ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:50:31

హైదరాబాద్‌- విజయవాడ మధ్య హైస్పీడ్‌రైలు

హైదరాబాద్‌- విజయవాడ మధ్య హైస్పీడ్‌రైలు

  • ఈ రైలుతో జాతీయ రహదారి వెంట వేగంగా అభివృద్ధి
  • త్వరలోనే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభం
  • రాష్ట్రవ్యాప్తంగా మల విసర్జిత శుద్ధి కేంద్రాల ఏర్పాటు
  • 85 శాతం హరితహారం మొక్కలను బతికించుకోవాలి
  • ఎన్ని ఇబ్బందులొచ్చినా సంక్షేమం ఆగదు
  • నల్లగొండ జిల్లా పర్యటనలో మంత్రి కే తారకరామారావు

దేశంలో హైదరాబాద్‌ ముఖ్యమైన మెట్రోపాలిటన్‌ సిటీ. విజయవాడ కీలకమైన ఆర్థిక కేంద్రం. ఈ రెండు నగరాలను అనుసంధానిస్తూ హైస్పీడ్‌ రైలు రావాలి. ఇందుకోసం నావంతు ప్రయత్నం చేస్తాను.

- మంత్రి కేటీఆర్‌

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  హైదరాబాద్‌-విజయవాడ మధ్య హైస్పీడ్‌ లేదంటే బుల్లెట్‌ రైల్వే లైన్‌ కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. దేశంలోనే హైదరాబాద్‌ ఓ ముఖ్యమైన మెట్రోపాలిటన్‌ నగరమని, విజయవాడ ముఖ్యమైన ఆర్థిక కేంద్రమని తెలిపారు. ఈ రెండు నగరాలను అనుసంధానం చేసేందుకు హైస్పీడ్‌ రైలు రావాలని ఆయన ఆకాంక్షించారు. రైలు వస్తే హైవే వెంబడి అభివృద్ధి జరుగుతుందని అభిలషించారు. రెండు తెలుగు రాష్ర్టాల మధ్య కృష్ణానదిపై నిర్మిస్తున్న మట్టపల్లి వారధిని త్వరలోనే పూర్తిచేస్తామని చెప్పారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో విద్యుత్‌శాఖమంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ సోమవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారంచుట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఉపఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదిశగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టేవారితోపాటు చెరువులు, కుంటలను ఆక్రమించేవారి తాటతీయాలని అధికారులకు సూచించారు. 

బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తాం.

 నకిరేకల్‌ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరి క బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. త్వరలోనే ప్రాజెక్టును పూర్తిచేసి సీఎం చేతులమీదుగా ప్రారంభిస్తామని  తెలిపారు. నల్లగొండ పట్టణంతోపాటు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకుంటానని ప్రకటించిన ప్రకారం ఇక్కడ ప్రతికార్యక్రమాన్ని పూర్తిచేసే బాధ్యత తీసుకున్నామని చెప్పారు.రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఒకే పార్లమెంట్‌ స్థానం పరిధిలో రెండు మెడికల్‌ కాలేజీ లు పొందిన ఘనత నల్లగొండకే దక్కిందన్నారు. దామరచర్లలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఇక మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారన్నారు. 

కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా నిధులు విడుదల చేయాలన్న గట్టి పట్టుదలతో కేసీఆర్‌ ఉన్నారని, ఆ ప్రకారం ఇప్పటివరకు రూ.1,800 కోట్ల నిధులను అభివృద్ధికోసం ఖర్చు చేశామని వెల్లడించారు. నల్లగొండలో నిర్మించిన మల విసర్జిత శుద్ధికేంద్రాలు ప్రతి నాగరిక పట్టణానికి అవసరమని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో వీటి నిర్మాణం వేగంగా జరుగుతున్నదన్నారు. హరితహారంలో నాటిన మొక్కల్లో 85శాతం బతికించుకోవాలని లేదంటే స్థానిక ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎవరు పనిచేయకపోయినా, ముందుగా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల నుంచే చర్యలు మొదలవుతాయని హెచ్చరించారు. నాలుగేండ్ల వరకు ఏ ఎన్నికలు లేవని, అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.  


‘కరోనా దెబ్బకు ప్రపంచమే కిందామీదా అవుతున్నది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఇంతటి సంక్షోభంలోనూ సీఎం కేసీఆర్‌ ఏ ఒక్క సంక్షేమ పథకం నిలిచిపోవద్దని స్పష్టంచేశారు. రైతుబంధు కోసం ఒక్కరోజే ఏడువేల కోట్ల రూపాయలను విడుదల చేశారు. రుణమాఫీ ద్వారా సన్న, చిన్నకారు రైతులైన ఆరు లక్షల మందికి రూ.25వేల చొప్పున రూ.1,200కోట్ల మాఫీ చేసి చూపించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతులకు, పేదలకు అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్‌దే’ 

సంక్షోభంలోనూ సంక్షేమం

‘కరోనా దెబ్బకు ప్రపంచమే కిందామీదా అవుతున్నది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఇంతటి సంక్షోభంలో నూ రైతులు, పేదలకు సంబంధించిన ఏ ఒక్క సంక్షేమ పథకం నిలిచిపోవద్దని  సీఎం కేసీఆర్‌ ఆదేశించారని స్పష్టంచేశారు. రైతుబంధు కోసం ఒక్కరోజులోనే ఏడువేల కోట్లను విడుదల చేశారు. 42 లక్షల మందికి సంబంధించి ఆసరా పెన్షన్‌దారులకు నెలకు రూ.రెండు, మూడు వేల చొప్పున ఇస్తూ వచ్చారు. రుణమాఫీ ద్వారా సన్న, చిన్నకారు రైతులైన ఆరు లక్షల మందికి రూ.25 వేల చొప్పున  1,200 కోట్ల రుణమాఫీ చేసి చూపించారు అని మంత్రి పేర్కొన్నారు. కరోనా ఇబ్బందులను తట్టుకుంటూ ప్రతి నెలా మొదటి వారంలో గ్రామ పంచాయతీలకు రూ.338కోట్లు, మున్సిపాలిటీలకు రూ.178 కోట్ల విడుదల చేస్తూ అభివృద్ధిలో చిత్తశుద్దికి నిదర్శనంగా సీఎం కేసీఆర్‌ నిలిచారని చెప్పారు.  

దెబ్బతిన్న నల్లగొండను నిలబెడుతున్నాం: మంత్రి జగదీశ్‌రెడ్డి

  నల్లగొండ జిల్లా అభివృద్ధిలో దారుణంగా దెబ్బతిన్నదని, తెలంగాణ వచ్చాక సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేశామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. నాడు ఫ్లోరైడ్‌ సమస్యతో జిల్లాను నాశనం చేశారన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, కాంగ్రెస్‌ నేత ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలి విప్‌ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, నల్లమోతు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్‌, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, గుజ్జ దీపిక,  తదితరులు పాల్గొన్నారు. 


logo