e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home టాప్ స్టోరీస్ వైరస్‌ కట్టడిపై ప్రభుత్వ చర్యలు భేష్‌

వైరస్‌ కట్టడిపై ప్రభుత్వ చర్యలు భేష్‌

వైరస్‌ కట్టడిపై ప్రభుత్వ చర్యలు భేష్‌
  • ఇలాగే ముందుకు సాగండి
  • హైకోర్టు ప్రశంసల జల్లు

హైదరాబాద్‌, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కట్టడికోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు కొనియాడింది. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ అమలుచేస్తున్న పోలీసులను ప్రశంసించింది. హైకోర్టు ఆదేశాలను అమలుచేసిన ప్రభుత్వ సిబ్బందిని అభినందించింది. కరోనాపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. విచారణ ప్రారంభిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు బాగున్నాయని ఇదేవిధంగా ముందుకు సాగాలని ప్రశంసించింది. కరోనా కట్టడికి ఎదురవుతున్న పలు సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని అభిప్రాయపడింది. దాదాపు మూడు గంటలకుపైగా సుదీర్ఘ విచారణ జరిపింది. కరోనా క్లిష్ట సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రభుత్వ దవాఖానల్లో ఔట్‌ సోర్సింగ్‌/కాంట్రాక్ట్‌ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు జీతాలు, బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో కరోనా సోకిన వారిని, వ్యాధితో మరణించిన వారిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పరిగణించి ఆదుకోవాలని సూచించింది. గతేడాది ప్రైవేట్‌ దవాఖానల ఆగడాలను అరికట్టేందుకు, రోగుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులతో వేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీని మళ్లీ ఏర్పాటుచేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ప్రైవేట్‌ దవాఖానల్లో పడకల వివరాలను తెలియజేసే వెబ్‌సైట్‌ సమాచారం వాస్తవానికి దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.


ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ, పొరుగున ఉన్న నాలుగు రాష్ర్టాల నుంచి కరోనా బాధితులు హైదరాబాద్‌కు వస్తున్నారని, అంబులెన్స్‌లను ఆపడం లేదని చెప్పారు. బ్లాక్‌లో ప్రాణావసర మందులు అమ్ముతున్న వాళ్లపై 98 కేసులు నమోదు చేశామన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ ఎల్బీనగర్‌, చార్మినార్‌ వంటి పలు చోట్ల ఉన్నాయని చెప్పారు.

జ్వరం ఉన్న వాళ్లకు మందులివ్వటం బావుంది

ప్రభుత్వం గ్రామాల్లో ఆరోగ్య సర్వే చేయించిందని ఏజీ ప్రసాద్‌ చెప్పగానే కల్పించుకున్న హైకోర్టు.. జ్వరం ఉన్న వాళ్లకు ప్రభుత్వం మందులు ఇవ్వడం బాగానే ఉన్నదని వ్యాఖ్యానించింది. గ్రామాల్లో స్టెరాయిడ్స్‌ ఇవ్వడం లేదని, డోలో, యాంటిబయోటెక్‌ వంటివే ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసుల విషయంలోనూ ప్రభుత్వం అప్రమత్తం అయ్యిందని, ఈఎన్టీ దవాఖానలో వైద్య సేవలను సిద్ధంచేశామని చెప్పారు. హైదరాబాద్‌లో హరేకృష్ణ సంస్థ ద్వారా కమ్యూనిటీ కిచెన్‌ నిర్వహిస్తూ 50 వేల మందికి భోజనం పెడుతున్నామని తెలిపారు.

డీజీపీ, వైద్య శాఖ సంచాలకుడి నివేదికపై సంతృప్తి

కరోనా నిబంధనల అమలుపై డీజీపీ మహేందర్‌రెడ్డి సమర్పించిన నివేదిక పట్ల హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ‘ప్రాణావసర మందులను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించే వారిపై 98 కేసులు నమోదుచేశాం. ప్రభుత్వ దవాఖానల వద్ద 57 సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశాం. లాకౌడౌన్‌, రాత్రిళ్లు కర్ఫ్యూ నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నాం. వేరే రాష్ర్టాల నుంచి వచ్చే అంబులెన్స్‌లకు అనుమతి ఇచ్చాం. కరోనా మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై 4,31,823 కేసులు నమోదుచేశాం. మాస్క్‌లు పెట్టుకోనివారిపై 3,39,412 కేసులు పెట్టి రూ.31కోట్ల జరిమానా విధించాం. అందులో భౌతికదూరం పాటించలేదనే కేసులు 22,560 ఉన్నాయి’ అని డీజీపీ తన నివేదికలో పేర్కొన్నారు. రంజాన్‌ సందర్భంగా జనం గుమిగూడకుండా పోలీసులు తీసుకున్న చర్యలు బాగున్నాయని కోర్టు కొనియాడింది. విచారణకు ముగ్గురు పోలీస్‌ కమిషనర్లు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యఆరోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. ఈనెల 1 నుంచి 14 వరకు ప్రతి రోజు సగటున 69,185 పరీక్షలు నిర్వహించారని,. దేశ వ్యాప్తంగా జరిగే పరీక్షలతో పోలిస్తే తెలంగాణ సగటు శాతం సమానంగా ఉందని తెలిపారు.

వీలైతే ఉచితంగా భోజనం

ఎన్జీఓలతో ఒప్పందం చేసుకుని ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటుచేసి, ఆకలితో ఉన్న వారికి చౌకగా వీలౌతే ఉచితంగా అన్నం పెట్టే ప్రయత్నం చేయాలని కోర్టు సూచించింది. అనాథలు, వృద్ధులు, పేదవారికి టీకాల కోసం ఎన్జీవోలతో ఒప్పందం చేసుకొని ‘డ్రైవ్‌ ఇన్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని’ చేపట్టాలని తెలిపింది. వ్యాక్సినేషన్‌లో దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మల్లాపూర్‌లో గర్భిణీ మృతి చెందిన ఘటనపై విచారణ చేసి వివరాలు అందజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కరోనా ఉల్లంఘన కేసులు ఈనెల 1 నుంచి 14 వరకు

  • కరోనా నిబంధనల ఉల్లంఘనలు: 4,31,823
  • మాస్కులు లేకపోవడం: 3,39,412
  • విధించిన జరిమానా: రూ.31 కోట్లు
  • భౌతిక దూరం పాటించకపోవడం: 22,560

ప్రైవేట్‌ దవాఖానల్లో రేట్లపై మళ్లీ జీవోలు

సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌, పీపీఈ కిట్లు, రక్త పరీక్షలు వంటి వాటి సేవల్లో ప్రైవేట్‌ దవాఖానల దోపిడీని కట్టడిచేసేందుకు వాటికి గరిష్ఠంగా ఎంత బిల్లులు వసూలుచేయాలో 48 గంటల్లోగా మళ్లీ జీవోలనివ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. మూడోదశలో కరోనా పిల్లలకు కూడా పాజిటివ్‌ వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొనే కట్టుదిట్టమైన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నది. వ్యాక్సినేషన్‌ ఏయే వయసుల వారికి ఇచ్చేదీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలని తెలిపింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వైరస్‌ కట్టడిపై ప్రభుత్వ చర్యలు భేష్‌

ట్రెండింగ్‌

Advertisement