సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 17:10:37

పిల్‌పై విచారణ జరుపుతాం.. గ్రేటర్‌ ఎన్నికలపై స్టే ఇవ్వలేం : హైకోర్టు

పిల్‌పై విచారణ జరుపుతాం.. గ్రేటర్‌ ఎన్నికలపై స్టే ఇవ్వలేం : హైకోర్టు

హైదరాబాద్‌ :  జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఆపాలంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిల్‌లో పేర్కొన్నారు. అత్యవసర పిటిషన్‌గా స్వీకరించి విచారణ చేపట్టాలని దాసోజ్‌ శ్రవణ్‌ తరపు న్యాయవాది అభ్యర్థించారు. దీంతో పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాజకీయంగా వెనుకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని, విద్యారంగంలో బీసీల రిజర్వేషన్లు, రాజకీయ బీసీల రిజర్వేషన్లు వేర్వేరని న్యాయవాది వాదించారు. దీంతో స్పందించిన హైకోర్టు.. ఎంబీసీల రాజకీయ రిజర్వేషన్లపై పదేళ్ల క్రితమే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని, నాటి నుంచి ఏం చేస్తున్నారని పిటిషన్‌ దారులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. 

ఎంబీసీలపై ప్రేముంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదని చురకలంటించింది.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వబోయే చివరి క్షణంలో రిజర్వేషన్లు గుర్తుకు వచ్చాయా.? అంటూ ప్రశ్నించింది. రాజకీయ దురుద్దేశంతోనే ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారని మండిపడింది. ఎన్నికలు ఆపే రాజకీయ ప్రణాళికలతోనే పిల్‌ దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్‌పై విచారణ  జరుపుతాం కానీ ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి, జీహెచ్‌ఎంసీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.