ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 01:52:57

రాష్ట్ర సర్కారు భేష్‌

రాష్ట్ర సర్కారు భేష్‌

  • కరోనా కట్టడిలో చర్యలు ప్రశంసనీయం
  • ప్రభుత్వ, అధికారుల సేవలు అభినందనీయం
  • కరోనా యోధులు అపార్థం చేసుకోవద్దు
  • ప్రభుత్వాన్ని విమర్శించాలనేది ఉద్దేశంకాదు
  • లోపాలు సరిదిద్దాలనేదే మా ప్రయత్నం
  • ప్రభుత్వ దవాఖానల సేవలు విస్మరించలేనివి
  • కొవిడ్‌పై పిటిషన్ల విచారణలో హైకోర్టు 
  • 24 గంటలూ శ్రమిస్తున్నాం.. సీఎస్‌ వివరణ
  • కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం 

కృషిచేస్తున్నప్పటికీ.. ప్రైవేటు దవాఖానలను నియంత్రించడం కూడా కీలకమే. ప్రైవేటు దవాఖానలపై అందుతున్న ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలి. చికిత్స బిల్లులపై ప్రభుత్వం నిర్ధారించిన గరిష్ఠ పరిమితిని, జీవోలను ఉల్లంఘించే దవాఖానలపై కఠినంగా వ్యవహరించక తప్పదు.

తెలుగులో వెలువడుతున్న పత్రికల్లో వార్తలు రెండురకాలుగా వస్తున్నట్టు మా అవగాహనకు వచ్చింది. ఒకవర్గం వాస్తవానికి కొంత దగ్గరగా కథనాలు రాస్తుండగా.. మరోవర్గం పత్రికలు కేవలం విషయాన్ని సంచలనం చేయడానికే వార్తలు రాస్తున్నట్టు అవగతమవుతున్నది. కేవలం సంచలనం కోసం రాసిన కథనాలను పిటిషనర్లు మా వద్ద ప్రస్తావించవద్దు. పత్రికల్లో వచ్చే సమస్యలపై మొదట అధికారులకు ఫిర్యాదుచేయాలి. వాటి నిజానిజాలు బయటకొచ్చిన తర్వాత హైకోర్టుకు రావాలి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యసిబ్బంది, వైద్యాధికారులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వసేవలను హైకోర్టు అభినందించింది. కొవిడ్‌ కట్టడి, చికిత్సా విధానంలో 99% పర్‌ఫెక్షన్‌ వచ్చిందని వ్యాఖ్యానించింది. గతంలో తాము చేసిన వ్యాఖ్యలను కరోనాపై పోరాటం చేస్తున్న యోధులు అపార్థం చేసుకోవద్దని కోరింది. అప్రమత్తం చేసేందుకే కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొన్నది. కరోనా చికిత్స తదితర అంశాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోమారు విచారణ చేపట్టింది. 

విచారణకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యశాఖ యంత్రాంగం సేవలను హైకోర్టు ధర్మాసనం శ్లాఘించింది. ఇప్పటివరకు 99% పర్‌ఫెక్షన్‌ వచ్చిందని, దీనిని ఇలాగే ముందుకుతీసుకెళ్తూ కరోనా చికిత్స అందించే విషయంలో ఆదర్శంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వ యంత్రాంగం ద్విగుణీకృత ఉత్సాహంతో ముం దుకు వెళ్లాలని ఆకాంక్షించింది. కరోనా విషయంలో భారత్‌ ఇంకా పీక్‌స్టేజ్‌కు చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉండటంతోపాటు అప్రమత్తంగానూ ఉండాలని ధర్మాసనం పేర్కొన్నది. కొవిడ్‌పై యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది.

ప్రైవేటు దవాఖానాలను కట్టడి చేయాల్సిందే..

కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం కృషిచేస్తున్నప్పటికీ.. ప్రైవేటు దవాఖానలను నియంత్రించడం కూడా కీలకమైన అంశమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేటు దవాఖానలపై అందుతున్న ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇందుకోసం చీఫ్‌సెక్రటరీ నేతృత్వంలో ప్రజాఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించింది. చికిత్స బిల్లులపై ప్రభుత్వం నిర్ధారించిన గరిష్ఠ పరిమితిని, ఇతర ప్రభుత్వ జీవోలను ఉల్లంఘించే దవాఖానలపై కఠినంగా వ్యవహరించక తప్పదని స్పష్టంచేసింది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందిన ప్రైవేటు హాస్పిటళ్లు ఎంతమేరకు పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాయో పరిశీలించాలని.. ఒకవేళ ఉచిత వైద్యం అందకపోతే లోపాలు ఎక్కడ ఉన్నాయో పరిశీలించి సరిచేయాలని ఆదేశించింది. 

ప్రైవేటులోనూ పేదలకు పడకల రిజర్వు

ఢిల్లీ తరహాలో ప్రైవేటు దవాఖానల్లో కరోనా చికిత్సకోసం ప్రభుత్వం కొన్ని పడకలను పేదల కోసం రిజర్వ్‌ చేయాలని హైకోర్టు సూచించింది. రసూల్‌పుర హాకీ మైదానం, లాలాపేట మైదానం వంటి వాటిల్లో ఎన్జీవోలతో కలిసి ఐసొలేషన్‌ కేంద్రాల ఏర్పాటును పరిశీలించాలని ఆదేశించింది. ప్రభుత్వం జారీచేసే హెల్త్‌ బులెటిన్‌లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల వివరాలు తెలుపాలని పేర్కొన్నది. 21 నుంచి 50 ఏండ్ల వయస్సువారు ఎక్కువగా కరోనా ముప్పును ఎదుర్కొంటున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నందున.. వారిని నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించింది. కరోనా కట్టడిలో ప్రభుత్వ యంత్రాంగం రానున్న రోజుల్లో కూడా ఇదే తరహా పనితీరును కనబరుస్తుందని ధర్మాసనం ఆకాంక్షించింది. తదుపరి విచారణకు చీఫ్‌ సెక్రటరీకి మినహాయింపు ఇచ్చిన ధర్మాసనం.. ఆయన విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని తెలిపింది. పబ్లిక్‌హెల్త్‌ డైరెక్టర్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ విచారణకు హాజరైతే సరిపోతుందని తెలిపింది. ఈ మేరకు విచారణను సెప్టెంబర్‌ 4వ తేదీకి వాయిదా వేసింది. 

మీడియాలో రెండురకాల వార్తలు.. సంచలనం కోసమే

తెలుగులో వెలువడతున్న పత్రికల్లో వార్తలు రెండురకాలుగా వస్తున్నట్టు తమ అవగాహనకు వచ్చిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకవర్గం వాస్తవానికి కొంత దగ్గరగా కథనాలు రాస్తుండగా.. మరోవర్గం పత్రికలు కేవలం విషయాన్ని సంచలనం చేయడానికే వార్తలు రాస్తున్నట్టు అవగతమవుతున్నదని పేర్కొన్నది. ఓ పత్రికలో కరోనా పరీక్షలు, చికిత్స సరిగాచేయడం లేదని వచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు ప్రస్తావించగా.. హైకోర్టు ఈ వ్యాఖ్య లు చేసింది. పత్రికల్లో వచ్చేది నిజమని ఎలా నమ్మాలంటూ ప్రశ్నించింది. కేవలం సంచలనం కోసం రాసిన కథనాలను తమవద్ద ప్రస్తావించవద్దని పేర్కొన్నది. పత్రికల్లో వచ్చే సమస్యలపై మొదట అధికారులకు ఫిర్యాదుచేయాలని, వాటి నిజానిజాలు బయటకొచ్చిన తర్వాత హైకోర్టుకు రావాలని వ్యాఖ్యానించింది. ఒకటి రెండేండ్ల కింద వచ్చిన పత్రికల విశ్వసనీయత ఎలాంటిదని ధర్మాసనం ప్రశ్నించింది.

కరోనా కట్టడికి 24 గంటలూ శ్రమిస్తున్నాం: సీఎస్‌


రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం రాత్రీపగలు తేడాలేకుండా 24 గంటలూ కష్టపడుతున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ హైకోర్టుకు తెలిపారు. వైరస్‌ ముప్పు ఉన్నప్పటికీ వైద్యులు, సిబ్బంది లెక్కచేయకుండా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర బృందాలకు రాష్ర్టానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ నెల 3 నుంచి ఇప్పటివరకు దాదాపు 42 వేల మంది సెకండరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాల్లో మొత్తం 86 కొవిడ్‌ చికిత్సా కేంద్రాలు ఉన్నాయని, హోటళ్లలో ఐసొలేషన్‌ పడకలు 857 నుంచి 2,995కు పెరిగాయని తెలిపారు. 

బులెటిన్‌లో అస్పష్టత లేకుండా చర్యలు తీసుకున్నామని.. హైకోర్టు ఆదేశాలమేరకు వాటిని తెలుగులోనూ ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లు శక్తిమంతంగా కనిపిస్తున్నాయని, దాదాపు 30 దవాఖానలు వివరణ కూడా ఇవ్వలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ జీవోలను, ఉత్తర్వులను ఉల్లంఘించే హాస్పిటళ్ల లీజులను, భూ కేటాయింపులను ఎందుకు రద్దు చేయరాదో వివరాలు సమర్పించాలని కోరింది. సీఎస్‌ సమాధానస్తూ.. కరోనా మృతదేహాలను తరలించేందుకు 61 ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు ఉపయోగకరంగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఈ పరీక్షలను చేస్తున్నారని తెలిపారు. 

ప్రభుత్వ దవాఖానల్లోని అన్ని పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారం ప్రైవేటు హాస్పిటళ్లకు నోటీసులు జారీచేసి, విచారణ చేస్తున్నామని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు దవాఖానలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రైవేటు దవాఖానలపై 50 ఫిర్యాదులు రాగా 46 దవాఖానలకు షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్టు వివరించారు. రాష్ట్రంలో ఒక్కరోజుకు 40 వేల రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధంచేస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా తగ్గుముఖం పడుతున్నదని వివరించారు. హితం యాప్‌ను ఇప్పటివరకు 46 వేల మంది వినియోగించారని ఈ యాప్‌ పనితీరును నీతిఆయోగ్‌ ప్రశంసించిందని సీఎస్‌ హైకోర్టుకు తెలిపారు. హితం యాప్‌ను యూజర్‌ ఫ్రెండ్లీగా రూపొందించామని, కరోనా బాధితులు ఒక్క బటన్‌ నొక్కి ఎంటరైతే.. మిగతా అంశాలు వారికి వైద్యం అందించే డాక్టర్లే చూసుకుంటారని వివరించారు.


దేశవ్యాప్త పరిస్థితులతో పోల్చుకుంటే కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్రప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తున్నది. వైరస్‌పై పోరాటం చేస్తున్న కరోనా యోధులు మా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దు. యంత్రాంగాన్ని, వ్యవస్థను చక్కదిద్దాలనే ఉద్దేశంతోనే కఠినంగా మాట్లాడాల్సి వస్తున్నది. ప్రభుత్వాన్నిగానీ, వైద్యశాఖనుగానీ విమర్శించాలనేది మా ఉద్దేశం కాదు. కరోనా కట్టడిలో ప్రభుత్వం, అధికారులు చాలా కష్టపడుతున్నారు. ప్రభుత్వ దవాఖానల సేవలు విస్మరించలేనివి.

- హైకోర్టు వ్యాఖ్యలు


logo