్వేబోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ ఇటీవల ప్రకటించారు. ఈ కారిడార్లకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారుచేసే మార్గాల్లో ముంబై- ఫుణె- హైదరాబాద్‌ మార్గం ఉన్నట్టు పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటి హైస్పీడ్‌ రైలు మార్గానికి సంబంధించిన పనులు ముంబై-అహ్మదాబాద్‌ మధ్య ఇప్పటికే మొదలయ్యాయి. రెండోదశలో ముంబై- హైదరాబాద్‌ కారిడార్‌ను ప్రతిపాదిస్తున్నారు. హైదరాబాద్‌ పాయింట్‌గా దీనిని బెంగళూరు, చెన్నైకు విస్తరించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ  ఈ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తున్నది.

వేగంగా అభివృద్ధి

హైదరాబాద్‌ ఐటీ, ఫార్మా, బయో టెక్నాలజీ, వ్యవసాయం, టెక్స్‌టైల్స్‌ తదితర రంగాల్లో ఇతర మెట్రో నగరాలను మించిపోతున్నది. ఉత్తర, దక్షిణ భారత్‌తోపాటు, తూ ర్పు, పడమర ప్రాంతాలను కలుపుతూ హైదరాబాద్‌ మీదుగా జాతీయరహదారులు ఉన్నాయి. ముంబై నుంచి హైదరాబాద్‌ మీదుగా తూర్పున ఉన్న విజయవాడ, విశాఖపట్నం, చైన్నె నగరాలతో అనుసంధానం ఉన్నది. భారతీయ రైల్వే హైస్పీడ్‌ రైలును ముంబై నుంచి హైదరాబాద్‌ వరకు అక్కడి నుంచి మిగతా మెట్రో నగరాలకు విస్తరించనున్నది.

హైవేల వెంట పరుగు

గంటకు 320 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్ర యాణించేలా హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ప్రాజెక్టు చేపట్టాలం టే ప్రస్తుత ట్రాక్‌లు సరిపో వు. ప్రత్యేక ట్రాక్‌ ఏర్పాటు ఎంతో వ్యయం. హైవేల వెం ట పిల్లర్ల మీదే హైస్పీడ్‌ రైలు ప్రయాణం మేలని నిఫుణుల అభిప్రాయం. హైవే మధ్య నుంచి లేదా ఒక పక్క నుంచి పిల్లర్లు నిర్మించే ఆలోచన కూ డా రైల్వేశాఖ చేస్తున్నది. ఈ ప్రతిపాదనలకే ఆమోదం తెలిపితే.. అన్ని దిక్కులను అనుసంధానిస్తూ హైవేలను అనుసంధానం చేస్తున్న హైదరాబాద్‌  కీలకం కానున్నది.