శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 01:32:54

కేసులను సత్వరమే విచారించాలి

కేసులను సత్వరమే విచారించాలి

  • హైకోర్టు సీజే జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌
  • గద్వాలలో వర్చువల్‌ విధానం ద్వారా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ప్రారంభం

గద్వాల క్రైం: మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించిన  కేసులను సత్వరమే విచారించి, నేరస్థులకు కఠిన శిక్ష పడేలా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ఆదేశించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌ విధానంలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ.. విచారణ త్వరగా జరిగేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. దేశంలో దాదాపు 6,500 వరకు లైంగికదాడి సంబంధిత కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అతి తక్కువగా 97 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించా రు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆరు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  సమావేశంలో మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ న్యాయమూర్తి కేశవరావు, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జి ప్రేమావతి, కలెక్టర్‌ శృతి ఓఝా, ఎస్పీ రంజన్త్రన్‌కుమార్‌, జిల్లా ఇంచార్జి మూడో అదనపు జడ్జి శ్రీనివాసులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి వీరయ్య, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఉషాక్రాంతి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.