గురువారం 09 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:36:18

పరీక్షలు రాయాలా? వద్దా?

పరీక్షలు రాయాలా? వద్దా?

  • నిర్ణయాధికారం విద్యార్థులకుండాలి
  • సప్లిమెంటరీ రాసినా రెగ్యులర్‌ మెమో ఇస్తారా?
  • ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు పరీక్షలకు ఇదే సరైన సమయం
  • అడ్వకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ వాదనలు నేడు కూడా కొనసాగనున్న విచారణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వల్ల ఏర్పడిన ఈ పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదని, పరిస్థితులకు అనుగుణంగా మారడంతోపాటు నిబంధనలు కూడా అనుకూలంగా మార్చుకోవడంలో తప్పులేదని హైకోర్టు పేర్కొన్నది. పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పలు పిటిషన్లపై శుక్రవారం చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కొవిడ్‌ -19 వైరస్‌ సోకే ప్రమాదం ఉందని భావించే తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్షలకు వెళ్లనివ్వాలా? వద్దా? అని నిర్ణయించుకునే అవకాశం ఉండాలని అభిప్రాయపడింది. ఇప్పుడు కాకుండా సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలని నిర్ణయించుకునే విద్యార్థులకు నష్టం జరుగకుండా వారికి కూడా రెగ్యులర్‌ విద్యార్థుల తరహాలో మెమో ఇస్తారో? లేదో? చెప్పాలని విద్యాశాఖను ఆదేశించింది. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. 5 లక్షల మంది పరీక్షలు రాసినా ఒక్క విద్యార్థి ఆరోగ్యం విషయం లో కూడా రిస్కు తీసుకోలేమని హైకోర్టు అభిప్రాయపడింది. రెండురోజుల వ్యవధితో నెలపాటు ప రీక్షలు జరుగనున్నందున కేసులు పెరిగి కొత్త ప్రాం తాల్లో కంటైన్మెంట్‌ జోన్లు వస్తే తలెత్తే పరిస్థితిపై సమీక్ష చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది. 

ఇదే సరైన సమయం.. ఏజీ

టెన్త్‌ పరీక్షల నిర్వహణకు ఇదే సరైన సమయమని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనానికి వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లుచేశామని, పరీక్ష కేంద్రాలను దాదాపు రెట్టింపు చేశామన్నారు. విద్యాసంస్థల లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున విద్యార్థులు ఎవరూ లేరని, ఈ సమయంలో అయితేనే గుమిగూడే అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఇప్పుడు పరీక్షలు రాయకపోయినా ఏమీకాదని, వారికి సప్లిమెంటరీలో అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. దూరప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా ప్రైవేట్‌ స్కూళ్లలోని హాస్టళ్లకు అనుమతి మంజూరు చేస్తామని పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైనా మెమోలో రెగ్యులర్‌ అని నమోదు చేసే విషయమై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సంప్రదింపులు జరిపి నిర్ణయిస్తామని చెప్పారు. కంటైన్మెంట్‌ జోన్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, ఆయా జోన్లలోఉండే విద్యార్థుల రవాణాకు ఎటువంటి ఆటంకాలు ఉండబోవని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు నడుస్తున్నాయని తెలిపారు. పదో తరగతి పరీక్షల వ్యవహారంలో తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో శనివారం కూడా విచారణ కొనసాగనుంది.

వాయిదానే మేలు: ఉపాధ్యాయ సంఘాలు

రాష్ట్రంలో కరోనా కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో రిస్కు తీసుకుని పదో తరగతి పరీక్షలు నిర్వహించడం కంటే, రద్దు చేయడమే మేలని రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పది పరీక్షల నిర్వహణలో కొంతమేరకు గందరగోళ పరిస్థితులే ఉంటాయని, ఈ క్రమంలో ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందని తెలంగాణ గుర్తింపు స్కూల్‌ యాజమాన్యాల సంఘం (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరిశేఖర్‌రావు అన్నారు. 


logo