గురువారం 09 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:31

ఒక్క బోగీ అదనంగా వేయలేరా?

ఒక్క బోగీ అదనంగా వేయలేరా?

  • వలసకూలీల పట్ల మానవత్వం లేదా
  • రైల్వేశాఖకు హైకోర్టు మొట్టికాయలు
  • డీఆర్‌ఎం హాజరుకావాలని ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీహార్‌ తదితర రాష్ర్టాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వలసకార్మికుల కోసం ఒక్క బోగీ అదనంగా వేయడానికి రైల్వేశాఖకు కనికరం కలుగడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సొంతూళ్లకు వెళ్లేందుకు శిబిరంలో ప్రస్తుతం వేచివున్న 95 మంది  కార్మికులను ఒకేసారి త రలించడానికి అదనంగా ఒక బోగీ ఏర్పాటు చేయవచ్చు కదా అని ధర్మాసనం రైల్వేశాఖను ప్రశ్నించింది.  సంక్షోభ సమయంలో కూడా రైల్వేశాఖ వలస కార్మికుల పట్ల మానవత్వం చూపడం లేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉన్నతాధికారుల కుటుంబాలు వెళ్లడానికి, వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు ప్రత్యేక బోగీలు కేటాయిస్తారని, వలసకార్మికుల కోసం ఎందుకు కేటాయించలేరని ప్రశ్నించింది.  ఈసారి విచారణకు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. 

మనోరంజన్‌ కాంప్లెక్స్‌ను పరిశీలించలేదు

మనోరంజన్‌ కాంప్లెక్స్‌లో వలసకార్మికులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లుచేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వివరణ ఇచ్చారు. ప్రస్తుత వసతి కేంద్రంలో కొద్దిమందికి వసతి ఏర్పాట్లు సరిపోతాయని తెలిపారు. మనోరంజన్‌ కాంప్లెక్స్‌లో ఖాళీలేదని అధికారులు ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రస్తుతం హౌసింగ్‌ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ఆ భవనంలో ఎన్ని హాల్స్‌, గదులు ఉన్నాయో హైకోర్టు రిజిస్ట్రీ అధికారులు స్వయంగా పరిశీలించారని ధర్మాసనం పేర్కొన్నది.  

గుంపులను నిరోధించేందుకే చర్యలు

కరోనా నేపథ్యంలో రాజకీయ పార్టీల పిలుపుమేరకు ప్రజలు గుంపులుగా చేరకుండా అడ్డుకునేందుకే తాము చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని పోలీసుశాఖ హైకోర్టుకు తెలిపింది. స్వేచ్ఛగా తిరిగే తమ హక్కును ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై పోలీసుశాఖ తరఫున అదనపు డీజీపీ రాజీవ్త్రన్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారమే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజాభద్రత, ఆరోగ్యానికి హాని కలిగించే కార్యక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. 


logo